దివ్యాంగులకిచ్చిన హామీలు అమలు చేయాలి..సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ స్టేట్ చీఫ్ లెటర్

దివ్యాంగులకిచ్చిన హామీలు అమలు చేయాలి..సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ స్టేట్ చీఫ్ లెటర్

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల మేనిఫెస్టో ద్వారా దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్​రావు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా.. హామీలు అమలు చేయకపోవడంతో దివ్యాంగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని చెప్పారు.  బుధవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దివ్యాంగుల పింఛన్ ను నెలకు రూ.6 వేలకు, 80 శాతానికిపైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు రూ.15 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.  

వీటిని హామీ ఇచ్చిన తేదీ నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు చట్ట సవరణ లేదా ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ శాఖలలో దివ్యాంగులకు 4% ఉద్యోగ రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. 'తెలం గాణ సాంస్కృతిక సారధి'లో దివ్యాంగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం పోయింది

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. బీజేపీని కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా ప్రజలు చూస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని స్టేట్ ఆఫీస్​లో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన 200 మంది బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు.  వారికి పార్టీ కండువా కప్పి  బీజేపీలోకి రాంచందర్‌‌రావు ఆహ్వానించారు.