కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో.. కాంగ్రెస్ నేతలపై BRS వర్గీయుల దాడి

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో.. కాంగ్రెస్ నేతలపై BRS వర్గీయుల దాడి

బోథ్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా బోథ్ లోని రైతు వేదికలో బుధవారం కాంగ్రెస్​ నేతలపై బీఆర్ఎస్​ వర్గాలు దాడికి దిగాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ  కార్యక్రమంలో ప్రోటోకాల్​ వివాదం గొడవకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. 

చెక్కుల పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో స్టేజీపై ఎమ్మెల్యే అనిల్​జాదవ్  పక్కన మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సంధ్యారాణి కూర్చోవడంతో ఆత్మ చైర్మన్​ రాజు యాదవ్​ వారు ఏ అర్హతతో స్టేజీపై కూర్చున్నారని ప్రశ్నించారు. 

ఇరువర్గాల మధ్య బాహాబాహీ చోటు చేసుకోగా, బీఆర్ఎస్​నాయకులు కాంగ్రెస్​ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, రాజుయాదవ్​పై దాడి చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​చార్జి ఆడె గజేందర్  తన వర్గీయులతో అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. 

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. గాయాలపాలైన వారితో కలిసి పోలీస్​స్టేషన్​కు వెళ్లి బీఆర్ఎస్​ నాయకులపై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్​ నాయకులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి గొడవతో చెక్కులు తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులు భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు.