దీపావళి పండుగకు యునెస్కో గుర్తింపు లభించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో యునెస్కో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ (ఐసీహెచ్) లిస్టులో దీపావళికి చోటు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. యునెస్కో ప్రకటన తర్వాత ఎర్రకోట వద్ద పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. దీపావళికి యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది పండుగకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొస్తుందని అన్నారు. యునెస్కో ప్రకటనతో దేశవిదేశాల్లోని ఇండియన్స్ థ్రిల్‌కు గురయ్యారని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మన దేశానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. దీపావళి పండుగకు యునెస్కో గుర్తింపు లభించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో యునెస్కో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ (ఐసీహెచ్) లిస్టులో దీపావళికి చోటు కల్పిస్తున్నట్టు ప్రకటించింది.
యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ ది సేఫ్ గార్డింగ్ ఆఫ్ ది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ మీటింగ్ తొలిసారి మన దేశంలో జరుగుతున్నది. ఢిల్లీలోని ఎర్రకోటలో ఈ నెల 8న ప్రారంభమైన ఈ సమావేశం 13 వరకు కొనసాగనుంది. ఈ మీటింగ్‌లో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చిన ఎంట్రీలను కమిటీ పరిశీలిస్తున్నది. యునెస్కో గుర్తింపు కోసం మొత్తం 80 దేశాల నుంచి 67 ప్రతిపాదనలు వచ్చాయి.
కాగా, మన దేశం నుంచి ఇప్పటికే 15 సాంస్కృతిక అంశాలకు యునెస్కో గుర్తింపు లభించింది. వాటిలో కుంభమేళా, కోల్‌కతా దుర్గా పూజా, గార్బా నృత్యం, యోగా, రామ్‌లీలా ప్రదర్శన తదితర ఉన్నాయి. కాగా, యునెస్కో ప్రకటన తర్వాత ఎర్రకోట వద్ద పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులు సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు.
దీపావళి.. ఒక ఎమోషన్: గజేంద్ర సింగ్ షెకావత్
దీపావళికి యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది పండుగకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొస్తుందని అన్నారు. యునెస్కో ప్రకటనతో దేశవిదేశాల్లోని ఇండియన్స్ థ్రిల్‌కు గురయ్యారని సోషల్ మీడియా ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. ‘‘భారతీయులకు దీపావళి అంటే ఒక ఎమోషన్. ఈ సాంస్కృతిక వారసత్వాన్ని వందలాది ఏండ్లుగా అన్ని వర్గాలు సజీవంగా ఉంచుతున్నాయి. దాన్ని యునెస్కో గుర్తించింది. ఇప్పుడు మా బాధ్యత మరింత పెరిగింది. దీపావళి వారసత్వాన్ని తరతరాలు కాపాడుతాం” అని తెలిపారు.

