మెదక్ చర్చ్ : బిషప్​పై హత్యాయత్నంతో ముదిరిన విభేదాలు

మెదక్ చర్చ్ : బిషప్​పై హత్యాయత్నంతో ముదిరిన విభేదాలు

మెదక్, వెలుగు: చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా(సీఎస్ఐ) మెదక్ డయసిస్ లో వర్గపోరు బయటపడింది. చర్చిలో పాస్టరేట్ కమిటీ ఎన్నికలు, పాలకవర్గ పదవుల నియామకం విషయంలో బిషప్ వర్గానికి, మరో వర్గానికి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలో  బిషప్ పై హత్యయత్నం జరగడం, ప్రత్యర్థి వర్గానికి చెందిన ఐదుగురిపై కేసు నమోదు కావడం చర్చిలో చర్చనీయాంశమైంది. గొడవల కారణంగా చర్చి ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

సీఎస్ఐ పరిధిలో.. 

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన క్యాథడ్రల్​చర్చి కొలువై ఉన్న మెదక్ పట్టణం సీఎస్ఐకి కేంద్ర స్థానం. సీఎస్ఐ మెదక్ డయాసిస్​ పరిధిలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్​, రంగారెడ్డి, హైదరాబాద్ ​జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల పరిధిలో పలు చర్చిలతోపాటు, స్కూల్​లు, కాలేజీలు, హాస్టల్​లు, డేకేర్​ సెంటర్​లు, స్వయం ఉపాధి కల్పన కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటికి ఆయా ప్రాంతాల్లో రూ.కోట్ల విలువైన స్థలాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం డయాసిస్​ బిషప్​ గా రెవరెండ్ సాల్మన్​ రాజ్​ ఉన్నారు. చర్చి నిర్వహణ, ఫెస్టివల్స్ ఆర్గనైజింగ్, సీఎస్ఐ ఆవిర్భావ దినోత్సవంతోపాటు స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్​నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ బాధ్యత పాస్టరేట్​ కమిటీకి ఉంటుంది. సీఎస్​ఐ బైలా ప్రకారం ఎన్నికలు నిర్వహించి పాస్టరేట్​ కమిటీని ఏర్పాటు చేస్తారు. 

ఎన్నికలతో వివాదం...

గత నెల 1న పాస్టరేట్​ కమిటీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలో ఆఫీస్​ బేరర్స్​ ఎంపిక వివాదాస్పదంగా మారింది. సీఎస్‌‌‌‌ఐ రూల్స్​ప్రకారం ఎక్కువ మంది సభ్యులు గెలిచిన వారితో పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా తక్కువ మంది సభ్యులు ఎన్నికైన వారికి కమిటీలో చోటు కల్పించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో గంట సంపత్​ ప్యానెల్​ నుంచి 11 మంది, రోలాండ్​ పాల్ ప్యానెల్​ నుంచి ఏడుగురు గెలుపొందారు. రూల్స్​ప్రకారం మెజారిటీ సభ్యులు గెలుపొందిన వారికి పాలకవర్గంలో పదవులు దక్కాలి. అయితే బిషప్​ తన విచక్షణాధికారాలతో పలువురు సభ్యులను నామినేట్​ చేశారు. వారు రోలాండ్​ పాల్​ ప్యానెల్​ను సపోర్టు చేయడంతో పాలకవర్గ పదవులన్నీ ఆ ప్యానెల్​కే దక్కాయి. బిషప్​ ఉద్దేశపూర్వకంగా ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొందిన తన ప్యానెల్​కు పదవులు దక్కకుండా చేశారని గంట సంపత్​ వర్గం ఆరోపిస్తోంది. గత నెలలో సంపత్​ వర్గం చర్చి వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టింది.

పాస్టరేట్​ కమిటీ పాలకవర్గం విషయంలో బిషప్‌‌‌‌ సాల్మన్‌‌‌‌ రాజ్,  ప్రెసిబిటరీ  ఇన్​చార్జి జార్జ్‌‌‌‌లు ఏకపక్షంగా వ్యవహరించి తమ ప్యానెల్​కు అన్యాయం చేశారంటూ గంట సంపత్​ ఆధ్వర్యంలో వారిద్దరి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ విషయంపై చెన్నైలోని సినాడ్‌‌‌‌ ఆఫీస్​లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పాస్టరేట్ కమిటీ ఎన్నికల తీరుపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని సంపత్​వర్గం డిమాండ్​ చేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం చర్చి వద్ద బిషప్​ సాల్మన్​రాజ్​పై హత్యాయత్నం జరగడంతో వివాదం కొత్తమలుపు తిరిగింది. హత్యాయత్నం చేసిన రాంచందర్, సంపత్, ప్రభాకర్, నోబెల్సన్, సుమిత్ రాజ్, సుజిత్ రాజ్ , రాజ్ కిరణ్ లను అరెస్టుచేసి రిమాండ్ కు పంపినట్టు మెదక్​ టౌన్​ సీఐ మధు తెలిపారు. వారి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటన నేపథ్యంలో చర్చిలో విభేదాలు ఏం మలుపు తీసుకుంటాయోనన్న చర్చ మొదలైంది.