
నాగర్కర్నూల్, వెలుగు: పాలమూరు ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామానికి చెందిన రైతు తలారి బాలస్వామి(60) చనిపోయాడు. తన భూమి పోయిందనే మనోవేదనతో అస్వస్థతకు గురైన బాలస్వామి హైదరాబాద్లోని ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం తెల్లవారుజామును ప్రాణాలు కోల్పోయాడు. పరిహారం కోసం బాలస్వామి నాలుగేండ్లుగా ఎదురుచూశాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని నేరుగా ఎత్తిపోతల పథకం కాల్వ పనులు చేస్తున్న పీఎస్కే కంపెనీ వద్దకు తీసుకెళ్లి ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలిసి కొల్లాపూర్ కాంగ్రెస్ నేతలు జగదీశ్వర్ రావు, అభిలాశ్ రావు, లెఫ్ట్ పార్టీ, బీఎస్పీ నేతలు ఆందోళన స్థలానికి చేరకున్నారు. రైతు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఎకరాకు రూ.30 లక్షలు, రైతు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన సందర్భంగా పోలీసులకు, అఖిల పక్ష నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ధర్నా జరుగుతున్నదని తెలిసి ఆర్డీవో, తహసీల్దార్ అక్కడికి చేరుకున్నారు. కానీ, పరిస్థితిని చూసి వెనుదిరిగారు.
భూమి గుంజుకున్నరని..
పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం కింద కుడికిళ్ల గ్రామానికి చెందిన 200 మందిదాకా రైతులు 300 ఎకరాలు కోల్పోయారు. వాళ్లకు పరిహారం అందజేసిన అధికారులు 70 మందిని పక్కనపెట్టారు. ఇందులో తలారి బాలస్వామి ఒకరు. కల్వకుర్తి ఎత్తిపోతల, మిషన్ భగీరథ స్కీంల కింద బాలస్వామిరెండు సార్లు తన 13 ఎకరాల భూమిని కోల్పోయాడు. పరిహారం కోసం ఆయన పార్టీ లీడర్లు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. వారం రోజుల కిందే అధికారుల ఆదేశాలతో కాంట్రాక్టర్లు ఆ భూమిని స్వాధీనం చేసుకుని కాలువ తవ్వకం పనులు ప్రారంభించారు. దీంతో బాలస్వామి ఆందోళన చెంది తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. తన భూమి మొత్తం పోయిందని, కాలువలు తవ్వారని తెలియడంతో మరింత ఆందోళనకు గురయ్యాడు. ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున బాలస్వామి మృతి చెందాడు. రైతు బాలస్వామికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లున్నారు.