
రోజులు మారే కొద్దీ మనుషుల అవసరాలు, ఆలోచనలు, ఆశయాలు అన్నీ మారిపోతున్నాయి. అందుకు తగినట్లే అవకాశాలను వెతుక్కోవడం మొదలుపెడతారు. అయితే తాము ఎంచుకున్న రంగంలో తరతరాలుగా రాణించేవాళ్లు కొందరే ఉంటారు. ఈ తరహా మనుషుల్ని వ్యాపారాల్లో, సినీ రంగంలోనే ఎక్కువగా చూస్తుంటాం. ఇండస్ట్రీ ఏదైనా సినీ రంగంలో ఇప్పటికే ఎందరో నటులు తమ వారసుల్ని పరిచయం చేశారు.
ఆ కోవకు చెందినవాడే తమిళ నటుడి కొడుకు అథర్వ. తాత, తండ్రి తర్వాత తానూ ఈ రంగంలో రాణించాలనే కాంక్షతో తనదైన స్టయిల్లో కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం అథర్వ ‘DNA’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
దివంగత సీనియర్ యాక్టర్ మురళీకి ముగ్గురు సంతానం. వాళ్లలో రెండో సంతానమే అథర్వ. అతను పుట్టిపెరిగిందంతా చెన్నైలోనే. అక్కడే మైఖేల్స్ అకాడమీలో స్కూల్ పూర్తి చేశాడు. ‘సత్యభామా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’లో ఇంజనీరింగ్ చదివాడు. 2009లో ‘సత్యజ్యోతి ఫిల్మ్స్’ప్రొడ్యూస్ చేసిన ఒక సినిమాలో లీడ్ రోల్ చేయమని వాళ్ల నాన్న అథర్వతో చెప్పాడట. దాంతో ఆ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ సినిమా పేరే ‘బాణ కాత్తడి’. తన జర్నీ గురించి పలు ఇంటర్వ్యూల్లో అథర్వ పంచుకున్న విశేషాలివి.
‘‘నా అసలు పేరు విజయ్ మురళీ. నిజానికి నా పేరు ఎందుకు మారిందో నాకు తెలియదు. బహుశా మా నాన్నకు దేవుడి మీద ఉన్న భక్తితో నా పేరు ఇలా మార్చేశారేమో. ఇది నా కాలేజీ డేస్‌లోనే జరిగింది. అప్పుడు నా పేరు మారినందుకు నేనేం బాధపడలేదు. మా తాతగారు నాటకరంగం నుంచి కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో అక్కడే ఉంటే సినిమా యాక్టర్ అవ్వలేడని, ఇంట్లో నుంచి పారిపోయి బెంగళూరు వచ్చేశారు.
దాదాపు సంవత్సరం పాటు ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడినా, ఎలాగోలా ఇండస్ట్రీలోనే స్థిరపడ్డారు. తర్వాత మా నాన్నకు కూడా చిన్నప్పటి నుంచే సినిమా మీద ఇంట్రెస్ట్ మొదలైంది. దాంతో ఆయన మొదట ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. పెండ్లి అయ్యాక తమిళనాడుకు వెళ్లడంతో అక్కడే ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేశారు. ఆ పరిచయాలతో అక్కడే సినిమాలు చేయడం అలవాటైంది. నేనూ తమిళ నటుడిగానే ఇండస్ట్రీకి పరిచయమయ్యా.
ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కొన్నా..
గతంలో నేను చాలా కంఫర్టబుల్‌గా ఉండేవాడిని. ఎప్పుడూ నాన్న చెప్పినమాట వింటూ ఆయన కంట్రోల్లోనే ఉండేవాన్ని. ఎప్పుడైతే నాన్న ఈ లోకం వదిలి వెళ్లిపోయారో ఆ మరుసటి రోజు నుంచి ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కోవడం నేర్చుకోవడం మొదలుపెట్టా. మా ఫ్యామిలీ కోసం ధైర్యంగా నిలబడడం నేర్చుకున్నా. ఆ జర్నీ నన్ను మనిషిగా మెరుగుపరిచింది. నా మొదటి సినిమా అప్పుడు నేను నిద్రపోవడం చాలెంజింగ్‌గా ఫీల్ అయ్యా. నేను బాగా యాక్టింగ్ చేశానో లేదో, సక్సెస్ వస్తుందో రాదో ఇలాంటి డౌట్స్ ఉండేవి. దాంతో చాలా ఒత్తిడికి గురయ్యేవాడిని. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటున్నా.
ఇలా మారడానికి కారణం.. నా మొదటి సినిమా రిలీజ్ అయిన పది రోజులకే నాన్న మరణించారు. దాంతో నా ప్రపంచమంతా చీకటి కమ్మేసినట్లయింది. అప్పటివరకు ప్రతీది నాన్నతో చర్చించి నిర్ణయం తీసుకునేవాడిని. ఆయన లేకపోవడం నన్ను మానసికంగా కుంగదీసింది. జీవితం మనం ఊహించినట్టు ఉండదు అని అర్థం అయిన క్షణం అది. బాధతోపాటు భయాన్ని కలిగించింది. కానీ, నేను ఉన్నంతకాలం సంతోషంగా, ఎవరికీ హాని చేయకుండా మంచిగా ఉండాలనుకుంటున్నా. మా అమ్మకు ఎప్పుడూ ఇష్టమైన కొడుకులా ఉండాలని అనుకుంటా.
సినిమాల గురించి..
నాటకాలు :
సినిమాల్లోకి రావడానికి ముందు నేను కొన్ని నాటకాల్లోనూ నటించా. యాక్టింగ్ అనేది ఎవరూ నేర్పించలేరు. అది లోపలి నుంచి రావాలి అనుకుంటాను. నాటకాలు, సినిమాలు రెండూ వేర్వేరు. డ్రామాల్లో రీటేక్స్ ఉండవు. ఒకే ఫ్లోలో చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
టీం వర్క్ :
మొదట్లో అయితే డైరెక్టర్ ఏది చెప్తే అది చేయాలనే ఉద్దేశంతోనే వస్తాం. రెండు మూడు నెలలు షూటింగ్ చేస్తాం. ఆ టైంలో కేవలం స్క్రిప్ట్‌లో కంటెంట్‌ని నమ్మి, డైరెక్టర్ విజన్‌కు తగ్గట్టు కొత్త ప్రయోగాలన్నీ చేస్తుంటాం. ఇప్పుడైతే ఏదైనా ప్రాజెక్ట్ ఒప్పుకునేముందు నేను మొదట స్క్రిప్ట్ చదువుతాను. అది కాస్త కొత్తగా అనిపించి, నాకు నచ్చితే వెంటనే ఓకే చేస్తాను.
డైరెక్టర్ విజన్ ఎలా ఉందో ఒకటికి రెండుసార్లు స్క్రిప్ట్ చదివినప్పుడే అర్థమవుతుంది. కాబట్టి నేను అలా నిర్ణయం తీసుకుంటాను. ఏదైనా స్క్రిప్ట్ నా దగ్గరకొచ్చినప్పుడు ఓపెన్ మైండ్‌తో కథ వింటా. సినాప్సిస్ చదివినప్పటికీ డబ్బులు పెట్టి టికెట్ కొనే ప్రేక్షకుడిలానే కథను వినడానికి ఇష్టపడతా. కొన్ని కథలు నన్ను అలా ఎగ్జైట్ చేశాయి కూడా. సినిమా అనేది టీం వర్క్. టీం అంతా ఎంత కలిసిగట్టుగా పనిచేస్తే రిజల్ట్ అంత బాగా వస్తుంది.
పాత్రలు భిన్నంగా..
నేను బయట ఎలా ఉన్నానో దానికి భిన్నంగా నా పాత్రలు ఉంటేనే నేను ఆ క్యారెక్టర్లా బిహేవ్ చేయగలను. ఈ విషయంలో నాకు ఎలాంటి లిమిట్స్ లేవు. డీఎన్ఎ సినిమాలో నేను తండ్రిగా నటించాను. సమాజం, కుటుంబం నుంచి ఎదుర్కొనే సవాళ్లు, సమస్యల నుంచి ఇద్దరి వ్యక్తుల జీవితం ఎలా మలుపు తిరిగింది అనేదే ఈ కథ.
నిజజీవితంలో నాకింకా పెండ్లికాలేదు కాబట్టి నాకు అది డిఫరెంట్ రోల్. మనం మనిషిగా ఎన్నో దశలు చూస్తాం. వాటిలో ఒక దశలో ఒంటరిగా ఉన్నట్టు భావిస్తాం. కానీ, ఎందుకు అలా ఉన్నామో తెలియదు. ఇదంతా మన ఆలోచనలోనే ఉంటుంది.
వర్క్‌షాప్ ఉపయోగపడింది:
ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. పాత్రకు తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. నా మొదటి రెండు మూడు సినిమాలకు వర్క్‌షాప్ చేశాను. రీడింగ్ సెషన్స్, ఇంప్రువైజేషన్ వంటివాటికోసం కొన్ని సినిమాలకు వర్క్‌షాప్ చేశా. నిజానికి గతంలో నేను కెమెరా ముందు నిల్చోవాలంటే సిగ్గుపడేవాడిని. అలాంటిది యాక్టింగ్ కెరీర్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. దాంతో నాన్న నన్ను నటించమని చెప్పినప్పుడు నాలో ఉన్న డౌట్స్, భయాలన్నీ ఆయనకు చెప్పా. అప్పుడు ఆయన నాలో భయాన్ని పోగొట్టడానికి వర్క్‌షాప్ చేయించాలనుకున్నారు.
అందుకోసం యాక్టర్ నాజర్ని అడిగారు. ఆయన ఫిల్మ్ మేకింగ్ గురించి నాకు చాలా వివరంగా చెప్పారు. నా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అలా మూడు నెలలపాటు వర్క్‌షాప్‌లో పాల్గొన్నా. దాంతో నాకున్న అపోహలన్నీ పోయాయి. ఆయన చేసిన సాయానికి ఎప్పటికీ రుణపడి ఉంటా.
పదిహేనేండ్ల జర్నీ:
ఒక యాక్టర్‌గా ఇప్పటికి నా జర్నీ పదిహేనేండ్లు పూర్తయ్యింది. ఇండస్ట్రీలో నేను ఏ లెవల్లో ఉన్నాను? అనే దానిపై ఎప్పుడూ ఫోకస్ చేయలేదు. ఒక సినిమాకు సైన్ చేసేటప్పుడు నేనేం చెక్‌లిస్ట్ పెట్టుకోను. నేను ఏదో ఆశించి చేయడం కాదు... ఫిల్మ్ మేకర్ నన్ను ఎలా చూపించాలి అనుకుంటున్నారు అనేదానికి ఇంపార్టెన్స్ ఇస్తా. క్యారెక్టర్‌కు తగ్గట్టు వాళ్లే నన్ను మార్చుకుంటారు.
With all our love, presenting to you the trailer of DNA 🧬 https://t.co/l6E7tUQ2lF
— Atharvaa (@Atharvaamurali) June 11, 2025
In theatres near you from JUNE 20th 2025#NimishaSajayan #NelsonVenkatesh @Olympiamovis @Ambethkumarmla @RedGiantMovies_ @maanasa_chou @Filmmaker2015 @editorsabu @GhibranVaibodha… pic.twitter.com/9Y12rxpT4o
ఒకే తరహా పాత్రలు లేదా కథలు చేయడం అనే మూసధోరణి నుంచి బయటపడడం చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఒకసారి చేసినలాంటి సినిమా మళ్లీ చేయను. ఇంకా చెప్పాలంటే వెరైటీ క్యారెక్టర్స్‌లో కనిపించడం ఇష్టం. నెగెటివ్ రోల్స్ ఇచ్చినా చేయడానికి రెడీగా ఉన్నా. వర్సటైల్గా నటించేందుకు ఇప్పటికైతే లిమిటేషన్స్ ఏం పెట్టుకోలేదు. అథర్వ మురళీ 2019లో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గద్దలకొండ గణేష్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు.