రైతుబంధు ఆపిందెవరు?

రైతుబంధు ఆపిందెవరు?
  • రైతుబంధు ఆపిందెవరు?
  •  24వ తేదీ సాయంత్రం ఈసీ పర్మిషన్
  • 25,26,27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు
  • ఇవాళ ఉదయమే నిరాకరించిన ఈసీ
  • హరీశ్​ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విత్ డ్రా
  • కాంగ్రెస్ అడ్డొచ్చిందన్న ఎమ్మెల్సీ కవిత
  • ఉత్తర్వుల్లో కాంగ్రెస్ పేరు ప్రస్తావించని ఈసీ
  • 10  రోజుల్లో 15 వేలు వేస్తామన్న రేవంత్

హైదరాబాద్: రైతుబంధు పంపిణీని ఆపిందెవరు? హరీశ్రావు వ్యాఖ్యల కారణంగానే ఈసీ బ్రేక్ పడిందా? అన్న చర్చ మొదలైంది. ఖజానాలో డబ్బుల్లేక సర్కారు ఈ డ్రామాకు తెరతీసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ కుట్ర అని అధికార పక్షం అంటోంది. ప్రచారం ముగియనున్న చోటు చేసుకున్న ఈ పరిణామం కీ పాయింట్ గా మారింది.

ఈ నెల 18న రైతుబంధు పంపిణీకి అనుమతి ఇవ్వాలని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా పంపిణీ చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇది ఇప్పటికే కొనసాగుతున్న పథకమని తెలిపింది. దీంతోపాటు రైతు రుణమాపీ, ఉద్యోగుల డీఏ అమలుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. స్పందించిన ఎన్నికల కమిషన్ యాసంగి సీజన్‌లో 70 లక్షల మంది రైతులు లబ్ధి  పొందే ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 24 నుంచి పంపిణీకి అనుమతించి పలు షరతులు సైతం విధించింది. ఉద్యోగుల డీఏ కు మాత్రం నిరాకరించింది.  

ఈసీ కండిషన్స్ ఇవి..

  • రైతుబంధు సొమ్ము పడ్డ, పడే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించొద్దు
  • రాష్ట్రంలో ప్రచారం ముగిశాక రైతుబంధు పంపిణీ చేయొద్దు
  • పోలింగ్  జరిగే 30వ తేదీన కూడా పంపిణీ చేయొద్దని షరతు
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా పంపిణీ జరగాలని సూచించింది

బుడ్డ పైసా పడలే

రైతుబంధుకు ఈసీ అనుమతి ఇచ్చినప్పటికీ రైతుల ఖాతాలో బుడ్డ పైసా కూడా పడలేదు. అయితే మంగళవారం రోజు ఉదయమే మీ ఖాతాల్లో డబ్బులు పడతాయంటూ బీఆర్ఎస్ నేతలు, అభ్యర్థులు పదే పదే తమ ప్రసంగాల్లో రైతుబంధు అంశాన్ని ప్రస్తావించారు. 24వ తేదీ రాత్రి ఈసీ అనుమతించింది. ఈ నెల 25,26,27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. 29,30 తేదీల్లో పంపిణీకి అనుమతి లేదని పేర్కొంది. దీంతో కేవలం 24, 28 తేదీల్లో పంపిణీకి ఓకే చెప్పింది. ఇందుకే 24వ తేదీ రాత్రి అనుమతి ఇచ్చినందున పంపిణీకి అవకాశం లేకుండా  పోయింది. మిగిలింది 28వ తేదీ (మంగళవారం) ఒక్కటే.. ఆ లోపే ఈసీ అనుమతికి నిరాకరించింది. దీంతో ఒక్క రైతు ఖాతాలో కూడా పంటసాయం డబ్బులు పడలేదు. 

రైతుబంధు విషయంలో ఏవరేమి అన్నారంటే.. 

ఫోన్లు టింగ్ టింగ్ మని మోగుతయ్

ఎలక్షన్ కమిషన్ నుంచి శుభవార్త వచ్చింది.. ఇవాళ శనివారం, రేపు ఆదివారం.. సోమవారం పొద్దున ఫోన్లు తయారు పెట్టుకోండ్రి.. పొద్దున చాయ్ తాగే వరకు టింగ్ టింగ్ టింగ్ మని మీ ఫోన్లు మోగుతయ్.. రైతుబంధు పైసలు బ్యాంకుల పడ్తయ్.. ఫోన్లన్ని టింగ్ టింగ్ మంటయ్.. కాంగ్రెసోళ్లు ఎన్ని కుట్రలు చేసినా దేవుడు మని బీఆర్ఎస్ పక్షమే ఉన్నడు.. 


-మంత్రి హరీశ్ రావు  నవంబర్ 25వ తేదీ   నర్సంపేట సెగ్మెంట్, నెక్కొండలో

10 రోజుల్లో 15 వేలు వేస్తం

‘రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా, అల్లుళ్లకు లేదు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు  ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు. పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం.

- పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ట్విట్టర్ 

నోటికాడి బుక్కను కాంగ్రెస్ లాగేసింది

‘రైతు బంధు ఆపింది కాంగ్రెస్ పార్టీ యే. కాంగ్రెస్ ఫిర్యాదు తోటే ఎలక్షన్ కమిషన్ రైతు బంధు ఆపింది. మొదటి నుంచి రైతు బంధు ఇవ్వడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు. రైతుల నోటి కాడి బుక్క కాంగ్రెస్ లాగేసింది. ఎలక్షన్ లో కాంగ్రెస్ కు రైతులు బుద్ది చెప్పాలి’

-ఎమ్మెల్సీ కవిత,   నిజామాబాద్ లో మీడియాతో..

కాంగ్రెస్  చెప్పింది.. బీజేపీ ఆచరించింది

కాంగ్రెస్, బీజేపోళ్లు ఇయ్యాల పొద్దున్న ఆర్డర్ ఇప్పించి రైతుబంధు ఆపిచ్చిండ్రు, ముందేమో ఇచ్చుకోవచ్చన్నరు. ఇప్పుడు ఈసీ మీద ఒత్తిడి తెచ్చి రైతు బంధు ఆపిచ్చిండ్రు. అధికారం రాకముందే రైతుబంధును బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కాటగలిపినయ్. ఆ దిక్కుమాలిన పార్టీలకు ఓటేస్తే ఆగమైతరు.

-మంత్రి కేటీఆర్, సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లా