కోరుకంటి టార్గెట్​గా అసమ్మతి లీడర్ల .. ప్రజా ఆశీర్వాద యాత్ర

కోరుకంటి టార్గెట్​గా అసమ్మతి లీడర్ల ..   ప్రజా ఆశీర్వాద యాత్ర

గోదావరిఖని, వెలుగు :  రామగుండం నియోజకవర్గ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో అసమ్మతి రాజుకుంది.  ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌గా కొంతకాలంగా సొంతంగా  కార్యకలాపాలు నిర్వహిస్తున్న అసమ్మతి లీడర్లు,  ఎమ్మెల్యే టికెట్​ ఆశిస్తున్నవారు శనివారం  ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో డివిజన్లు, గ్రామాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.  పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, సింగరేణి టీబీజీకేఎస్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి, రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ మాజీ మేయర్‌‌‌‌‌‌‌‌ కొంకటి లక్ష్మినారాయణ, అసంఘటిత రంగ కార్మిక నాయకుడు పాతపెల్లి ఎల్లయ్య కలిసి తమ అనుచరులు వెంట రాగా  గోదావరిఖనిలోని మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌ వద్ద అంబేద్కర్​ విగ్రహం నుంచి మెయిన్‌‌‌‌‌‌‌‌  చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. 

అక్కడి నుంచి మేయర్‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ ప్రాతినిధ్యం వహిస్తున్న 30వ డివిజన్‌‌‌‌‌‌‌‌లో తమ యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌ తమను పార్టీ, అధికారిక కార్యక్రమాల్లో ఎక్కడా కలుపుకొని వెళ్లడం లేదన్నారు.  గోదావరిఖనిలో కేటీఆర్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు కూడా ఆహ్వానించలేదని, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో వారిని కాకుండా ఇతరులను ఇన్​చార్జిలుగా నియమిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో పార్టీని కాపాడుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ గెలుపుకోసం కృషి చేస్తూ మూడో సారి కూడా సీఎంగా కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఉండాలనే ఆశయంతో గడపగడపకు ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టినట్టు పేర్కొన్నారు.  

రాబోయే ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ టిక్కెట్‌‌‌‌‌‌‌‌ తమ నలుగురిలో ఏ ఒక్కరికి వచ్చినా.. గెలుపుకోసం మిగిలిన వాళ్లం కలిసికట్టుగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.  కాగా, 30వ డివిజన్‌‌‌‌‌‌‌‌లోని అంబేద్కర్​ నగర్‌‌‌‌‌‌‌‌ వద్ద ఎమ్మెల్యే కోరుకంటి అనుచరులు, కొంతమంది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు యాత్రను అడ్డుకుని నినాదాలు చేశారు. ఎమ్మెల్యే చందర్‌‌‌‌‌‌‌‌ రామగుండం అభివృద్ధికి కృషి చేస్తుంటే ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరించడం సరైంది కాదని పేర్కొన్నారు.