దీపావళి అంటే.. ప్రతి ఇంటా నవ్వుల దీపాలు వెలిగే రోజు

దీపావళి అంటే.. ప్రతి ఇంటా నవ్వుల దీపాలు వెలిగే రోజు

దీపావళి అంటే.. ప్రతి ఇంటా నవ్వుల దీపాలు వెలిగే రోజు. పెద్దలు కూడా పిల్లల్లా మారి సరదాగా గడిపే రోజు. చీకటిని వెలుగులు తరిమి కొట్టి, చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం దీపావళి పండుగ. ఆశ్వయుజ బహుళ అమావాస్యను దీపావళి అమావాస్య అంటారు. 

దీపావళి పండుగను ఒక్కోచోట ఒక్కోలా జరుపుకుంటారు. దీపావళి పండుగ ప్రస్తావన రామాయణం నుంచి ఉన్నదని చెప్తారు. రావణ సంహారం జరిగాక సీతా సమేతంగా అయోధ్యకు చేరుకుంటాడు రాముడు. అయోధ్యకు రాముడి రాక, రావణుడిపై విజయానికి గుర్తుగా అమావాస్య చీకట్లతో నిండిపోయిన అయోధ్యను దీపాలతో అలంకరించి సంబురాలు చేసుకున్నారు అయోధ్య వాసులు.

నరకాసుర వధతో..

వరాహ స్వామి, భూదేవికి పుట్టిన నరకాసురుడు, తనని కన్న తల్లి మాత్రమే చంపేలా బ్రహ్మదేవుని వరాన్ని పొందుతాడు. సత్యభామను భూదేవి ప్రతిరూపంగా భావిస్తారు. ఆ వరంవల్ల ద్వాపరయుగంలో ఎందరినో హింసిస్తున్న నరకాసురుడ్ని చంపడానికి కృష్ణావతారం ఎత్తుతాడు శ్రీ మహావిష్ణువు. తరువాత సత్యభామను పెండ్లాడి ఆమెను నరకాసురునితో యుద్ధం చేసి వధించేలా చేశాడు కృష్ణుడు. ఆ రోజునే దీపావళిగా పిలుస్తారు. 

అమావాస్య రోజు

దీపావళిని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుతారు. కోస్తాంధ్రలో సాయంత్రం కాగానే గోగు కర్రకు వత్తిని చుడతారు. దాన్ని వెలిగించి గుమ్మాలకు, వాకిట్లో, ఇంటి చుట్టు పక్కల నేలమీద కొడుతూ ‘దివ్వి దివ్వి దీపావళి. మళ్లీ వచ్చే నాగుల చవితి. పుట్ట మీద జొన్న కర్ర. పుటుక్కు దెబ్బ’ అంటూ పాడతారు. తరువాత ఆ కర్రను ఎవ్వరూ తొక్కని చోట వీధికి దూరంగా పడేసి, వెనక్కి చూడకుండా ఇంటికి తిరిగి వస్తారు. తరువాత దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి పండుగ చేసు కుంటారు. రోగాలు వ్యాప్తి చేసే రాక్షసుడు వాళ్ల ఇంటికి రాకుండా, తరిమి కొట్టడమే దీని వెనకున్న కథ.

లక్ష్మీ పూజలు

దీపావళినాడు ఉత్తరాదిలో లక్ష్మీ దేవికి పూజలు చేస్తారు. కొన్ని చోట్ల కేదారేశ్వర నోములు కూడా చేసుకుంటారు. కేదారేశ్వరుడు అంటే శివుడు. పండ్లు, పూలు, విత్తనాలతో పాలవెల్లిని అలంకరించి కేదారేశ్వరుణ్ని, లక్ష్మీ దేవిని పూజిస్తారు. దానివల్ల పంటలు బాగా పండి సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. పూజ అనంతరం బంధువులతో కలిసి మిఠాయిలు పంచుకొని భోజనాలు పెడతారు. తరువాత టపాసులు కాల్చి పండుగ చేసుకుంటారు.

ధన్వంతరి జయంతి

ఆయుర్వేద అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే. క్షీర సాగర మధనంలో నుంచి లక్ష్మీ దేవి, కామధేనువు, కల్ప వృక్షం, ఐరావతంతో పాటు చేతిలో అమృత భాండం, మరొక చేతితో ఆయుర్వేద గ్రంధాలతో ఆవిర్భవించాడు ధన్వంతరి. అందుకే ఈ రోజు ఆయనను కూడా పూజిస్తారు. ధన్వంతరిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం ఉంటుందని నమ్మకం.