నిజామాబాద్ జిల్లాలో ఇటుక బట్టీల్లో వెట్టి...500 మంది కార్మికులకు విముక్తి కల్పించిన జిల్లా జడ్జి

నిజామాబాద్ జిల్లాలో ఇటుక బట్టీల్లో వెట్టి...500 మంది కార్మికులకు విముక్తి కల్పించిన జిల్లా జడ్జి

ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఆలూర్ మండలాల్లోని మగ్గిడి, దేగాం గ్రామ శివారులోని ఇటుక బట్టీల్లో బందీలుగా పనిచేస్తున్న కార్మికులకు మంగళవారం జిల్లా జడ్జి భారత లక్ష్మి విముక్తి కల్పించారు. ఇటుక బట్టీలో పనిచేసే ఓ కార్మికుడు పారిపోయి హైదరాబాద్ లో లీగల్ సర్వీసెస్ అథారిటీకి చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా యంత్రాంగం స్పందించింది. జిల్లా జడ్జి భారత లక్ష్మి రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో మంగళవారం ఇటుక బట్టీల్లో తనిఖీ చేశారు. బట్టీల్లో కార్మికుల దీన స్థితిని చూసి చలించిపోయారు. 

దాదాపు 500 మంది కార్మికులను రెస్క్యూ చేసి ఆర్మూర్ లో షెల్టర్ కల్పించారు. ప్రస్తుతం తాత్కాలిక సదుపాయాలు కల్పిస్తామని, నష్టపరిహారం ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. వారిని సొంత గ్రామాలకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. లేబర్ చట్టాలకు విరుద్ధంగా నడుపుతున్న ఇటుక బట్టి యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. సబ్ కలెక్టర్ అభిగ్యాన్​మాల్వియా, తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్మూర్​జడ్జి శ్రీదేవి, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్  సహాయక చర్యలు చేపట్టారు.