ఆదిలాబాద్ బల్దియాలో అవిశ్వాస లొల్లి

ఆదిలాబాద్  బల్దియాలో అవిశ్వాస లొల్లి
  •     వైస్ చైర్మెన్ జహీర్ రంజానీపై కౌన్సిలర్ల తిరుగుబాటు
  •     ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరిన వైస్ చైర్మన్
  •     చర్చనీయాశంగా మారిన అన్ని పార్టీల మద్దతు
  •     కలెక్టర్​కు తీర్మానం ఇచ్చిన కౌన్సిలర్లు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ బల్దియాలో గత కొన్ని రోజులుగా వైస్ చైర్మన్​పై అవిశ్వాసం పెడుతారనే ఊహగానాలు నిజమయ్యాయి. వైస్ చైర్మన్​గా కొనసాగుతున్న జహీర్ రంజానీపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం పెడుతున్నట్లు కలెక్టర్​కు తీర్మానం అందజేశారు. ఇటీవల ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అంతకుముందు నుంచే జహీర్ రంజానీ వ్యవహార శైలిపై అసంతృప్తితో  ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు .. తాజాగా ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానం కోరుతూ మొత్తం 33 మంది కౌన్సిలర్లు సంతకాలు చేశారు. అయితే ఇందుకు బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం మద్దతివ్వడం తీవ్ర చర్చనీయాశంగా మారింది. 

అవిశ్వాసంపై ఉత్కంఠ

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో బీఆర్ఎస్ నుంచి 24, బీజేపీ 9, కాంగ్రెస్ 13, ఎంఐఎం నుంచి మరో ముగ్గురు ఉన్నారు. అయితే అవిశ్వాస తీర్మానంలో బీఆర్ఎస్ నుంచి 23 మంది, బీజేపీ నుంచి 08, కాంగ్రెస్​కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు సంతకాలు చేశారు. ఆదిలాబాద్ బల్దియాలో అవిశ్వాసం కోసం 25 మంది నోటీసులు ఇస్తే సరిపోతుంది. అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజు 2/3 వంతు సభ్యుల మద్దతు ఉండాలి. అవిశ్వాసం పెట్టిన రోజు 34 మందికి పైగా చేతులు ఎత్తితే అవిశ్వాసం నెగ్గుతారు. 

ఈ క్రమంలో ప్రస్తుతమైన అవిశ్వాసానికి అవసరమైన మెజార్టీ బలం ఉంది. అయితే అవిశ్వాస తీర్మాం నోటీసులు ఇచ్చిన రోజే బీఆర్ఎస్ నుంచి ఇద్దరు సీనియర్ కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరడం ఉత్కంఠకు దారి తీసింది. అవిశ్వాస తీర్మానంలో ఈ ఇద్దరు కౌన్సిలర్లు సంతకాలు చేయలేదని తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి మరికొందరు కౌన్సిలర్లు కూడా తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సంతకాలు చేసిన వారిలో చివరి వరకు ఎంత మంది నిలుస్తారు అనేది ఉత్కంఠంగా మారింది. 

ప్రస్తుతం మున్సిపల్ చైర్మెన్​గా పూర్తి మెజార్టీతో బీఆర్ఎస్ నుంచి జోగు ప్రేమేందర్ కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇతర పార్టీలకు జంప్ అయ్యారు. ప్రస్తుతమున్న ఆ పార్టీ కౌన్సిలర్లు మిగతా పార్టీల మద్దతు కూడగట్టుకొని అవిశ్వాసానికి వెళ్లడం.. విపక్ష పార్టీల కీలక నేతలు సైతం దీని పట్ల సైలెంట్​గా ఉండటంతో అవిశ్వాసం తీర్మానం అనివార్యంగా కనిపిస్తోంది.