
- కేంద్ర సర్కారు తీవ్ర అన్యాయం చేసింది
- పార్లమెంట్ బయట ఇండియా కూటమి ఎంపీల నిరసన
- అధికారాన్ని కాపాడుకునేందుకు పెట్టిన బడ్జెట్ అని కామెంట్
- దేశ సమాఖ్య వ్యవస్థపై దాడిగా చూస్తున్నం: రాహుల్‌గాంధీ
- బడ్జెట్లో ఎవరికీ న్యాయం జరగలే.. పోరాటం కొనసాగుతుంది: ఖర్గే
- కేంద్ర వైఖరి రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం : కేసీ వేణుగోపాల్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఇండియా కూటమి ఎంపీలు మండిపడ్డారు. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్అని నినదించారు. సామాన్యులకు కేంద్ర సర్కారు అన్యాయం చేసిందని ఆరోపించారు. బడ్జెట్లో ఎన్డీయేతర రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిందని విమర్శించారు. ఈ మేరకు కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా బుధవారం ఉదయం సమావేశాలకు ముందు కూటమి పార్టీలకు చెందిన ఎంపీలంతా పార్లమెంట్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ ఆందోళనలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియాగాంధీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్, ఇండియా కూటమికి చెందిన పలువురు ఎంపీలు ఉన్నారు. ‘మాకు ఇండియా బడ్జెట్ కావాలి.. ఎన్డీయే బడ్జెట్వద్దు.. ఎన్డీయే బడ్జెట్లో ఇండియాకు ద్రోహం జరిగింది’ అని రాసి ఉన్న ఫ్లకార్డులను పట్టుకొని, కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అధికారాన్ని కాపాడుకునేందుకే..: రాహుల్‌గాంధీ
కేంద్ర బడ్జెట్ కేవలం అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రవేశపెట్టినట్టుగా ఉన్నదని రాహుల్‌గాంధీ విమర్శించారు. బడ్జెట్లో ఎన్డీయే కూటమి రాష్ట్రాలకు పెద్దపీట వేశారని, మిగతా రాష్ట్రాలను విస్మరించారని మండిపడ్డారు. ఎన్డీయేతర రాష్ట్రాలపై తీవ్ర వివక్ష చూపారని అన్నారు. ఇది సమాఖ్య వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి న్యాయం జరిగేలా ఇండియా కూటమి తన గళం వినిపిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.
న్యాయం కోసం పోరాడుతాం: ఖర్గే
కేంద్ర బడ్జెట్‌లో చాలా మందికి అన్యాయం జరిగిందని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. న్యాయం కోసం తాము పోరాడుతామని చెప్పారు. వారు స్పెషల్ ప్యాకేజీ గురించి మాట్లాడారని.. కానీ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇది మోసమని మండిపడ్డారు. బడ్జెట్లో ఉత్తరప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర సర్కారు ఉద్యోగాలను లాక్కొని ఇప్పుడు అప్రెంటిస్షిప్గురించి మాట్లాడుతున్నదని మండిపడ్డారు. యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఎస్పీ ఎంపీ జయాబచ్చన్ అన్నారు.
సమాఖ్య సూత్రాలను కేంద్రం ఉల్లంఘించింది : కేసీ వేణుగోపాల్
బడ్జెట్లో కేంద్ర సర్కారు సమాఖ్య వ్యవస్థ మూల సూత్రాలను ఉల్లంఘించిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విమర్శించారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే బడ్జెట్ లక్ష్యంగా ఉన్నదని తెలిపారు. ‘‘బడ్జెట్లో కేవలం రెండు రాష్ట్రాలకే అనేక నిధులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, బిహార్‌కు నిధులు ఇవ్వడాన్ని మేం వ్యతిరేకించడం లేదు. కానీ అన్ని రాష్ట్రాలకు న్యాయం జరగాలని కోరుతున్నాం. అందుకే మేం నిరసన తెలుపుతున్నాం” అని పేర్కొన్నారు. కేంద్ర సర్కారు వైఖరి రాజ్యాంగ సూత్రాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నదని అన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 27న జరగనున్న నీతి ఆయోగ్సమావేశాన్ని కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల సీఎంలు బహిష్కరించనున్నట్టు చెప్పారు.
‘గాడిద గుడ్డు’ ప్లకార్డులతో తెలంగాణ ఎంపీల నిరసన
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ బుధవారం పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు గాడిద గుడ్డు’ప్లకార్డులను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ‘ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే.. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గాడిద గుడ్డు’ అంటూ నినాదాలు చేశారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ముందుండి ఆందోళన చేశారు.
‘తెలంగాణ ద్రోహి-మోదీ’అంటూ పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై నిలదీశారు. సంసద్ భవన్ (పాత పార్లమెంట్ భవనం) నుంచి పార్లమెంట్ భవనంలో మెయిన్ గేట్ వరకు ఎంపీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. బడ్జెట్ ను ఏక పక్షంగా రూపొందించారని.. ఎన్డీయేఏతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను విస్మరించారని మండిపడ్డారు.