రోషన్ కనకాల హీరోగా ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల కానుంది. శుక్రవారం ఈ చిత్రం నుంచి ‘సయ్యారే’ అంటూ సాగే మొదటి పాటను రిలీజ్ చేశారు. కాల భైరవ సాంగ్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ హార్ట్ టచ్చింగ్ లిరిక్స్ అందించారు.
కాల భైరవ, ఐశ్వర్య దారురి కలిసి పాడిన తీరు ఆకట్టుకుంది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన ఎంఎం కీరవాణి మాట్లాడుతూ ‘ఈ పాట చాలా బాగుంది. ‘కలర్ ఫొటో’ తర్వాత వచ్చిన అతి పెద్ద నిశ్శబ్దాన్ని శబ్దంగా మార్చబోతున్న సందీప్‌కి శుభాకాంక్షలు. సుమ గారితో ఉన్న ఆత్మీయ అనుబంధంతో రోషన్‌ని ఆశీర్వదించడానికి ఈ వేడుకకి వచ్చాను. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’ అని చెప్పారు.
రోషన్ మాట్లాడుతూ ‘కాలభైరవ ఈ పాటని చాలా ప్రేమతో కసితో చేశాడు. చంద్రబోస్ గారు తన లిరిక్స్‌తో పాటకి ప్రాణం పోశారు. ఆడియెన్స్ సినిమాను ప్రేమిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నాడు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని హీరోయిన్ సాక్షి మడోల్కర్ చెప్పింది. ‘సయ్యారే’ పాట నచ్చితే దానికి పది రెట్లు సినిమా నచ్చుతుంది. ఇది హండ్రెడ్ పర్సంట్ ఫ్యామిలీ ఫిల్మ్. మంచి ఎమోషన్స్, కామెడీ సహా అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా’ అని డైరెక్టర్ సందీప్ రాజ్ తెలిపాడు. పెద్ద స్పాన్ ఉన్న మూవీ ఇదని నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ, నటుడు వైవా హర్ష పాల్గొన్నారు.
