వివాదాలకు కేరాఫ్​ అడ్రస్ తెలంగాణ యూనివర్సిటీ

వివాదాలకు కేరాఫ్​ అడ్రస్ తెలంగాణ యూనివర్సిటీ
  • కొత్త వీసీ వచ్చినప్పటి నుంచీ రోజూ వివాదాలే
  • ఏడాదిన్నరలో ఐదుగురు రిజిస్ర్టార్ల మార్పు 
  • వీసీపై అనేక ఆరోపణలు 

హైదరాబాద్ : వివాదాలకు కేరాఫ్​ అడ్రస్ గా మారింది తెలంగాణ యూనివర్సిటీ. కొత్త వీసీ వచ్చినప్పటి నుంచి యూనివర్సిటీలో నిత్యం ఏదో ఒక లొల్లి నడుస్తోంది. ఏడు నెలల కింద నియమించిన రిజిస్ర్టార్​ను తొలగించడంతో, తాజాగా  మరోసారి ఆ వర్సిటీ వార్తల్లో నిలిచింది. అనేక ఆరోపణలు వస్తున్నా సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో నిరుడు  మే 22న యూనివర్సిటీలకు సర్కారు వైస్​చాన్సలర్లను నియమించింది. దీంట్లో భాగంగా తెలంగాణ యూనివర్సిటీకి ప్రొఫెసర్ రవీందర్​కు బాధ్యతలు అప్పగించింది. ఏండ్లుగా ఇన్ చార్జి పాలనలో మగ్గిన తెలంగాణ వర్సిటీకి మంచిరోజులొచ్చాయని ఆశించిన ప్రొఫెసర్లు, స్టూడెంట్లకు నిరాశే మిగిలింది. ఆయన వచ్చినప్పటి నుంచి ఏవో వివాదాలు నడుస్తూనే ఉన్నాయని, అవన్నీ కూడా వీసీ చుట్టే తిరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు అంటున్నాయి.  ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియమాకం నుంచి రిజిస్ర్టార్ల తొలగింపు వరకూ ఏదో లొల్లి జరుగుతూనే ఉంది. వర్సిటీ అభివృద్ధిపై కాక వసూళ్లపైనే వీసీ దృష్టి పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే రెండ్రోజుల కింద సెలవులో ఉన్న రిజిస్ర్టార్ శివశంకర్​ను ఉన్నఫళంగా తొలగించారు. కనీసం ఆయనకు సమాచారం కూడా ఇవ్వలేదు. శివశంకర్​ను నియమించి 8 నెలలే అవుతున్నా, చెప్పిన మాట వినట్లేదని పక్కన పెట్టినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. 

పెండింగ్ లో ఈసీ మీటింగ్...
అలాగే మూడు నెలలకోసారి జరగాల్సిన ఈసీ మీటింగ్​ను  కావాలనే 9 నెలలుగా పెండింగ్​లో  పెట్టినట్టు తెలుస్తోంది. వర్సిటీ వీసీగా రవీందర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐదుగురు రిజిస్ర్టార్లు మారారు. 2021 మేలో వీసీగా వచ్చినప్పుడు ఆ సమయంలో ఉన్న రిజిస్ర్టార్ నసీంను అదే ఏడాది సెప్టెంబర్ లో తప్పించారు. ఆ తర్వాత ప్రొఫెసర్​ కనకయ్యను నియమించారు. అయితే సర్కారుకు తెలియకుండానే నియమించడంపై తెలంగాణ వర్సిటీ ఈసీలో గొడవ కావడంతో కనకయ్యను రెండు నెలల్లోనే  తొలగించారు. ఆ తర్వాత యాదగిరికి ఆ బాధ్యతలు ఇచ్చారు. నెలన్నరలోనే ఆయన్నూ వీసీ తప్పించారు. డిసెంబర్​లో శివశంకర్​ను నియమించారు. ఈ నెల16 నుంచి సెలవులో ఉన్న ఆయన్ను కూడా వీసీ తొలగించి, కొత్తగా విద్యావర్ధినిని నియమించారు. ఏడాది కాలంలోనే నలుగురు రిజిస్ర్టార్లను వీసీ మార్చడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆమెనూ మార్చేసి ఇంకొకరిని పెడుతున్నారనే చర్చ జరుగుతోంది.  కాగా,  వసూళ్లకు పాల్పడ్డారని వీసీ రవీందర్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై సర్కారు ఆదేశాలతో ఉన్నత విద్యా మండలి ఎంక్వైరీ నిర్వహించింది. దీంట్లో వసూళ్ల పర్వం నిజమేనని తేలినట్లు సమాచారం.

ఆయన వద్దంటేనే తొలగించా..
రిజిస్ర్టార్ శివశంకర్ తాను ఆ బాధ్యతలు చేయలేనని చెప్తేనే నేను కొత్తవారిని నియమించాను. ఆయన జనవరిలో రిటైర్ అవున్నారు. ఈ టైమ్​లో ఆయన కొన్ని పనులు చేయకూడదు. దీంతో కొత్తవారిని పెట్టాను. శివశంకర్​తో నాకు ఎలాంటి వివాదాలు లేవు. - వీసీ రవీందర్

ఇవీ ఆరోపణలు...
యూనివర్సిటీ వీసీగా రవీందర్ వచ్చి రాగానే 120 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకున్నారు. దీనికి ఈసీ  అనుమతి తీసుకోలేదు. అయితే ఒక్కో ఉద్యోగి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో ఈ నియామకాలను ఈసీ రద్దు చేసింది. ఇటీవల నిజామాబాద్​లో వర్సిటీ తరపున ఇంటర్నేషనల్ సెమినార్ నిర్వహించారు. దీనికి ప్రైవేటు కాలేజీల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. అయితే ఆయన వసూళ్ల గురించి తెలిసి ఒక్క ప్రజాప్రతినిధిగానీ, విద్యాశాఖ ఉన్నతాధికారులు గానీ సెమినార్​కు అటెండ్ కాలేదు. యూనివర్సిటీకి చెందిన రూ.10 కోట్లు స్టేషనరీ, ల్యాప్​టాప్​లు, కంప్యూటర్లు, జిరాక్స్ మెషీన్ల పేరుతో దుబారా ఖర్చు చేశారనే ఆరోపణలున్నాయి. సీసీటీవీల ఏర్పాటులోనూ భారీ అవినీతి జరిగిందని స్టూడెంట్ యూనియన్లు చెప్తున్నాయి.