నర్సాపూర్​లో ప్రొటోకాల్​ రగడ

నర్సాపూర్​లో ప్రొటోకాల్​ రగడ
  •     అధికారిక కార్యక్రమాన్ని పార్టీ ప్రోగ్రామ్స్​లా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఫైర్​
  •     ఎంపీపీని, ఇతర ప్రజాప్రతినిధులను పిలవట్లేదని కాంగ్రెస్ ఆగ్రహం
  •     రెండు పార్టీల మధ్య లొల్లి 

నర్సాపూర్, వెలుగు : మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానలో ఆదివారం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభోత్సవం సందర్బంగా ప్రొటోకాల్​విషయమై బీఆర్ఎస్,- కాంగ్రెస్ లీడర్ల మధ్య  వివాదం నెలకొంది. మాట మాట పెరిగి ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం నిర్వహించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి  స్థానిక ఎమ్మెల్యే సునీతా రెడ్డిని పిలవలేదని ఆదివారం ఆరోగ్యశ్రీ స్కీం ప్రారంభోత్సవానికి వచ్చిన బీఆర్ఎస్ లీడర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు ఆరోగ్యశ్రీ పథకాన్ని అధికారులు ఏర్పాటు చేసిన వేదిక వద్ద కాకుండా దవాఖాన బయట ప్రారంభించడాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుపడుతూ ఆందోళనకు దిగారు. స్థానిక ఎంపీపీని, ఇతర ప్రజాప్రతినిధులను పిలవకుండా ప్రోగ్రాం జరపడంపై కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, దురుద్దేశ్యంతో పథకం ప్రయోజనం ప్రజలకు అందకుండా చేయడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఆరోపించారు.

దీంతో ఉద్రిక్తత నెలకొంది. శనివారం ఎమ్మెల్యేను పిలవకుండా ప్రొటోకాల్​ పాటించనందుకు బీఆర్ఎస్...​ఆరోగ్యశ్రీ పథకాన్ని వేదిక వద్ద ప్రారంభించనందుకు కాంగ్రెస్​ పార్టీ లీడర్లు లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ రమేశ్, ఇతర ఆఫీసర్లను నిలదీశారు. ఇరు పార్టీల లీడర్ల వాదోపవాదాలు, వాగ్వాదంతో ఏం చేయాలో తెలియక ఆఫీసర్లు తలలు పట్టుకున్నారు.

ఎమ్మెల్యే సునీతా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్​పార్టీ ప్రోగ్రామ్స్​గా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. వేదికపైకి కాంగ్రెస్​లీడర్లను పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్​కు కంప్లయింట్​చేస్తామన్నారు.