35 ఏండ్ల కింద అదృశ్యమై పుస్తకంలా తిరిగొచ్చిండు

35 ఏండ్ల కింద అదృశ్యమై  పుస్తకంలా తిరిగొచ్చిండు

 

  • విప్లవ కవి సహదేవ రెడ్డి రాసిన పుస్తకం దొరికింది
  • ఆయన కుటుంబసభ్యులకు అప్పగించిన విమలక్క, అమర్

హుస్నాబాద్​, వెలుగు : 35 ఏండ్ల కింద కనిపించకుండా పోయిన విప్లవ కవి పుస్తకమై తిరిగొచ్చిండు.  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​కు చెందిన విప్లవ కవి, రచయిత రిక్కల సహదేవరెడ్డి రాసిన ‘రక్తచలన సంగీతం’ కొద్ది రోజుల కింద అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్​పర్సన్​ విమలక్క, జనశక్తి నేత అమర్‌‌కు దొరికింది. దీంతో వారు శుక్రవారం ఆ పుస్తకాన్ని సహదేవరెడ్డి కుటుంబ సభ్యులకు అందజేశారు.  పుస్తకాన్ని చూడగానే ఆయన అక్కలు లచ్చవ్వ, రాజవ్వ గుండెలకు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. 

35 ఏళ్ల నుంచి తమ తమ్ముడికి చెందిన ఎలాంటి ఆనవాళ్లు లేవని, డెడ్​బాడీ కూడా దొరకకపోవడంతో ఏడ్చిఏడ్చి ఊరుకున్నామని వాపోయారు. ఎప్పుడూ పేదోళ్ల కోసం తపించేవాడని, రాజ్యం అన్యాయాలు సహించలేక విప్లవ బాట పడ్డాడని గుర్తు చేసుకున్నారు. ఇంట్లో ఉన్న సహదేవరెడ్డి పాత ఫొటోను చూసిన విమలక్క ఆనాటి రోజులను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనపై పాట పాడి నివాళులర్పించారు.  కాగా, ఈ పుస్తకాన్ని ఈనెల 28న హైదరాబాద్​లో ఆవిష్కరిస్తామని, కుటుంబ సభ్యులను తీసుకెళ్తామని విమలక్క, అమర్‌‌ చెప్పారు.