టీఆర్ఎస్,కమ్యూనిస్టుల పొత్తులపై చర్చ

టీఆర్ఎస్,కమ్యూనిస్టుల పొత్తులపై చర్చ

నల్గొండ/ ఖమ్మం, వెలుగు :  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్​తో కమ్యూనిస్టుల పొత్తు ఖాయమనే సంకేతాలు రూలింగ్​పార్టీలోని సిట్టింగులు, ఆశావాహుల్లో గుబులు రేపుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో తమతో పొత్తువల్లే టీఆర్ఎస్ గట్టెక్కిందని సీపీఐ, సీపీఎం లీడర్లు బలంగా నమ్ముతున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్​ సాధించిన మెజారిటీ ఈ విషయాన్ని రుజువు చేసింది. మరోవైపు టీఆర్ఎస్​కు ఈ దఫా బీజేపీ నుంచి గట్టి పోటీ తప్పేలా లేదు. దీంతో టీఆర్ఎస్​కు తమతో పొత్తు అనివార్యం కానుందని, ఇదే అదనుగా గతంలో గెలిచిన, తమకు బలం ఉన్న సెగ్మెంట్లు తమకు వదిలిపెట్టేలా పట్టుబట్టాలని కమ్యూనిస్టులు భావిస్తున్నారు. ఈసారి లెఫ్ట్​పార్టీల్లోని పెద్దలు కూడా బరిలో నిలవాలని ఆశగా ఉన్నారు. సీఎం కేసీఆర్​ సైతం కమ్యూనిస్టులతో దోస్తానాకు  ఇంట్రెస్ట్​ చూపుతుండడంతో పొత్తులు ఖాయమని, అదే జరిగితే తమ సీట్లకు ఎక్కడ ఎసరు వస్తుందోనని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్​లో టికెట్లపై ఆశలు పెట్టుకున్న సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. 

ఉమ్మడి ఖమ్మంలో మారుతున్న సమీకరణాలు 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు కోరే స్థానాలపై చర్చ జరుగుతోంది. పాలేరు, మధిర, భద్రాచలం స్థానాలను సీపీఎం, వైరా, కొత్తగూడెం సీట్లను సీపీఐ అడుగుతోందని ఆ పార్టీల ముఖ్య నేతలు చెబుతున్నారు. రెండు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారే కాగా, కొత్తగూడెంలో కూనంనేని సాంబశివరావు, పాలేరులో తమ్మినేని వీరభద్రం బరిలో ఉంటారని అంటున్నారు. పాలేరు టికెట్ కోసం టీఆర్ఎస్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి, సీనియర్ లీడర్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు పోటీ నేపథ్యంలో ఈ సీటును సీపీఎంకు కేటాయించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తమ్మినేని వీరభద్రం కూడా పాలేరుపై పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కొత్తగూడెం, వైరా సీట్లను సీపీఐకి కేటాయించేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం కొత్తగూడెం ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ ​నుంచి వనమా వెంకటేశ్వరరావు, వైరా ఎమ్మెల్యేగా రాములు నాయక్ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కొత్తగూడెం నుంచి తానే పోటీ చేస్తానని వనమా వెంకటేశ్వరరావు చెప్పుకుంటున్నప్పటికీ వనమా రాఘవ వ్యవహారం ఆయనకు మైనస్​గా మారిందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో డీహెచ్ గడల శ్రీనివాస్ టీఆర్ఎస్ నుంచి టికెట్​ ఆశిస్తున్నారు. డాక్టర్ జీఎస్ఆర్ పేరుతో ట్రస్టు పెట్టి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి సైతం కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కానీ ఆయనపై హైకమాండ్ ఆలోచన ఏమిటనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు వైరా సీటుపై సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్​తో పాటు మాజీ ఎమ్మెల్యే మదన్​లాల్ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం పొత్తులో భాగంగా ఈ రెండు సీట్లు సీపీఐకి కేటాయిస్తే  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయా పార్టీల సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ సీట్లను కూడా సీపీఐకి కేటాయించే అవకాశం లేకపోలేదు. హుస్నాబాద్​ సీపీఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సొంత నియోజకవర్గం కాబట్టి ఆయన ఆ సీటును  కోరుకునే  అవకాశాలున్నాయి. ఒకవేళ సీపీఐకి టికెట్​ కేటాయిస్తే  ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ కు హుజూరాబాద్ టికెట్ కేటాయించడమో లేదంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడమో జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇక బెల్లంపల్లి టికెట్​ను సీపీఐకి కేటాయిస్తే సిటింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సీటుకు ఎసరు వస్తుందని భావిస్తున్నారు.

నల్గొండ సీట్లకు ఖమ్మంతో లింకు.. 

ఖమ్మం జిల్లా  సీట్లపై  క్లారిటీ వస్తేనే  నల్గొండ సీట్ల వ్యవహారం కొలిక్కి వస్తుందని లెఫ్ట్​ లీడర్లంటున్నారు. ప్రస్తుతానికి మిర్యాలగూడ,  హుజూర్​నగర్ సీట్లను సీపీఎం, మునుగోడు, దేవరకొండలను సీపీఐ కోరుకుంటున్నాయి. ఈ స్థానాల్లో లెఫ్ట్​ పార్టీలు చాలాకాలం ప్రాతినిధ్యం వహించాయి.  సిట్టింగ్ లకే తిరిగి టికెట్లు ఇస్తామని కేసీఆర్  స్పష్టం చేసినప్పటికీ.. ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్న చోట్ల  ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.  దీనికి తోడ్  లెఫ్ట్​పార్టీల పొత్తు వ్యవహారం ఎమ్మెల్యేలను టెన్షన్  పెడుతోంది. టీఆర్​ఎస్​ వీక్​గా ఉన్న స్థానాలను వదిలేసి.. బలమైన మిర్యాలగూడ, హుజూర్​నగర్, మునుగోడు, దేవరకొండ స్థానాలను పొత్తులో వదులుకోవడం కరెక్ట్ కాదని టీఆర్ఎస్​ నేతలంటున్నారు.ఈ సీట్లను త్యాగం చేయాల్సి వస్తే  పార్టీకే నష్టమేనని  అంటున్నారు.  పొత్తులతో నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులకు మళ్లీ కాలం కలిసిరానుంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ పొత్తులతో లెఫ్ట్​పార్టీలు లాభపడ్డాయి.  తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని సీపీఐ దేవరకొండలో గెలుపొందింది. 2009 ఎన్నికల తర్వాత సీపీఎం ఎక్కడా గెలవలేదు. 2009 పునర్విభజనకు  ముందు హుజూర్​నగర్, మిర్యాలగూడ కలిసి ఉండగా నాలుగుసార్లు, పునర్విభజన అనంతరం 2009లో  మిర్యాలగూడలో సీపీఎం గెలిచింది. దీంతో  సీపీఎం హుజూర్​నగర్, మిర్యాలగూడల్లో  ఏదో ఒకటి ఇవ్వాలని పట్టుబట్టనుంది. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డికి ఈ రెండు చోట్ల పట్టు ఉంది.  సీపీఐ దేవరకొండలో ఐదుసార్లు, మునుగోడులో ఐదు సార్లు గెలిచింది. ప్రస్తుతం దేవరకొండలో ఆపార్టీకి బలమైన అభ్యర్థి లేనందున మునుగోడు పై  ఫోకస్ పెట్టింది.  పార్టీ సీనియర్​ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకటరెడ్డి, ఉజ్జని యాదగిరిరావు ఇక్కడ పోటీకి ఆసక్తిగా ఉన్నారు.