ఆ హీరో వల్ల నష్టమే లేదు.. కాంగ్రెస్ పార్టీకి ఎంత ధీమా

ఆ హీరో వల్ల నష్టమే లేదు..  కాంగ్రెస్ పార్టీకి ఎంత ధీమా

కర్ణాటకలో బీజేపీకి హీరో కిచ్చా సుదీప్‌  మద్దతు ప్రకటించడం పట్ల  ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. ఎంతో మంది సినీ తారలు వస్తుంటారు.. వెళ్తుంటారు.. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు.  ఆ రెండింటికీ చాలా తేడా ఉందన్నారు.  సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. నిరాశలో కూరుకుపోయిన కమలం పార్టీ తన ప్రచారానికి ఇప్పుడు ప్రజలను కూడగట్టడం అసాధ్యమని తెలిపారు. అందుకే ఎన్నికల ప్రచారానికి కన్నడ నటుడిని రంగంలోకి దించిందని డీకే శివకుమార్ అన్నారు. 

అంతకుముందు, కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రణదీప్ సుర్జ్వాలా బీజేపీకి  సుదీప్ మద్దతు ఇవ్వడంపై స్పందిస్తూ, నటులు ఎన్నికలను నిర్ణయించారని అన్నారు. "బీజేపీ ఎవరినైనా ప్రభావితం చేయగలదు, వారిని ప్రభావితం చేయనివ్వండి. కర్ణాటక ఎన్నికలను 6.5 కోట్ల మంది కర్ణాటక సోదరులు,సోదరీమణులు నిర్ణయిస్తారు, నటులు కాదు" అని ఆయన అన్నారు.

మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదలైంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.  మే 10న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. 224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీకి 119, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి.