నకిలీ పామాయిల్ మొక్కలు పంపిణీ

నకిలీ పామాయిల్ మొక్కలు పంపిణీ
  • నాటిన రెండు నెలలకే చనిపోయిన మొక్కలు
  • లైసెన్స్​ లేని నర్సరీపూ హర్టికల్చర్​ ఆఫీసర్ల దాడి

దమ్మపేట : ప్రభుత్వం ప్రోత్సాహిస్తుండడం వల్ల  పామాయిల్​ సాగుకు డిమాండ్​ పెరగడంతో  కొంతమంది అక్రమార్కులు నకిలీ పామాయిల్ మొక్కలు పంపిణీ చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం కి చెందిన రాంబాబు ఇటీవల రూ.  లక్షలతో నకిలీ మొక్కలు కొని నిండా మునిగాడు.  తన నాలుగు ఎకరాల పొలంలో పామాయిల్​ సాగు చేయాలని భావించిన రాంబాబు  అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలోని పామాయిల్ నర్సరీ నుంచి  మొక్కలు తీసుకోవడానికి వెళ్లగా.., అతని పొలానికి పట్టాదారు పాస్​బుక్​ లేదని మొక్కలు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. దాంతో ఆయన ప్రైవేట్​ నర్సరీలనుంచి మొక్కలు తీసుకోవాలని భావించాడు. దమ్మపేటకు చెందిన  గట్టుమీద శ్రీను సొంతంగా పామాయిల్ మొక్కలు పెంచి అమ్ముతున్నాడని చెప్పడంతో  గుర్రాలచెరువుకు చెందిన మధ్యవర్తి ద్వారా రూ. లక్ష ఇచ్చి 200 మొక్కలు తీసుకున్నాడు. నాటిన  రెండు  నెలలకే  మొక్కలు చనిపోయాయి. చుట్టుపక్కల రైతులు పరిశీలించి అవి నకిలీ మొక్కలని తేల్చారు. దమ్మపేట లోని  పామాయిల్  తోటల్లో చెట్లకింద మొలిచిన మొక్కలను ఇద్దరు కూలీలతో సేకరించి ఏపీ నర్సరీలనుంచి తెచ్చినట్టు నమ్మించి శ్రీను రైతులకు అంటగడుతున్నట్టు తెలిసింది. తనలాగే శ్రీను చాలామందిని మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని రాంబాబు అధికారులను కోరారు. 
నకిలీ మొక్కలను ధ్వంసం చేసిన అధికారులు 

దమ్మపేట మండలంలోని లింగాలపల్లి గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నర్సరీ మీద హార్టికల్చర్​ అధికారులు దాడి చేసి నకిలీ మొక్కలను ధ్వంసం చేశారు. దాదాపు 1000 మొక్కలను ఓ ఇంట్లో దాచిపెట్టగా.. వాటిని పీకి డంపింగ్ యార్డ్ లో పడేశారు. లైసెన్స్​ పొందిన కంపెనీలే మలేసియానుంచి విత్తనాలు కొనుగోలు చేసి .. పామాయిల్​ మొక్కలను పెంచాల్సి ఉంటుందని,  గట్టుమీద శ్రీను నకిలీ మొక్కలను అమ్ముతూ మోసాలకు పాల్పడినట్టు గుర్తించామని హర్టికల్చర్​హెచ్ ఓ సందీప్ తెలిపారు. రైతులు నర్సరీ ద్వారా అమ్మిన మొక్కలనే కొనాలన్నారు. 

మొక్కలిస్తామని డబ్బులు వసూలు..
హైదరాబాదుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ పామాయిల్‌‌‌‌ మొక్కలు ఇస్తామంటూ రైతుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసగించినట్టు ఆలస్యంగా తెలిసింది. ఉమ్మడి ఖమ్మంతో పాటు పలు జిల్లాల్లో కంపెనీ ప్రతినిధులు ఒక్కో మొక్కకు రూ.300 చొప్పున వసులు చేశారు.  భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం  జమేదారు బంజర్‌‌‌‌కు చెందిన కొందరు రైతులు వారికి డబ్బులు ఇచ్చారు. మూడు నెలలైనా మొక్కలు ఇవ్వకపోవడంతో కంపెనీ ప్రతినిధులను నిలదీశారు.  గురువారం తొమ్మిది మంది రైతులకు  రూ.1,35,000 ఇస్తామని ఒప్పుకున్న కంపెనీ ప్రతినిధులు పోస్ట్​ డేటెడ్​ చెక్కులు ఇచ్చారు. దీంతో కంపెనీ మోసం బయటకొచ్చింది. ఈ ఘటనపై ఆయిల్‌‌‌‌ఫెడ్‌‌‌‌ అధికారి బాలకృష్ణను వివరణ కోరగా..  మొక్కలు ఇస్తామని డబ్బులు వసూలు చేసిన విషయం తమ దృష్టికి రాలేదన్నారు.