ఎన్నికలపై పోలీసుల ఫోకస్ .. 171 ప్రాంతాల్లో 507 సెంటర్లు సమస్యాత్మకం

ఎన్నికలపై పోలీసుల ఫోకస్ .. 171 ప్రాంతాల్లో 507 సెంటర్లు సమస్యాత్మకం
  • సెన్సిటీవ్​ పోలింగ్​ సెంటర్లపై పోలీస్​ నిఘా
  • నెల రోజుల్లో 1900 మంది బైండోవర్​
  • రౌడీల పొలిటికల్​ లింక్​లపై ఆరా​

నిజామాబాద్​, వెలుగు: ఎలాంటి గొడవలు లేకుండా పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంపై జిల్లా పోలీసు యంత్రాంగం ఫోకస్​ పెడుతోంది. 507 పోలింగ్​ సెంటర్లను సెన్సిటివ్ గా గుర్తించి వాటి మీద ప్రత్యేకంగా నిఘా పెట్టింది. పొలిటికల్ పార్టీలతో లింక్​లున్న రౌడీషీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. పోలీస్​ కమిషనర్​ కల్మేశ్వర్​ వారి మూమెంట్స్​ను ఏరోజుకారోజు ఆయా పోలీసుస్టేషన్ల నుంచి తెప్పించుకుంటున్నారు. జిల్లాలోని రౌడీ షీటర్లకు ఇప్పటికే కౌన్సిలింగ్​ఇచ్చిన ఆయన ఎన్నికల సందర్భంగా ఎలాంటి గొడవలు జరిగినా కఠినంగా వ్యవహరిస్తామని గట్టి వార్నింగ్​ ఇచ్చారు. నిజామాబాద్​ లోక్​సభ పరిధిలో జగిత్యాల జిల్లాకు చెందిన రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి, ఆ జిల్లా పోలీసు అధికారుల సమన్వయంతో సీపీ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. 

 సెన్సిటివ్​ సెంటర్లపై అలర్ట్​

నిజామాబాద్​ పార్లమెంట్​ స్థానం పరిధి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 17,01,573 మంది ఓటర్లుండగా.. 1,807 పోలింగ్​ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందులో 507 సెంటర్లు సమస్యాత్మకంగా గుర్తించారు. 171 ఏరియాల్లో ఉన్న ఈ పోలింగ్​ సెంటర్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ సెంటర్లతో పాటు నియోజకవర్గమంతటా లా అండ్​ ఆర్డర్ కు విఘాతం రాకుండా యాక్షన్​ ప్లాన్​ తయారు చేశారు. 

గొడవలకు పాల్పడేవారికి హెచ్చరిక చేయడంతోపాటు ఓటర్లకు భరోసా కల్పించేందుకు సెన్సిటివ్​ ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్రబలగాలతో ఫ్లాగ్​ మార్చ్​ నిర్వహించారు. జిల్లాలోని పోలీస్​ రికార్డుల్లో 326 మందిపై రౌడీ షీట్లు ఉన్నాయి. వారందరికి సీపీ కల్మేశ్వర్​ గత నెల 2న కౌన్సిలింగ్​ ఇచ్చారు. ఎవరి పనులు వాళ్లు చేసుకుని ఇంటి దగ్గరే ప్రశాంతంగా ఉండాలని, శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తే జైలుకు పంపుతామని వార్నింగ్​ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేనట్టుగా నెలరోజుల్లో 1,900 మందిని రూ.2 లక్షల బాండ్​పేపర్​తో బైండోవర్​ చేశారు. వారిలో మార్పురాకపోతే నేరుగా జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. 

 నిఘా కోసం స్పెషల్​ టీమ్స్​

పొలిటికల్​ బ్యాక్​గ్రౌండ్​ ఉండి గొడవలకు దిగుతున్న వారి వివరాలను సెగ్మెంట్​ల వారీగా పోలీసులు తయారు చేశారు. వారికి ఆయా పార్టీలతో సంబంధాలున్నాయా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారా.. ఎప్పుడేం చేస్తున్నారు అన్న వివరాలను స్టేషన్ల వారీగా తెప్పించుకుంటున్నారు. ఇందుకోసం సీపీ ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేశారు. ఇటీవల హత్యకు గురైన ఇద్దరు రౌడీషీటర్ల గ్యాంగ్​లకు చెందిన అజ్జు, అంజాద్​ ఈనెల11న కత్తులతో హల్​చల్​ చేయడం, ఒకరిపై దాడి చేయడాన్ని.. సోమవారం అక్రం అనే వ్యక్తి ఫెరోజ్​ఖాన్​అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసి గాయపర్చడాన్ని సీపీ సీరియస్​తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు.