
- డీ-మార్ట్ లాభం 685 కోట్లు.. గత ఏడాదితో పోలిస్తే 3.85 శాతం ఎక్కువ
- 15 శాతం పెరిగిన ఆదాయం.. రెండో క్వార్టర్లో రూ. 16,676 కోట్లు
న్యూఢిల్లీ: డీమార్ట్ పేరుతో రిటైల్ స్టోర్లు నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ రెండో క్వార్టర్లో (ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన) కన్సాలిడేటెడ్ పద్ధతిలో రూ. 684.85 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇది గత సంవత్సరం ఇదే క్వార్టర్లో (జూలై-సెప్టెంబర్) ఉన్న రూ. 659.44 కోట్ల నికర లాభంతో పోలిస్తే 3.85 శాతం ఎక్కువ. కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రెండో క్వార్టర్లో 15.45 శాతం పెరిగి రూ. 16,676.30 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆదాయం రూ. 14,444.50 కోట్లుగా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో రెండో క్వార్టర్లో నికర లాభం మార్జిన్ 4.1 శాతం ఉంది.
ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో రెండో క్వార్టర్లో 4.6 శాతంగా నమోదైంది. మొత్తం ఖర్చులు ఈ క్వార్టర్లో 16 శాతం పెరిగి రూ. 15,751.08 కోట్లుగా ఉన్నాయి. ఇతర ఆదాయంతో కలిపి మొత్తం ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15.3 శాతం పెరిగి రూ. 16,695.87 కోట్లకు చేరింది. ఫలితాలపై కంపెనీ సీఈఓ- కొత్త అన్షుల్ అసవా మాట్లాడుతూ, 2025 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌తో పోలిస్తే, 2026 ఆర్థిక సంవత్సరంలో రెండో క్వార్టర్లో తమ స్టోర్ల సంఖ్య 6.8 శాతం పెరిగిందని తెలిపారు. జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను కస్టమర్లకు అందించేందుకు ధరలను తగ్గించామని వివరించారు.
వైదొలిగిన నెవిల్
ఈ క్వార్టర్లో కంపెనీ అగ్ర నాయకత్వంలో మార్పులు జరిగాయి. అన్షుల్ డీ-మార్ట్ రిటైల్ స్టోర్ వ్యాపారంలోని అన్ని కార్యకలాపాల బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుత సీఈఓ పదవీకాలం వచ్చే జనవరిలో ముగుస్తోంది. 2007 నుంచి డీ-మార్ట్ సీఈఓగా ఉన్న నెవిల్ నొరోన్హా ఈ బాధ్యతలో కొనసాగడానికి ఆసక్తి చూపలేదు. దీంతో ఈ ఏడాది జనవరిలోనే డీ-మార్ట్ తన సీఈఓగా అన్షుల్ అసవాను ప్రకటించింది. ఈ క్వార్టర్లో కంపెనీ ఎనిమిది కొత్త స్టోర్లను ప్రారంభించింది. దీనితో సెప్టెంబర్ 30, 2025 నాటికి మొత్తం స్టోర్ల సంఖ్య 432కు పెరిగింది. ఈ క్వార్టర్లో ఐదు నగరాల్లో (అమృత్సర్, బెల్గావి, భిలాయ్, చండీగఢ్, ఘజియాబాద్) తన ఈ–-కామర్స్ సర్వీస్ డీ-మార్ట్ రెడీ కార్యకలాపాలను కంపెనీ నిలిపివేసింది.
"మేము మా ప్రస్తుత మార్కెట్లలో 10 కొత్త ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశాం. మెట్రో నగరాల్లో మా ఉనికిని విస్తరించడానికి పెట్టుబడులు పెడుతూనే ఉన్నాం’’ అని అవెన్యూ ఈ–-కామర్స్ హోల్ టైమ్ డైరెక్టర్ విక్రమ్ దాసు చెప్పారు. రాధాకిషన్ దమానీ, ఆయన కుటుంబం ప్రమోట్ చేస్తున్న డీ-మార్ట్ మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఎన్సీఆర్, ఛత్తీస్‌గఢ్ డయూ-డామన్ లాంటి మార్కెట్లలో స్టోర్లు నిర్వహిస్తోంది. ఇవి ఇంటి సామాన్లు, కిరాణా సామగ్రి, దుస్తులను అమ్ముతాయి.