కరోనా టెస్టుల్లో జిల్లాకో తీరు

కరోనా టెస్టుల్లో జిల్లాకో తీరు

(వెలుగు, నెట్​వర్క్​) కరోనా టెస్టులు, రిపోర్టుల వెల్లడి విషయంలో ఒక్కో జిల్లాలో ఒక్కో తీరు కనిపిస్తోంది. హైకోర్టు సూచనల మేరకు కొన్ని జిల్లాల్లో ప్రతిరోజూ 50శాంపిల్స్​ తీసి టెస్టుకు పంపుతుండగా, ఇప్పటికే కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో శాంపిల్స్​ తీయడం లేదు. తీసినా రిపోర్టులు పెండింగ్​లో పెడుతున్నారు. దీంతో తమకు కరోనా పాజిటివ్​ వచ్చిందో, లేదా నెగెటివ్​ వచ్చిందో తెలియక టెస్టులు చేయించుకున్నవారు టెన్షన్​ పడుతున్నారు. వీరిలో కొందరు బయట తిరుగుతుండడంతో మిగిలిన జనం భయపడుతున్నారు. మరోవైపు పాతజిల్లాకేంద్రాలతోపాటు సూర్యాపేట, సిద్దిపేటలో కరోనా టెస్టుల కోసం ఏర్పాటుచేసిన ట్రూనాట్​మిషన్లు ఎక్కడా వినియోగంలోకి రాలేదు. దీంతో జిల్లాల నుంచి శాంపిల్స్​ వరంగల్​ లోని ఎంజీఎం, ఆదిలాబాద్​లోని రిమ్స్​, హైదరాబాద్​లోని గాంధీ, ఉస్మానియాకే పంపుతుండడంతో రిపోర్టులు లేటవుతున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

ఆ రెండు జిల్లాల్లో ఆగిన రిపోర్టులు..

ఇటీవల కరోనా పాజిటివ్​ కేసులు ఎక్కువగా వచ్చిన జనగామ, యాదాద్రి జిల్లాలో టెస్టులను ఆఫీసర్లు పూర్తిగా నిలిపివేశారు. జనగామ జిల్లాలో ప్రముఖ ఫర్టిలైజర్​షాపుతో లింకుకు సంబంధించి ఈ నెల 19వరకు తీసిన శాంపిల్స్​ టెస్టు చేయగా ఏకంగా 51 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో వారితో ప్రైమరీ కాంటాక్ట్​ ఉన్న మరో 61మందికి ఈనెల 20 న శాంపిల్స్​ సేకరించిన ఆఫీసర్లు ఆ రిపోర్టులను నేటికీ బయటపెట్టలేదు. కేసులు అమాంతం పెరిగినందునే రిపోర్టులను కావాలని ఆపారనే విమర్శలు వస్తున్నాయి. కానీ తమకుపాజిటివో, నెగెటివో తెలియక 61 మంది తోపాటు వారి కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు ఆందోళన చెందుతున్నారు. ఇక యాదాద్రి జిల్లాలో మే 6 నుంచి వలస కార్మికులతో మొదలైన పాజిటివ్​ కేసుల సంఖ్య సోమవారం నాటికి 62కి చేరింది. వారి ప్రైమరీ కాంటాక్ట్​లకు టెస్టులు చేసిన కొద్దీ కేసులు పెరుగుతుండడంతో ఆఫీసర్లు ఒక్కసారిగా టెస్టులు ఆపేశారు. ఈ నెల 18న 11మంది, ఆ తర్వాత మరో 11మంది శాంపిల్స్ సేకరించి పంపించారు. కానీ ఇప్పటికీ ఈ 22మందికి పాజిటివో, నెగెటివో తెలియడం లేదు.

జిల్లాల్లో కరోనా టెస్టులు జరగట్లే..

అన్ని పాత జిల్లాకేంద్రాలతో పాటు సూర్యాపేట, సిద్దిపేటలో టెస్టులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆయా జిల్లాకేంద్రాల్లోని పెద్దాసుపత్రుల్లో ట్రూనాట్ మిషన్స్ ఏర్పాటుచేశారు. కానీ కొన్ని రకాల ఎక్విప్​మెంట్​ లేక పలుచోట్ల వినియోగంలోకి రాలేదు. కొన్నిచోట్ల వీటితో టెస్టులు చేసేందుకు ఐసీఎంఆర్ అప్రూవల్​ రాలేదని చెబుతున్నారు. దీంతో జిల్లాల్లో తీసిన శాంపిల్స్​ను ​ వరంగల్​ లోని ఎంజీఎం, ఆదిలాబాద్​లోని రిమ్స్​, హైదరాబాద్​లోని గాంధీ, ఉస్మానియాకు పంపుతున్నారు. కానీ జీహెచ్ఎంసీ పరిధిలో 50 వేల టెస్ట్ లు చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నందున గాంధీ, ఉస్మానియాలో హైదరాబాద్​ పరిధిలోని శాంపిల్స్​ టెస్టు చేస్తున్నారు. దీంతో జిల్లాల నుంచే వచ్చిన శాంపిల్స్​ పెండింగ్ ​పెడుతున్నట్లు తెలుస్తోంది. వరంగల్​లోని కేఎంసీ వైరాలజీ ల్యాబ్ కు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల నుంచి నిత్యం 300 నుంచి 320 శాంపిల్స్ వస్తున్నాయి. ఇక్కడ 10 మంది స్టాఫ్ మాత్రమే ఉండడంతో వారిపై ఒత్తిడి పడుతోంది. మొత్తం నాలుగు షిప్ట్ లుగా వర్క్ చేస్తున్నా టైంలోగా ఇవ్వలేని పరిస్థితి. ఆదిలాబాద్​లోని రిమ్స్​లో​ గత నెల 28 నుంచి టెస్టులు షురువయ్యాయి. ఇక్కడికి మంచిర్యాల నుంచే కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఉన్న రెండు ల్యాబ్​లపై ఒత్తిడి ఉన్నందున అక్కడి ఆఫీసర్లు పర్మిషన్​ ఇచ్చాకే జిల్లాల నుంచి శాంపిల్స్​ పంపుతున్నామని అంటున్నారు. గతంలో ఉదయం శాంపిల్​ ఇస్తే సాయంత్రం రిపోర్ట్​ ఇచ్చేవారని, ఇప్పుడు2‌‌‌‌,3 రోజులకుపైగా పడుతోందని చెబుతున్నారు.

కరోనా సమాచారంపై సైలెన్స్​..

జిల్లాల్లో కరోనా టెస్టులు, పాజిటివ్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని గతంలో కలెక్టర్లుగానీ, డీఎంహెచ్​ఓలుగానీ ప్రతి రోజూ సాయంత్రం బులెటిన్ రూపంలో రిలీజ్​ చేసేవారు. కానీ దాదాపు నెల రోజుల నుంచి జిల్లాల్లో బులెటిన్లను ఆపేశారు. ప్రతిరోజూ ఎన్ని శాంపిల్స్​ పంపుతున్నారు? ఎంతమందికి పాజిటివ్​ వచ్చింది? ఎంతమందిని హాస్పిటల్​లో, ఎంతమందిని హోం ఐసోలేషన్​లో ఉంచుతున్నారు? లాంటి వివరాలేవీ చెప్పడం లేదు. ఈ నెల 21న జనగామలో పాజిటివ్​ కేసులేమీ రాలేదని అక్కడి జిల్లా ఆఫీసర్లు చెప్పి ఫోన్లను స్విచ్ఛాఫ్​ చేసుకున్నారు. తీరా ఆ రోజు రాత్రి 9 గంటలకు హైదరాబాద్​ నుంచి ఇచ్చిన బులెటిన్​లో జనగామ జిల్లాలో ఏకంగా 34 మందికి పాజిటివ్​ వచ్చినట్లు చూపారు. అదీగాక కొన్ని జిల్లాల్లో హైకోర్టు సూచనల మేరకు ప్రతిరోజూ 50శాంపిల్స్ ​పంపుతుండగా, కొన్ని జిల్లాల్లో మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం