ఇండియా అధికారంలోకి వస్తే..సీఏఏపై నిషేధం

ఇండియా అధికారంలోకి వస్తే..సీఏఏపై నిషేధం
  • లోక్​సభ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన డీఎంకే చీఫ్
  •     శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇస్తమని వెల్లడి
  •     నీట్, కొత్త ఎడ్యుకేషన్ పాలసీ 2020 రద్దు చేస్తం
  •     ప్రతి మహిళకు నెలకు వెయ్యి రూపాయల సాయం
  •     లీటర్ పెట్రోల్ రూ.75, డీజిల్ రూ.65కే అందిస్తామని వెల్లడి

చెన్నై :  కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై నిషేధం విధిస్తామని తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ప్రకటించారు. దేశానికి తిరిగి వచ్చిన శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇస్తామని వెల్లడించారు. నీట్ రద్దు చేస్తామని, పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తామన్నారు. డీఎంకే పార్టీ తరఫున బుధవారం ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అదేవిధంగా, రాబోయే లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంకే స్టాలిన్ మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్​కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడంతో పాటు అక్కడ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ 2020ని రద్దు చేస్తామన్నారు. గవర్నమెంట్ స్కూల్స్​లో స్టూడెంట్స్​కు ఉదయం టిఫిన్ పెడ్తామని వివరించారు. కొత్త ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌‌ఈ, ఐఐఏఆర్‌‌ఐలు ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు.

ఆర్టికల్ 361ను సవరిస్తాం

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఇంధన ధరలు తగ్గిస్తామని ఎంకే స్టాలిన్ ప్రకటించారు. గవర్నర్లకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుంచి మినహాయింపునిచ్చే ఆర్టికల్ 361లో సవరణలు చేస్తామన్నారు. ‘‘ఆయా రాష్ట్రాల సీఎంలకు గవర్నర్‌‌ను నియమించే అధికారం కల్పిస్తాం. ఎంఎస్​ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తాం. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అందజేస్తాం. అగ్నిపథ్ స్కీమ్​ను రద్దు చేసి.. ఆర్మీలో శాశ్వత ప్రాతిపదికన యువతకు ఉద్యోగాలు ఇస్తాం. కులాల వారీగా జనగణన చేపడ్తాం. దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తాం. ఐదేండ్లకోసారి కుల, జనగణన చేపడ్తాం’’ అని స్టాలిన్ ప్రకటించారు. రుణాల విషయంలో రాష్ట్రాలపై కేంద్రం విధించిన కొన్ని ఆంక్షలు ఎత్తేస్తామన్నారు. సెస్ రెవెన్యూను రాష్ట్రాలతో పంచుకోవడానికి సిఫార్సు చేస్తామని తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ ట్యాక్స్ రెవెన్యూను (అన్ని రాష్ట్రాలకు కలిపి) 42% నుంచి 50 శాతానికి పెంచాలని కోరుతామన్నారు.

‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ నిబంధన తీసుకొస్తం

దేశ భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని, శ్రీలంకలోని కచ్చాతీవు ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. రిటైర్డ్ జడ్జిలు, సెక్రటరీలు కంపెనీల్లో, రాజకీయ పార్టీల్లో చేరడానికి ముందు తప్పనిసరిగా రెండేండ్ల ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ ప్రవేశపెడ్తామని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోని మహిళలకు వెయ్యి రూపాయలు అందజేస్తామన్నారు. ‘‘బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలు, వడ్డీలు మాఫీ చేస్తాం. స్టూడెంట్స్​కు ఎడ్యుకేషన్ లోన్లు మాఫీ చేస్తాం. అన్ని రాష్ట్రాల సీఎంలను కలుపుకుని దేశాన్ని అభివృద్ధి చేస్తాం. టోల్ ​ప్లాజాలు ఎత్తేస్తాం. వీసీలను రాష్ట్ర ప్రభుత్వాలే నియమించుకునేలా చట్టాలను సవరిస్తాం. విశ్వకర్మ స్కీమ్​లో మార్పులు చేస్తం. సామాజిక న్యాయం అందేలా చూస్తమని డీఎంకే చీఫ్​ స్టాలిన్​ చెప్పారు.

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ ప్రతిపాదన ఎత్తేస్తాం

రాజకీయపరమైన కారణాలు చూపుతూ విదేశాల నుంచి ఎన్జీవో సంస్థలకు వచ్చే ఫండ్స్ కేంద్రం నిలిపివేసిందని స్టాలిన్ తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక ఫారిన్ ఎక్స్ఛేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ను సవరించి.. ఎలాంటి సమస్యల్లేకుండా ఎన్జీవోలకు నిధులు అందేలా చూస్తామన్నారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ ప్రతిపాదన కూడా విరమించుకుంటామని తెలిపారు. రాష్ట్రాలకు లోక్​సభ సీట్ల కేటాయింపు అనేది.. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఇప్పుడున్న పద్ధతిని కొనసాగిస్తామని వివరించారు. పదేండ్ల పాలనలో ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎన్నో చట్టాలు ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చిందని, వాటన్నింటినీ రద్దు చేస్తామని ప్రకటించారు. ఉపాధిహామీ పని దినాలను వంద నుంచి 150కి పెంచుతామన్నారు. రోజువారీ కూలీ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రూ.400 అందిస్తామని తెలిపారు. 

రూ.ఐదు వందలకే గ్యాస్

మహిళలకు లోక్​సభ, స్టేట్ అసెంబ్లీల్లో 33% రిజర్వేషన్లను వెంటనే అమలు చేస్తామని ఎంకే స్టాలిన్ ప్రకటించారు. లింగ సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ‘‘లీటర్ పెట్రోల్ రూ.75, డీజిల్ రూ.65కే అందిస్తాం. వంట గ్యాస్ రూ.500కు అందుబాటులోకి తీసుకొస్తాం. సీఏఏ రద్దు చేసి.. దేశంలో ఉన్న మైనారిటీలందరిపై ఎలాంటి వివక్ష లేకుండా సమానంగా చూస్తాం. ముస్లిం, ఇతర మైనారిటీ వర్గాల జీవితాలు మరింత మెరుగుపర్చేందుకు సచార్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తాం. తమిళనాడులో ఉన్నట్టు అఖిల భారత స్థాయిలో మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేస్తాం’’ అని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. గతంలో మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్​స్టిట్యూషన్స్​కు ఆర్థిక సాయం అందేదని, ప్రస్తుతం దాన్ని ఆపేశారని వివరించారు. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రారంభిస్తామన్నారు.