TRS పార్టీలో నివురుగప్పిన అసమ్మతి

TRS పార్టీలో నివురుగప్పిన అసమ్మతి

రంగారెడ్డి జిల్లా, వెలుగు:

అధికారపార్టీలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా మారింది.   ఇటీవల మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్​ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డికి స్థానం దక్కడం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో  అధికారపార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఉద్యమకాలం నుంచి పార్టీని అంటిపెట్టకున్న నేతలను పక్కనబెట్టి ఇతర పార్టీల నేతలకు అగ్రతాంబూలం ఇవ్వడంపై  జిల్లా నేతలు, ప్రజా ప్రతినిధులు నర్మగర్భంగా ఉన్నారు.  ఇతర జిల్లాల్లో సైతం   పార్టీ అధిష్టానం పార్టీ గుర్తుపై గెలిచిన వారిని కాదని  ఇతరపార్టీల నేతలకే ప్రాధాన్యత ఇస్తున్న దాఖలాలను నెమరువేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాడర్​ను కాపాడుకుంటూ మరో నాలుగున్నరేండ్ల పాటు పార్టీలో పడి ఉండడమా ? రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యామ్నంవైపు చూడడమా ? అనే సందిగ్ధతలో యోచనలో వారు తలమునకలై ఉన్నారు.  ఉమ్మడి జిల్లాకు మొన్నటి దాకా పెద్ద దిక్కుగా ఉన్న అగ్రనేత నిర్ణయం కోసం జిల్లాలోని నాయకులు వేచిచూస్తున్నారు.

కమలంతో కరచాలనం

జిల్లాలోని అగ్రనేతలు కొందరు ఇప్పటికే కమలం పార్టీ నేతలతో కరచాలనం మొదలైంది. మాజీ ఎంపీ జితేందర్​రెడ్డి మద్యవర్తిత్వంతో వారు మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం.  అధికార పార్టీ నుంచి వచ్చే నేతలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి,  పార్టీ అధ్యక్షుడు డాక్టర్​ కె.లక్ష్మణ్​ల నుంచి స్పష్టమైన హామీ  పొందారని తెలుస్తున్నది.  అయితే తమతో పాటు తమ అనుచరులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని  కోరినట్లు  సమాచారం.

బుజ్జగింపులు

ఉమ్మడి జిల్లాలో  అసంతృప్తితో ఉన్న నాయకులకు అధికారపార్టీ బుజ్జగింపుల పర్వానికి తెరదీసింది.   టీఆర్ఎస్‌ రాష్ట్ర కమిటీ నేతలు  సదరు నాయకుడితో వ్యక్తిగత చర్చలు జరిపినట్లు  తెలుస్తున్నది.  వారం రోజుల క్రితం బీజేపీ  నేతలకు టచ్‌లో ఉన్న నాయకుడితో చేవెళ్ల పార్లమెంట్‌ టీఆర్ఎస్‌ ఇన్​చార్జి, పార్టీ జనరల్‌ సెక్రటరీ, పరిగి ఎమ్మెల్యే కలిసి బీజేపీ వైపు చూస్తున్న నాయకుడి ఇంటికి వచ్చి వారి కుటుంబంతో చర్చలు జరిపారు. అయనప్పటికీ సదరు నేత  సంతృప్తి చేందలేదనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది.   ప్రజల్లో విస్తృతంగా పర్యటించే సదరు నాయకుడు ఇటీవల కాలంలో  ఇంటికే పరిమితం కావడం గమనార్హం.