మునుగోడులో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ - రేవంత్

మునుగోడులో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ -  రేవంత్

యువతను టీఆర్ఎస్ నేతలు మద్యానికి బానిస చేస్తున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజలు ఎదురు తిరగకుండా వారిని మద్యం మత్తులో ముంచుతున్నారని, విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రం కేంద్ర బలగాలను, రాష్ట్రం పోలీసు వాళ్లను అడ్డంపెట్టి  రాజకీయం చేస్తున్నాయని, మునుగోడులో జరుగుతున్న ప్రచార సరళిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ బైపోల్ సర్వేలో బీజేపీకి మూడో స్థానం రావడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ కు చలిజ్వరం వచ్చిందన్నారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలోని కొంపల్లి గ్రామంలో మీడియా సమావేశంలో రేవంత్  మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గానికి కొత్తకాదని, గతంలోనే ఈ నియోజకవర్గానికి వారు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారని, అయినా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయలేదని ధ్వజమెత్తారు. ‘‘టీఆర్ఎస్ కు ఇక్కడ ప్రజల ఓట్లు అవసరం. ఇక్కడ అభ్యర్థిని గెలిపించుకోవడం అవసరం తప్ప ఇక్కడి ప్రజలపై ప్రేమ కానీ, అభిమానం కానీ లేదు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఆ పార్టీకి లేదు. ఇక్కడ కుర్చీ వేసుకుని డిండి ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎనిమిది ఏళ్లు పూర్తయింది. ఇప్పటికీ డిండి ప్రాజెక్టు పూర్తి కాలేదు. శివన్నగూడెం భూనిర్వాసితులకు సరైన ప్యాకేజీ ఇవ్వలేదు. చర్లగూడ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. మునుగోడులో జూనియర్ కాలేజీ, చౌటుప్పల్ లో డిగ్రీ కాలేజ్ కట్టలేదు. తండాలకు వెళ్లడానికి రోడ్లు కూడా లేవు” అని రేవంత్  పేర్కొన్నారు. రాచకొండలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు  లంబాడా సోదరులకు భూములు ఇస్తే ఇప్పుడు ఆ భూములను సినిమా వాళ్లకు కట్టబెట్టాలని మంత్రి కేటీఆర్ కుట్రపన్నుతున్నారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు వ్యక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా పార్టీకి నష్టం కలిగిస్తున్నారన్నారు. ఇక్కడికి వచ్చిన  కాంగ్రెస్ శ్రేణులపై బీజేపీ నేతలు, కార్యకర్తలు భౌతికదాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి దాడులను తిప్పికొట్టాల్సిన బాధ్యత మునుగోడు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల పై ఉందని ఆయన పేర్కొన్నారు. 

రాహుల్ యాత్రను సక్సెస్ చేయాలి

ఈనెల 30న రాహుల్ గాంధీ భారత్  జోడో యాత్ర షాద్ నగర్ వద్ద జరగబోతోందని, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలందరూ వేల సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని రేవంత్  పిలుపునిచ్చారు. అలాగే వచ్చే నెల 1న మునుగోడు మండల కేంద్రంలో మధ్యాహ్నం 12 గంటలకు మహిళా గర్జన సభను కూడా విజయవంతం చేయాలని, కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థి పాల్వాయి స్రవంతిని ప్రజలు ఆశీర్వదించి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. 

ఖర్గే ప్రమాణానికి రాష్ట్ర నేతల హాజరు

న్యూఢిల్లీ : కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కాంగ్రెస్​ పార్టీకి మంచి భవిష్యత్​ ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ నేతలు అభిప్రాయపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు కాంగ్రెస్​ చీఫ్​ రూపంలో జవాబు దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతంతో పాటు దేశానికి ఖర్గే అనుభవం ఉపయోగపడుతుందని చెప్పారు. ఏఐసీసీ హెడ్డాఫీసులో బుధవారం జరిగిన ఖర్గే బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి గీతారెడ్డి,  మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, ఇతర నాయకులు హాజరయ్యారు. తర్వాత భట్టి మీడియాతో మాట్లాడారు.. మల్లికార్జున ఖర్గే నిబద్దత కలిగిన నాయకుడని చెప్పారు. అట్టడువర్గాలు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అవకాశం కల్పించిందని మాజీ ఎంపీ యధుయాష్కీ అన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీని సన్నద్ధం చేసి ముందుకు తీసుకుపోయే సత్తా ఖర్గే లో ఉందని మరో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ చెప్పారు.