
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూసిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఓజీ' (ఓజాస్ గంభీర) బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది! గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, బుధవారం రాత్రి వేసిన ప్రీమియర్ షోల నుంచే హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్‌ను పూర్తి స్థాయి మాఫియా డాన్ పాత్రలో చూసిన అభిమానులు థియేటర్ల వద్ద పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఈ బ్లాక్‌బస్టర్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
నాటి అభిమాని.. ఇప్పుడు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్!
దర్శకుడు సుజీత్ మాటల్లో ఓ అభిమాని ఆనందం, దర్శకుడి గర్వం స్పష్టంగా కనిపించాయి. "మూడేళ్ల కష్టం ఈ 'ఓజీ' చిత్రం. మొదటి రోజు నుంచి మా వెన్నంటి ఉండి, మాకు అన్నీ సమకూర్చిన నిర్మాతలు దానయ్య, కళ్యాణ్ దాసరికి కృతజ్ఞతలు తెలిపారు. కానీ, ఈ కథకు ఇంత భారీతనం, ఇంత పవర్ రావడానికి కారణం పవన్ కళ్యాణ్‌గారే! నేను ఆయనకు వీరాభిమానిని. 'జానీ' సినిమా చూసినప్పుడు ఆయన్ను ఒక్కసారైనా కలిస్తే చాలనుకునేవాడిని. అలాంటిది ఇవాళ ఆయన్నే డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. పైగా, ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఓ అభిమానికి ఇంతకన్నా ఏం కావాలి? ఇది నా జీవితంలో అతిపెద్ద డ్రీమ్ నెరవేరిన సందర్భం" అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. తమన్, నవీన్ నూలి (ఎడిటర్), రవి చంద్రన్ (సినిమాటోగ్రాఫర్) ఈ సినిమాకు మూడు పిల్లర్లుగా నిలిచారని, ముఖ్యంగా తమన్ తనను, ఈ కథను అందరికంటే ఎక్కువగా నమ్మారని సుజీత్ కొనియాడారు.
'ఓజీ' ని ప్రజలు ఓన్ చేసుకున్నారు!
సినిమా విడుదలకు ముందు మేము ఏ నమ్మకంతో ఉన్నామో, అది నిజమైందన్నారు సంగీత దర్శకుడు ఎస్. థమన్. కానీ, ఈ విజయం తరువాత నా భయం, నా బాధ్యత రెండూ పెరిగాయి. 'ఓజీ' కేవలం మా సినిమా కాదు, ప్రేక్షకులు దీనిని ఓన్ చేసుకున్నారు. ఎక్కడ చూసినా 'ఓజీ' హంగామానే కనిపిస్తోంది. అది పవన్ కళ్యాణ్ గారికి ఉండే పవర్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను ఇలాంటి పవర్‌ఫుల్ పాత్రలో చూడాలన్న నాలాంటి ఎందరి డ్రీమ్ ఈ చిత్రంతో నెరవేరింది. ఈ సినిమా పట్టాలెక్కడానికి పరోక్షంగా కారణమైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
'త్రివిక్రమ్ సూచించారు, నాగవంశీ టైటిల్ ఇచ్చారు!'
ఓజీ ఇంతటి సక్సెస్ సాధించిన ఆనందంతో మాటలు రావడం లేదంటూ, ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ధన్యవాదాలు చెప్పారు నిర్మాత డీవీవీ దానయ్య . పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు, దర్శకుడు సుజీత్ పేరును త్రివిక్రమ్ గారే సూచించారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు, నాకు ఇంత పెద్ద విజయం వచ్చేది కాదు అని స్పష్టం చేశారు. పవన్ అభిమానులకు నచ్చే సినిమా ఇవ్వాలనే శ్రద్ధతో పని చేశామని తెలిపారు.
తమన్, నవీన్‌లతో తమకు అనుబంధం ఉందని, ఈ సినిమా పంపిణీలో తాము కూడా భాగస్వామ్యులయ్యామని నిర్మాత నాగవంశీ తెలిపారు. "ఓజీ సినిమా చూసి, 'మా 12 ఏళ్ళ ఆకలి తీర్చారు' అంటూ అభిమానులు చెబుతుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. సుజీత్, తమన్, నవీన్‌లలో పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమ అంతా స్క్రీన్ మీద అద్భుతంగా కనిపించింది అన్నారు.