ఎల్‌‌ఐసీ లిస్టింగ్‌‌ నిరాశేనా?

ఎల్‌‌ఐసీ లిస్టింగ్‌‌ నిరాశేనా?
  • గ్రే మార్కెట్‌‌లో పడిన కంపెనీ షేర్లు
  • మార్కెట్ పడుతుండడంతో వెనక్కి తగ్గుతున్న ఇన్వెస్టర్లు..
  • భవిష్యత్‌‌లో మాత్రం షేర్లు పెరుగుతాయంటున్న ఎనలిస్టులు 

బిజినెస్ డెస్క్, వెలుగు: దేశ స్టాక్ మార్కెట్‌‌లు పడుతుండడం ఎల్‌‌ఐసీపై నెగెటివ్‌‌ ప్రభావం చూపుతోంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఎల్‌‌ఐసీ ఐపీఓ కేవలం మూడు రెట్లు మాత్రమే సబ్‌‌స్క్రయిబ్ అయ్యింది. గ్రే మార్కెట్‌‌లో కంపెనీ షేర్లు డిస్కౌంట్‌‌లో ట్రేడవుతున్నాయి. ఎల్‌‌ఐసీ ఐపీఓకి రిటైల్ ఇన్వెస్టర్లు, ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ, విదేశీ ఇన్వెస్టర్లు నుంచి మాత్రం ఆశించినంత రెస్పాన్స్ రాలేదు.  దీంతో మిగిలిన ఇన్వెస్టర్లలో కూడా ఎల్‌‌ఐసీపై అనుమానాలు పెరుగుతున్నాయి. మరోవైపు  స్టాక్ మార్కెట్లు వరస సెషన్లలో పడుతుండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటోంది. 
 

ఎందుకంటే..!
విదేశీ ఇన్వెస్టర్లు ఎల్‌‌ఐసీ ఐపీఓను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింటోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  ‘వాల్యుయేషన్‌‌ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ఐపీఓ సబ్‌‌స్క్రిప్షన్‌‌ కోసం అదనంగా టైమ్ ఇచ్చినప్పటికీ, హైనెట్‌‌ వర్త్ ఇండివిడ్యువల్స్‌‌ను, ఇన్‌‌స్టిట్యూషనల్ బిడ్డర్లను ఆకర్షించడంలో ఎల్‌‌ఐసీ ఫెయిలయ్యింది. దీంతో గ్రే మార్కెట్‌‌లో కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి’ అని అన్‌‌లిస్టెడ్ఏరియా ఫౌండర్ అభయ్‌‌ దోషి అన్నారు.  ఆర్‌‌‌‌బీఐ మానిటరీ పాలసీని కఠినతరం చేయడంతో ఈక్విటీ మార్కెట్‌‌లు నష్టాల్లో ట్రేడవుతున్నాయని, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ తగ్గుతోందని పేర్కొన్నారు.  మరోవైపు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలయిన హెచ్‌‌డీఎఫ్‌‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్‌‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి కంపెనీలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో ఎల్‌‌ఐసీ మార్కెట్‌‌లో తన ఆధిపత్యాన్ని కోల్పోతుందని  ఇన్వెస్టర్లు ఆందోళనపడుతున్నారని  ఎనలిస్టులు అన్నారు. న్యూ ఇండివిడ్యువల్ పాలసీలను తీసుకురావడంలో ప్రైవేట్ కంపెనీలు ఎల్‌‌ఐసీ కంటే వేగంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ మెజార్టీ ఎనలిస్టులు ఎల్‌‌ఐసీపై పాజిటివ్‌‌గా ఉన్నారు. మార్కెట్‌‌లో కంపెనీ  వాటా ఎక్కువగా ఉండడం, వాల్యుయేషన్ కూడా ఆకర్షణీయంగా ఉండడంతో  భవిష్యత్‌‌లో కంపెనీ షేర్లు పెరుగుతాయని చెబుతున్నారు. దేశంలో ఇన్సూరెన్స్ సెక్టార్ మరింత విస్తరిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఎల్‌‌ఐసీ ఐపీఓ ద్వారా మొత్తం రూ. 20 వేల కోట్లను ప్రభుత్వం సేకరించింది. ఇందుకోసం 22.13 కోట్ల షేర్లను అమ్మింది.
 

నష్టాల్లో లిస్టింగ్‌‌?
ఎల్‌‌ఐసీ షేర్లు ఈ నెల 17 న మార్కెట్‌‌లో లిస్టింగ్ కానున్నాయి. గ్రే మార్కెట్‌‌ పరంగా చూస్తే, కంపెనీ షేర్లు డిస్కౌంట్‌‌లో లిస్టింగ్ అవుతాయని ట్రేడర్లు భావిస్తున్నారు. కంపెనీ షేర్లు నెల కిందట ఇష్యూ ధర (రూ. 949) కంటే రూ. 100 ఎక్కువకు ట్రేడయ్యాయి. ప్రస్తుతం ఇష్యూ  ధర కంటే రూ. 20 తక్కువకు ట్రేడవుతున్నాయని  గ్రే మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎల్‌‌ఐసీ షేర్లు గ్రే మార్కెట్‌‌లో నెల కిందట రూ. 100 ప్రీమియంతో ట్రేడవ్వగా, మంగళవారం  రూ. 10 ప్రీమియంతో ట్రేడయ్యాయని, బుధవారం నెగెటివ్‌‌లోకి జారుకున్నాయని  పేర్కొన్నాయి. ఎల్‌‌ఐసీ ఐపీఓ 3 రెట్లు సబ్‌‌స్క్రయిబ్ అయ్యింది.  గురువారం షేర్ల అలాట్‌‌మెంట్ ఉంటుంది. కంపెనీ షేర్లు ఈ నెల 17 న మార్కెట్‌‌లో లిస్టింగ్ అవుతాయి.