దళిత బంధు నిలిచిపోవడానికి  కారణం కేసీఆర్ 

దళిత బంధు నిలిచిపోవడానికి  కారణం కేసీఆర్ 

హుజురాబాద్ లో దళిత బంధు నిలిచిపోవడానికి  కేసీఆరే  కారణమన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ. రెండు నెలల లోపు హుజురాబాద్ లో అందరికి దళిత బంధు ఇస్తా అని కేసీఆర్ మాట ఇచ్చారని.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక దళితబంధు బీజేపీ  ఆపిందని  నిందలు వేస్తున్నారన్నారు. కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హత లేదని..తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

GHMC ఎన్నికల సందర్భంగా వరదల్లో నష్టపోయిన వారికి 10 వేల రూపాయలు ఇస్తామన్నారు..ఇప్పటికి ఇవ్వలేదని ఆరోపించారు డీకే అరుణ. ఆ 10 వేల నిధులు ఇవ్వొద్దని బండి సంజయ్ ఈసీకి లేఖ రాసినట్లుగా దొంగ లేఖ సృష్టించారన్నారు. హుజురాబాద్ లో రెండు నెలలుగా దళిత బంధు అమలు చేయకుండా ఏం చేశారని ప్రశ్నించారు. హుజురాబాద్ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేసిందన్నారు.
ఒక నియోజకవర్గంలో ఎన్నికల కోసం తెచ్చిన అబద్దపు హామీ, మోసం తేట తెల్లమైందన్నారు. బీజేపీ  దళిత బంధు ఆపిందన్న అసత్య ప్రచారాలు టీఆర్ఎస్  ఆపాలన్నారు. దళితులకు ఆశ పెట్టి మోసం చేయాలనుకున్నారని..కేసీఆర్ ప్రజలను మోసం చేయడం మానుకోవాలని హితవు పలికారు.

అసత్యాలు ప్రచారం చేస్తే ఊరుకోబోమని..దళిత బంధు ఆపమని బీజేపీ  లేఖ రాస్తే ఆ లేఖను బయట పెట్టాలని డిమాండ్ చేశారు డీకే అరుణ.దళితులనే కాదు బీదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి అమలు చేయాలని కోరుతున్నామన్నారు. ఎన్నికల కోసం పథకాలు కాదు..రాష్ట్రం కోసం పథకాలు ఉండాలన్నారు. వర్షాలు పడి పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందుల్లో రైతులు ఉన్నారని.. పంట నష్ట అంచనా వేయలేదన్నారు. రైతు బంధు ఇచ్చామని చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు డీకే.