పేద వాళ్ల కోసం ప్రత్యేకంగా యాప్

పేద వాళ్ల కోసం ప్రత్యేకంగా యాప్

‘మనదేశంలో లక్షలాది మంది పేదవాళ్లు ఉన్నారు. వాళ్ల అవసరాలన్నీ తీర్చాలను కుంటున్నా. ఒక్కరు కూడా ఆకలితో పడుకోకూడదు. అదే నా గోల్‌. యాప్‌ని డెవలప్‌ చేసి అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు డిస్సీ సేవలు పొందేలా చేస్తా’ అంటున్నాడు మనన్‌.

మనన్‌‌ సొంతూరు గురుగ్రామ్‌‌. ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్‌‌ స్కూల్‌‌లో పన్నెండో క్లాస్ చదువుతున్నాడు. అప్పుడప్పుడు స్కూల్‌‌ యాక్టివిటీల్లో భాగంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు మనన్‌‌. అలా వెళ్లిన ప్రతీసారి పేదవాళ్ల కష్టాలు బాధ కలిగించేవి. అందులో ఒక్కపూట తినడానికి కూడా లేనివాళ్లు, ఎవరూ చూసుకునేందుకు లేక ఇబ్బంది పడుతున్న పెద్దవాళ్లు, హాస్పిటల్‌‌లో చూపించుకోవడానికి డబ్బుల్లేక కష్టపడుతున్నవాళ్లే ఉన్నారు. వాళ్లందరికి సాయం చేయాలని ఉన్నా అందుకు కావాల్సిన డబ్బు దగ్గర లేదు. అప్పుడే డిస్సీ యాప్‌‌ ఆలోచన వచ్చింది. డిస్సీ అంటే ‘నిర్జీవమైన’ అని అర్థం. దానిగురించి టీచర్లకి, తల్లిదండ్రులకి చెప్పాడు. వాళ్లు ఫైనాన్షియల్‌‌గా సపోర్ట్‌‌ చేస్తామన్నారు. తరువాత తన ఆలోచన గురించి రీసెర్చ్‌‌ పేపర్ తయారుచేసి ‘ఐఇఇఇ ఎక్స్‌‌ప్లోర్‌‌‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌’కి ఒక లెటర్‌‌‌‌ రాశాడు. ఐఇఇఇ అంటే ‘ది ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ ఎలక్ట్రికల్‌‌ అండ్‌‌ ఎలక్ట్రానిక్స్‌‌ ఇంజనీర్స్‌‌’. ఇది ఒక డిజిటల్‌‌ లైబ్రరీ. వీళ్లు మనన్‌‌కు కావాల్సిన డాటాబేస్‌‌ ఇచ్చారు. అది యాప్‌‌ డెవలప్‌‌మెంట్‌‌కి సాయపడింది.

ఎలా పని చేస్తుందంటే..

సంవత్సరంన్నర కష్టపడి డిస్సీ యాప్ తయారు చేసిన మనన్‌‌, ఫిబ్రవరి 2022న యాప్‌‌ని ప్లే స్టోర్‌‌‌‌లో లాంచ్‌‌ చేశాడు. గురుగ్రామ్‌‌, ఢిల్లీలో ఉన్న అన్ని ఎన్జీవోలతో ఈ యాప్‌‌ కనెక్ట్‌‌ అయి ఉంటుంది. అంతేకాకుండా యాప్‌‌లో ఎస్‌‌ఓఎస్‌‌ (సేవ్‌‌ అవర్‌‌‌‌ సెల్వ్స్​) అనే బటన్‌‌ ఉంటుంది. ఆ బటన్‌‌ నొక్కి సాయం కావాల్సిన వాళ్లు వాళ్ల వివరాలు, అడ్రస్‌‌, అవసరం అయితే ఫొటో లేదా వీడియో తీసికూడా యాప్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేయొచ్చు. ఆ ఇన్‌‌ఫర్మేషన్‌‌  తీసుకొని ఎన్జీవోలు అవసరం ఉన్నవాళ్లకు సాయం చేస్తాయి. లేదంటే సాయం చేయాలనుకున్న డోనర్స్‌‌ యాప్‌‌లో ఉన్న అకౌంట్‌‌కి డబ్బులు పంపొచ్చు. ఆ డబ్బును ‘ఎవరికి పంపారు? ఎంత ఖర్చు చేశారు? నిజంగానే సాయం అందిందా?’ అన్న వివరాలు కూడా యాప్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేస్తాడు మనన్‌‌. అంటే ఈ యాప్‌‌ ఎన్జీవోలకు, పేద ప్రజలకు మధ్యవర్తిగా ఉంటుందన్నమాట. ఈ యాప్‌‌ ద్వారా 422 రకాల ఎన్జీవోలు కొన్ని వేలమంది పేదవాళ్ల అవసరాలు, కష్టాలు తీర్చాయి. బట్టలు, చెప్పులు, బొమ్మలు కూడా దీనిద్వారా డొనేట్‌‌ చేస్తారు. ఇవే కాకుండా పెండ్లిళ్లు, బర్త్‌‌డే ఫంక్షన్స్‌‌ జరుపుకోలేని వాళ్లకు కూడా ఈ యాప్‌‌ ద్వారా సాయం చేస్తారు.