సంజయ్‌‌తో అసమ్మతి నేతల భేటీ

సంజయ్‌‌తో అసమ్మతి నేతల భేటీ
  • ఇంద్రాసేనా రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం
  • ఇకపై కలిసి పనిచేద్దామని నేతలకు పిలుపునిచ్చిన పార్టీ స్టేట్‌‌ చీఫ్‌‌ 

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌తో పార్టీ అసమ్మతి నేతలు భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పార్టీ సీనియర్‌‌‌‌ నేత ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణా రెడ్డి, ధర్మారావు, సీనియర్‌‌‌‌ నేతలు సుగుణాకర్‌‌‌‌ రావు, చింతా సాంబమూర్తి, నాగూరావు నామోజీ, అల్జిపూర్ శ్రీనివాస్, వెంకట రమణి తదితరులు పాల్గొన్నారు. అసమ్మతి నేతలకు ఇంద్రసేనారెడ్డి మధ్యవర్తిత్వం వహించడంతోనే సంజయ్‌‌తో ఈ సమావేశం జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మూడ్రోజుల క్రితం రాష్ట్ర పార్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అసమ్మతి నేతలు సమావేశం కావడంపై హైకమాండ్‌‌ సీరియస్‌‌ అయింది. దీంతో ఆయా నేతలకు షోకాజ్‌‌ నోటీసులు ఇవ్వాలని భావించింది. అయితే ఇంద్రసేనారెడ్డి జోక్యంతో అసమ్మతి నేతలు దిగి వచ్చినట్లు సమాచారం. సంజయ్‌‌తో జరిగిన భేటీలో అసమ్మతి నేతలు వివరణ ఇచ్చుకున్నారు. పార్టీలో సీనియర్లమైన తమకు తగిన గుర్తింపు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి వారు విడివిడిగా తమ అభిప్రాయాలను సంజయ్‌‌కు చెప్పారు. దీంతో ఇకపై అందరం కలిసి పని చేద్దామని వారికి సంజయ్‌‌ సూచించినట్లు తెలిసింది. దీంతో రాష్ట్ర బీజేపీలో అసమ్మతి వ్యవహారం సద్దుమణిగినట్లేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.