RANABAALI: ‘రణబాలి’ గ్లింప్స్ AI కాదు.. నిజమైన క్రియేషన్.. పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన డైరెక్టర్ రాహుల్

RANABAALI: ‘రణబాలి’ గ్లింప్స్ AI కాదు.. నిజమైన క్రియేషన్.. పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన డైరెక్టర్ రాహుల్

విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను టీ-సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ‘రణబాలి’ (RANABAALI) అనే టైటిల్‌ను ఖరారు చేయగా, సోమవారం టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

గ్లింప్స్ విడుదలైన వెంటనే, సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభించింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ, ఎట్టకేలకు తమ హీరో భారీ హిట్ కొట్టబోతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో కొంతమంది నెటిజన్లు గ్లింప్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, దీనిని పూర్తిగా ఏఐ సహాయంతో రూపొందించారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఏఐ కాకుండా రియల్ విజువల్స్‌ను ప్రెజెంట్ చేసి ఉంటే మరింత గూస్‌బంప్స్ వచ్చేవని అభిప్రాయపడుతున్నారు. 

ఈ క్రమంలోనే డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ క్లారిటీ ఇచ్చారు. గ్లింప్స్‌లో కనిపించే ప్రతి ఫ్రేమ్‌ను పాత పద్ధతుల్లోనే ఎంతో కష్టపడి డిజైన్ చేసినట్లు తెలిపారు. ఈ వీడియోను సిద్ధం చేయడానికి తన టీమ్‌కు కొన్ని నెలల సమయం పట్టిందని, ఎక్కడా కృత్రిమ మేధ (AI) సహాయం తీసుకోలేదని స్పష్టం చేశారు. దీంతో ఏఐ వినియోగంపై వచ్చిన వార్తలకు పూర్తిగా చెక్ పడింది. ఇక ఈ విషయం తెలుసుకున్న రౌడీ ఫ్యాన్స్.. టెక్నాలజీ సాయం లేకుండానే ఇంతటి హై-క్వాలిటీ ప్రమోషనల్ వీడియోను అందించినందుకు దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నెటిజన్లు సైతం టీమ్ కృషిని ప్రశంసిస్తూ అభినందనలు తెలుపుతున్నారు.

గ్లింప్స్ విషయానికి వస్తే..

1854 నుంచి 1878 మధ్యకాలంలో, బ్రిటీష్ పాలన సమయంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పంటలతో పచ్చగా ఉన్న గ్రామాలను బ్రిటీష్ పాలకులు ఎలా కరువు ప్రాంతాలుగా మార్చారన్న అంశాన్ని గ్లింప్స్‌లో ప్రభావవంతంగా చూపించారు.

►ALSO READ | OTTUpdate: థియేటర్ రిలీజ్ లేకుండానే.. నేరుగా ఓటీటీలోకి కార్తి కొత్త మూవీ

అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో రైల్వే లైన్ల నిర్మాణం పేరుతో దక్షిణాది ప్రజల నోటిదగ్గర ఆహారాన్ని లాక్కొని, సముద్ర మార్గం ద్వారా ఇతర దేశాలకు తరలించిన దోపిడీని కూడా కథలో భాగం చేశారు. హిట్లర్ ఊచకోతను మించిన మారణహోమానికి కారణమైన బ్రిటీష్ అధికారి సర్ థియోడోర్ హెక్టార్ పాత్రలో ‘మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ నటిస్తున్నారు.

బ్రిటీష్ అధికారిని గుర్రానికి కట్టి రైల్వే ట్రాక్‌పై ఈడ్చుకెళ్లే రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించిన తీరు గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జయమ్మ అనే కీలక పాత్రలో రష్మిక మందన్న నటిస్తోంది. ఈ సినిమాను సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.