తెలంగాణ కులగణన సర్వేలో తేలిన ఒక విచిత్ర సంఖ్య ‘నో క్యాస్ట్’ గ్రూప్‌ది. కులగణన సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ఏ కులం స్థానం ఏది? ఏ కులం సంఖ్య ఎంత? అనే అంశాలపై చేయడమైనది. ఈ కులగణన ఇంతకుముందు ఏ ఇతర రాష్ట్రంలోనూ, దేశస్థాయిలోనూ జరగనివిధంగా చాలా సైంటిఫిక్‌గా జరిగింది. అయితే, కులంపేరు చెప్పదల్చుకోని కొంతమంది తెలంగాణ హైకోర్టులో కేసువేసి ఒక ఇంటెరిమ్ ఆర్డర్ ద్వారా కులగణన మాన్యువల్‌లో ‘నో క్యాస్ట్’ కేటగిరీని ఎన్యుమరేటర్లకు ఇచ్చిన మాన్యువల్‌లో 999 నంబర్లో ఒక కోడ్ సంఖ్యను చేర్చింది. ఈ కేటగిరీ కింద రాష్ట్రంలో 11,96,482 మంది రాష్ట్ర జనాభాలో (13.4శాతం) నమోదు చేసుకున్నారు. అయితే, ఇందులో 73శాతం జీహెచ్ఎంసీలో, 13శాతం ఇతర జిల్లా కేంద్రాల్లో ఉన్నారు. జిల్లాలలో నిజామాబాద్, నిర్మల్, హన్మకొండలో ఉన్నారు. అయితే, కేటగిరీని కులగణన మాన్యువల్‌లో చేర్చాలని తామే కోర్టుకు వెళ్లామని కుల నిర్మూలన సంఘం వంటి కొన్ని సంస్థలు క్లైయిమ్ చేసుకున్నాయి. అది ఎవరయినా మాకు కులం లేదు అని క్లైయిమ్ చేసుకునే జనాభా హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్ వంటి పట్టణాల్లోనే ఉన్నారా, మిగతా చోట్ల అసలే ఎందుకు లేరు అన్న ప్రశ్న ఉత్పన్నం కాక మానదు.
ఈ కోవలో నమోదు చేసుకున్న దాదాపు 12లక్షల మంది అసలే గతంలో కులాన్ని వాడుకోలేదా, ఉదాహరణ ఒక రిటైర్డ్ అధికారి గతంలో కుల సర్టిఫికెట్ మీద ఉద్యోగం తీసుకుని రిటైరైన తరువాత తాను ‘నో క్యాస్ట్’ కేటగిరీలో నమోదు చేసుకున్నాడనుకుందాం. అతనిప్పుడు బంజారాహిల్స్లోనో, జూబ్లీహిల్స్‌లోనో బంగ్లాలో నివసిస్తూ కులం తక్కువతనం నుంచి బయటపడడానికి ఈ పని చేశాడనుకుందాం. ఇది ఎంత ఇమ్మోరల్ వ్యక్తిగత జీవితం? అలాగే ఒక అగ్రకుల వ్యక్తి తాను ప్రోగ్రెసివ్ వ్యక్తిగా మనగలగడానికి ఈ కేటగిరిలో పేరు నమోదు చేసుకున్నాడనుకుందాం. తాను తన కులం పేరు రెడ్డో, చౌదరో, శర్మనో, మిశ్రానో, రావో అనో తన పేరు చివర రాసుకుంటూ ఇలా చేశాడనుకుందాం. ఆ కుల క్యాపిటల్‌తో అన్ని రకాల వనరులు పొందుతూ కేవలం కులగణనలో ఇలా రాయించుకుంటే ఆ వ్యక్తికి కుల వనరు లేదని ఎవరనుకుంటారు? అది స్త్రీలైనా, పురుషులైనా కులవ్యవస్థ తమ చుట్టూ ఉన్నప్పుడు తాను కులంలేని ‘తామరాకులా, కులతత్వానికి దూరంగా ఉంటానంటే సాధ్యమేనా? కులం ఎక్కువ, తక్కువ విలువను సామాజిక మార్పు క్రమంలో మార్చుకుంటూ పోవాలిగాని, నేను ఏ కులానికీ చెందిన వ్యక్తిని కాదు అన్నంతమాత్రాన కులం పోదు.
కులాంతర వివాహం-నో క్యాస్ట్
కులాంతర వివాహం చేసుకున్నవాళ్లు కుల వ్యవస్థలో ఎలా ఉండాలి? తమ పిల్లలకు కులం అంటగట్టాలి అనే సమస్య ఉంది. కులాల మధ్య విలువల్లో తేడా ఉంది కనుక కులాంతర పెండ్లి కూడా పెద్ద సమస్యగా మారుతున్నది. హత్యలు, సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నాయి. ఒక చెప్పులు చేసే కులం నీచమైనదని, ఒక పూజారి కులం అతి గొప్పదని విలువ రూపొందించినందువల్ల ఈ సమస్య జటిలమైనది. ఈ రకమైన పెండ్లిళ్లు జరిగిన తమ పిల్లలకు రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలో, విద్యో కావాలనుకున్నా ఆ కుల సర్టిఫికెట్ తీసుకుంటున్నారు. అది నేరం కాదు. ఆ అవసరం లేదనుకున్నప్పుడు తాము కులాంతరులం అని ఆ కుటుంబం భావిస్తే సమస్యలేదు. లేదా అగ్రకులానికి చెంది ఉండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాడుకోవడానికి కుల సర్టిఫికెట్ తీసుకుని పిల్లల చదువుకు, ఉద్యోగానికి వాడుకుని, కులగణనలో కులంలేదని నమోదు చేసుకుంటే ఇంతకన్నా మోసకారితనం మరొకటి ఉండదు. ఈ సర్వే డేటాలో 43.3శాతం కుల సర్టిఫికెట్లు తీసుకున్నారు. అటువంటప్పుడు వాళ్లు కులరహితులు ఎలా అవుతారు? అంతేకాదు అందులో 22.9% ఐఏఎస్, ఐపీఎస్‌లలో ఉన్నారు. మరో 13.2% ఇతర సెంట్రల్ సర్వీసులలో ఉన్నారు. 9.3శాతం జడ్జిలు ఉన్నారు. వీళ్లంతా కుల వనరులను ఎక్కడా వాడుకుని ఉండరా? వారు ఏ కుల పునాదుల నుంచి వచ్చినా కులం ఒక సామాజికి శక్తిగానో, బంధంగానో ఉన్నప్పుడు మనం కులం లేదు అని చెప్పుకుందామంటే ఆ వ్యక్తి కులరహితం వైపు పయనిస్తున్నట్టు కాదు. కులంతో నష్టపోతున్న సమాజాన్ని మోసం చేసినట్టు అవుతుంది. అంబేద్కర్ తన మహర్ ఓన్ చేసుకోకపోతే ఆయన సిద్ధాంతమే ఉండేది కాదు.
ఇందులో దినసరి కూలీలు సైతం
ఇందులో 11.4శాతం దినసరి కూలీలు ఉన్నట్టు డేటా చెబుతుంది. ఈ దేశంలో తమకు కులం లేదని చెప్పుకోగలిగే కూలీలు ఉంటారని ఊహించలేము. ఇక్కడ జరిగిందేమంటే ఎన్యూమరేషన్ మాన్యువల్‌లో తెలంగాణలోని కులాల పేర్లు వాటికి కోడ్ నంబర్లు ఇచ్చారు. కానీ, ఇతర రాష్ట్రాల నుంచి మైగ్రేట్ అయిన కూలీలను ఏ కులంలో నమోదు చెయ్యాలో తెలియక వారిని నో క్యాస్ట్ కింద నమోదు చేసి ఉంటారు. కొంతమందిని అదర్స్ (ఇతరుల) కింద 1,74,002 (0.5) జనాభాను నమోదు చేశారు. వీరిని కూడా ఓసీలో చూపడం సరికాదు. అయితే, ఇది మొదటిసారి ఒక మాన్యువల్ ఆధారంగా జరిగిన కులగణన కనుక ఇటువంటి సమస్యలు తలెత్తడం సహజం.
ఈ దేశంలో కులరహితం ఊహాజనితం
1970వ దశకంలో నేను విద్యార్థిగా ఉన్నప్పుడుగాని, 80లలో పౌరహక్కులలో పనిచేసినప్పుడుగాని కమ్యూనిస్ట్ సిద్ధాంత కర్తలు కులం లేదని, దాన్ని సమస్యగా చూడొద్దని చెప్పేవారు. అలాగే గత 100 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు కూడా మా సంస్థలో కులం లేదు. మేం దాన్ని గుర్తించం అని రాసింది. చెప్పింది తెలుసు. కానీ, ఈ వాదనలు అగ్రకుల నాయకులు తమ చేతుల్లోనే పదవులు ఉంచుకుంటూ చేసిన వాదనలు. వీళ్లంతా తెలంగాణలో నో క్యాస్ట్‌లో నమోదు అలానే చేసుకోవాలని తన క్యాడర్‌కు, తమ సంఘాలకు చెప్పి ఉంటారు. హైటెక్ సిటీ కంపెనీల ఓనర్లు, సీఈవోలు, చాలామంది ఇంజినీర్లు, డాక్టర్లు, రకరకాల అధికారులు ఇందులో నమోదు చేసుకుని ఉండవచ్చు. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా ఉండవచ్చు. వాళ్లంతా నో క్యాస్ట్ కేటగిరీలో నమోదు చేసుకుని ఉండవచ్చు. కులరహిత జీవితం అవగాహన సమస్య కాదు. అది తరతరాల ఆచరణ, జీవన సమస్య.
సమాజం కులరహితం కావాలంటే..
ఈ దేశంలో సమాజం కులరహితం కావాలంటే ముందుగా కులాలన్నీ ఆ కుల శ్రమ ఆధారంగా ఆధ్యాత్మిక, సామాజిక సమాన గౌరవాన్ని పొందాలి. కులంపేరు చెప్పగానే ఎక్కువ తక్కువ విలువపోయి అదొక సమాన గౌరవప్రద ఐడెంటిటీగా సమాజం చూడాలి. ఆ క్రమంలో కులంపేరును వాడకం తగ్గుకుంటూ పోతుంది. అది మాదిగకూ పోతుంది. పై కులాలన్నిటికీ పోతుంది. అంతేకాని కులగణనలో కులం లేదని నమోదు చేసుకుంటే ఆచరణలో దాని విలువ మారదు. పై కుల వ్యక్తులు ఆచరణలో దాన్ని వాడుకుని స్థానాన్ని, డబ్బును, సంపాదించక మానరు. కింది కులస్తులు దానితో వచ్చే అభివృద్ధి వ్యతిరేక అడ్డుకట్టలను ఎదుర్కొనక తప్పదు. ఈ దేశంలో కులం హిందూమత నిర్మిత వ్యవస్థ. సుప్రీంకోర్టు కూడా కులానికి, మతానికి ఉన్న సంబంధాన్ని చూసింది. అంబేద్కర్ చాలా పరిశోధన తరువాత వచ్చిన
కంక్లూజన్ అదే. కులగణన కులాల ఐడెంటిటీని ముందు బలోపేతం చేస్తుంది. కింది కులాల నంబర్ ఆధారంగానే కాకుండా, వారి ఆర్థిక, సామాజిక, విద్య, మొబిలిటీ ఆధారంగా ఒక కులానికి వేసిన అంచనా ఆధారంగా ఆ కుల ఆర్గనైజేషన్ ఐడెంటిటీ బలోపేతం అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూపు ఈ సిద్ధాంత పునాదిపైన కంపోజిట్ బ్యాక్‌వర్డ్‌నెస్ ఇండెక్స్‌ను 242 కులాలకు తయారుచేసింది. జాతీయవాద దృక్పథం ఉన్న ఏ కుల మేధావి అయినా తాను అభివృద్ధి చెందిన కులానికి చెందినట్లయితే దాన్ని ఒప్పుకుని బాగా వెనుకబడిన కులాల అభివృద్ధిని త్యాగబుద్ధితో ఆలోచించి వారి అభివృద్ధికి దోహదపడాలి. అట్లా క్రమానుగతంలో అన్ని కులాలు కులరీత్యా సమాన గౌరవస్థాయికి చేరుకుంటాయి. అప్పుడు నేషన్ ఒక బలమైన నేషన్‌గా మారుతుంది. కానీ, అభివృద్ధిలో ఉన్న కులాలవాళ్లు తమకు కులం లేదని తప్పించుకు తిరిగితే అది దేశానికి కూడా నష్టం.
మండల్ కాలపు వాదన
1990 మండల్ ఉద్యమ కాలంలో రిజర్వేషన్ వ్యతిరేక అగ్రకులాలు అసలు ఈ దేశంలో కులం లేదు. దాన్ని కుల జనాభా లెక్కల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం సృష్టించిందని వాదించారు. ఆ మేధావుల పేర్లలో కులం ఉండికూడా ఈ వాదనలు చేశారు. కానీ, ఈ వాదన చేసిన మేధావివర్గం వారు అగ్రకులాలకు రిజర్వేషన్లను ఇచ్చినప్పుడు కుల పునాదిని అంగీకరించి ఇప్పుడు తమ పిల్లలకు కుల సర్టిఫికెట్ఆధారంగా రిజర్వేషన్లు పొందుతున్నారు. అందులో ధనవంతులు ఈ రిజర్వేషన్లను అంగీకరిస్తున్నారు. అంటే కులం కేవలం పేరు కాదు. అది కుల కుటుంబాల్లో పంపకం వల్ల అది ఒక ఆలోచన స్వభావంగా పనిచేస్తుంది. ఒక సుదీర్ఘకాలం కుల దొంతర కులతత్వాన్ని చూసిన వ్యక్తిగా నాకు తెలంగాణ వంటి చిన్నరాష్ట్రంలో 3.4శాతం ప్రజలు తమకు కులం లేదని ప్రకటించుకున్నారంటే ఆశ్చర్యం వేసింది.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్

