కర్నాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక

కర్నాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక

బెంగళూర్: కర్నాటక శాసన సభాపక్ష (సీఎల్పీ) నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు డీకే శివకుమార్‎కు మద్దతుగా సీఎల్పీ తీర్మానం చేసింది. శనివారం (మే 30) కర్నాటక సీఎల్పీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ లీడర్‎గా డీకే శివకుమార్ పేరును మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదించారు. సిద్ధరామయ్య ప్రతిపాదనను మాజీ మంత్రి పరమేశ్వర బలపర్చారు. అనంతరం సీఎల్పీ నేతగా శివకుమార్‎ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

త్వరలోనే గవర్నర్‎ను కలవనున్న డీకే శివకుమార్ సీఎల్పీ మద్దతు లేఖను అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. 2026, జూన్ 3వ తేదీన కర్నాటక 25వ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూర్‎లోని లోక్ భవన్ గ్లాస్ హౌస్లో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు, రాష్ట్ర సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.

సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా

కర్నాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పవర్ షేరింగ్ ఒప్పందంలో భాగంగా హైకమాండ్ ఆదేశాల మేరకు ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. గవర్నర్ కూడా సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు. దీంతో డీకే శివకుమార్‎కు కర్నాటక సీఎం పగ్గాలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది. 2026, జూన్ 3న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండటంతో డీకే శివకుమార్ చిరకాల వాంఛ తీరనుంది. తద్వారా కర్నాటక రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభం కానుంది.