జిల్లా వినియోగదారుల కమిషన్.. మెంబర్స్ నియామకం చెల్లదు: హైకోర్టు

జిల్లా వినియోగదారుల కమిషన్.. మెంబర్స్ నియామకం చెల్లదు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌‌ మెంబర్స్‌‌గా బడ్డిపడగ రాజిరెడ్డి, కె. కాత్యాయినిలను నియమిస్తూ గత ఏడాది ఆగస్టు 16న జారీ చేసిన జీవో నం 28ని హైకోర్టు రద్దు చేసింది. వాళ్ల నియామకం చెల్లదని ఇటీవలే హైకోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు గైడ్‌‌లైన్స్‌‌కు విరుద్ధంగా నియామాకాలు ఉన్నాయని తప్పుపట్టింది. జీవో నం 28ని సవాల్‌‌ చేస్తూ కె. సరిత దాఖలు చేసిన పిటిషన్‌‌పై జస్టిస్‌‌ పి.మాధవీ దేవి విచారణ పూర్తి చేసి ఇటీవల తీర్పు చెప్పారు.

పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది ఏపీ రెడ్డి వాదిస్తూ.. పిటిషనర్‌‌ ఎక్కువ మార్కులు పొందారని, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్‌‌ ధ్రువీకరణ పూర్తి చేసినప్పటికీ ఆమె కంటే తక్కువ మార్కులు వచ్చిన వారిని నియమించారని తెలిపారు. 2023 మార్చి 3న కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వర్సెస్‌‌ మహీంద్ర భాస్కర్‌‌ లిమయే కేసులో సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా నియామకాలు చేశారని పేర్కొన్నారు.

దీనిపై ప్రభుత్వ లాయర్‌‌ స్పందిస్తూ..సుప్రీం తీర్పు కంటే ముందే ఆ నియామకం పూర్తయిందని తెలిపారు. సుప్రీం తీర్పు తర్వాత కేవలం ఉత్తర్వులు వెలువడ్డాయని, పిటిషన్‌‌ను కొట్టేయాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. ఆ ఇద్దరి నియామకాలు చెల్లవని తీర్పు చెప్పింది. చట్టపరమైన ప్రత్యామ్నాయాలను ఆశ్రయించడానికి గాను తీర్పు అమలును 4 వారాల పాటు నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది.