ఎన్నికల సంస్కరణలపై దిగొచ్చిన కేంద్రం.. డిసెంబర్ 9న పార్లమెంటులో చర్చకు ఓకే..

ఎన్నికల సంస్కరణలపై దిగొచ్చిన కేంద్రం..  డిసెంబర్  9న  పార్లమెంటులో చర్చకు ఓకే..
  • సర్​పై చర్చ కోసం ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళన
  • పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన ప్రదర్శన
  • కాంగ్రెస్ చీఫ్​ ఖర్గే, సోనియా, రాహుల్, ఎంపీలు హాజరు
  • ‘స్టాప్ సర్- స్టాప్ ఓట్​ చోరీ’ అంటూ బ్యానర్లు, ప్లకార్డుల ప్రదర్శన
  • రాజ్యసభ నుంచి వాకౌట్

న్యూఢిల్లీ, వెలుగు:
 పార్లమెంట్ లో ఎన్నికల సంఘం సంస్కరణలపై చర్చ జరుపుతామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 9న ఉభయ సభల్లో ఎన్నికల సవరణలపై చర్చిస్తామని పేర్కొంది. ఈమేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్​ రిజిజు ఉభయ సభలలో ఈ విషయాన్ని వెల్లడించారు. వందేమాతరం గేయానికి 150 వ వార్షికోత్సవంపై ఈ నెల 8న చర్చ జరుపుతామని, ఎన్నికల సంఘం సంస్కరణలపై ఈ నెల 9న మధ్యాహ్నం 12 గంటలకు చర్చ మొదలుపెడతామని తెలిపారు. 

అయితే, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పై మాత్రం ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాగా, పార్లమెంట్ సమావేశాల్లో రెండోరోజు మంగళవారం కూడా సర్ అంశం ఉభయ సభల్ని కుదిపేసింది. సర్ పై అధికార పక్షం ముందుకు రాకపోవడంతో విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. దీంతో లోక్ సభ వాయిదాలతోనే ముగిసింది. 

మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభం కాగానే.. స్పీకర్ ఓం బిర్లా జార్జియన్ పార్లమెంట్ అధ్యక్షులు షల్వా పాపువాష్విలీ నేతృత్వంలోని జార్జియా పార్లమెంట్ బృందాన్ని స్వాగతించారు. భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ప్రతీక అని స్పీకర్ అన్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందన్నారు.

లోక్ సభలో వాయిదాల పర్వం..

సర్ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో కేవలం 16 నిమిషాల్లోనే సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభంకాగానే.. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఇతర విపక్ష పార్టీల సభ్యులు వెల్​లోకి దూసుకొళ్లి సర్​పై చర్చకు డిమాండ్ చేశారు. మరోవైపు, సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించవద్దని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్ష ఎంపీలను కోరారు. అన్ని అంశాలపై చర్చలకు సిద్ధమన్నారు. 

ఒకే అంశంపై మొండిగా ఉండడం సరికాదని, ఇతర అంశాలు కూడా ఉన్నాయన్నారు. అయితే విపక్షాలు మాత్రం సర్ పై చర్చకు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో 9 నిమిషాల్లోనే మధ్యాహ్నం 2 గంటలకు సభ వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైనా.. విపక్షాలు ఆందోళనను కొనసాగించాయి. దీంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ దిగువ సభను నేటికి(బుధవారాని) వాయిదా వేశారు. రా

జ్యసభ నుంచి వాకౌట్...

అతి ముఖ్యమైన సర్​పై చర్చ జరగాలని ఎగువ సభలోనూ విపక్షాలు డిమాండ్ చేశాయి.  తొలుత రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ జార్జియ బృందానికి స్వాగతం పలికారు. అనంతరం జీరో అవర్ ను ప్రారంభించారు. వెంటనే ప్రతిపక్ష ఎంపీలు సర్, ఇతర అంశాలపై చర్చకు పట్టుబట్టారు. వెల్ లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్య సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. సర్ ఒక ముఖ్యమైన అంశంమని, దానిపై వెంటనే చర్చించాలని డిమాండ్ చేశారు. సభ సజావుగా సాగే పరిస్థితి లేకపోవడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటలకువ వాయిదా వేశారు. తిరిగి 2 గంటలకు సభ సమావేశం అయినప్పుడు.. ఎన్నికల సంస్కరణలు, ఇతర అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. 

అయితే... రాజ్య సభ రూల్ 267 ప్రకారం సర్ పై తక్షణ చర్చ చేపట్టవచ్చని మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కు టీఎంసీ, డీఎంకే, ఇతర విపక్ష పార్టీల నేతలు మద్దతు పలికారు. అనంతరం సర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభనుంచి వాకౌట్ చేశారు. అనంతరం సభ మణిపూర్ వస్తుసేవల పన్ను(రెండవ సవరణ) బిల్లు –2025 చర్చించి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సభ్యులు అత్యవసర ప్రాముఖ్యత కలిగిన అంశాలను లేవనెత్తారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేసారు.