- జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ, అర్బన్, వెలుగు: దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన దివ్యాంగ క్రీడల పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో దివ్యాంగులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో దివ్యాంగులు క్రీడా స్ఫూర్తితో ఆడారని కలెక్టర్ అన్నారు. క్రీడల ద్వారా మానసిక, శారీరక సామర్థ్యాలు పెంపొందించుకోవడంతో పాటు, ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ప్రజావాణిలో దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.
దివ్యాంగుల సంక్షేమం కోసం బ్యాటరీ మోటార్ వెహికల్స్, పింఛన్లను ప్రభుత్వం ఇస్తున్నదన్నారు. దివ్యాంగుల ఇతర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. దివ్యాంగులు బాగా చదువుకోవాలని, అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ పి. రమేశ్, జిల్లా సంక్షేమ సంక్షేమ అధికారి కృష్ణవేణి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, క్రీడలు, యువజన సేవల అధికారి అక్బర్ అలీ, సీడీపీఓ హరిత తదితరులున్నారు.
దివ్యాంగుల ప్రతిభకు ప్రోత్సాహం
యాదాద్రి, వెలుగు: దివ్యాంగుల ప్రతిభకు ప్రభుత్వం ప్రోత్సాహమిస్తోందని కలెక్టర్హనుమంతరావు తెలిపారు. దివ్యాంగుల దినోత్సవంలో ఆయన జ్యోతి వెలిగించి మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని చెప్పారు. వారికి యూడీఐడీ కార్డులను జారీ చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అర్హులైన దివ్యాంగుల కోసం ట్రై సైకిల్, బ్యాటరీ సైకిళ్లను ఇస్తున్నామని చెప్పారు. జిల్లాలోని 12,626 మంది దివ్యాంగులకు పింఛన్ రూపంలో ప్రతి నెల రూ. 5.07 కోట్లు అందిస్తున్నామన్నారు. ఉపాధి స్కీమ్‌లో దివ్యాంగులు 24, 251 పని దినాల్లో పాల్గొన్నారన్నారు. ఇందుకోసం రూ. 72 వేలు ఖాతాలో జమ చేశామని తెలిపారు.
ముందుగా ఇటీవల దివ్యాంగులకు నిర్వహించిన ఆటల పోటీల్లో ప్రతిభ చూపిన వారికి ప్రైజులు అందించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఏ. భాస్కరరావు, డీఆర్డీవో నాగిరెడ్డి, జడ్పీ సీఈవో శోభరాణి, వెల్ఫేర్ ఆఫీసర్నర్సింహారావు, మెప్మా ఆఫీసర్రమేశ్, ఏపీడీ జంగారెడ్డి ఉన్నారు.
దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తాం
సూర్యాపేట, వెలుగు: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని బుధవారం సూర్యాపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా సంక్షేమ అధికారి కె. నరసింహరావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా స్థాయి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం 2025 వేడుక కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, పీడీ మెప్మా, మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న దివ్యాంగుల సమస్య లు పరిష్కరిస్తామన్నారు.
మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగుల ఎస్.హెచ్.జి సంఘాలు ఏర్పాటు చేస్తామని వారికీ బ్యాంకర్స్ ద్వారా రుణాలు కల్పిస్తామన్నారు. డీసీహెచ్ఎస్ వెంకటేశ్వర్లు, లీడ్ బ్యాంకు మేనేజర్ నాగ ప్రసాద్, డీఆర్డీడీఏ డీపీఎం బెనర్జీ , టౌన్ సీఐ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
