రోజుకు లక్ష టెస్టులు చేయండి

రోజుకు లక్ష టెస్టులు చేయండి
  • టెస్టుల సంఖ్య ఎందుకు పెంచట్లే? 
  • గత ఆదేశాలు ఎందుకు అమలు చేయట్లేదని ఫైర్ 
  • ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్టులపై రిపోర్టు ఇవ్వాలని ఆర్డర్ 

హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, అయినా టెస్టుల సంఖ్యను ఎందుకు పెంచడం లేదని రాష్ట్ర సర్కార్ పై హైకోర్టు ఫైర్ అయింది. ఒమిక్రాన్ రూపంలో వైరస్ వ్యాప్తి చెందుతోందని, దీన్ని తీవ్రంగా పరిగణించాలని, టెస్టుల సంఖ్యను బాగా పెంచాలని సూచించింది. రోజుకు లక్ష టెస్టులు చేయాలని ఆదేశించింది. కరోనాపై ఫైల్ అయిన పిల్స్ పై చీఫ్‌‌ జస్టిస్‌‌ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్‌‌ అభినంద్‌‌కుమార్‌‌ షావిలితో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా లాయర్ చిక్కుడు ప్రభాకర్‌‌ వాదిస్తూ.. గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌‌ టెస్టులు కలిపి రోజుకు 50 వేలు మాత్రమే చేస్తున్నారని.. ఎప్పుడో ఒకసారి మాత్రమే లక్ష 
చేస్తున్నారని చెప్పారు. 


తప్పకుండా రోజుకు లక్ష టెస్టులు చేయాలని ఇంతకుముందు కోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు. రోజుకు 50 వేలకు మించి టెస్టులు చేయడం లేదని మరో లాయర్ ఎల్.రవిచందర్ చెప్పారు. దీనిపై స్పందించిన కోర్టు.. గతంలో తామిచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన ఆదేశాలను తప్పకుండా అమలు చేయాలంది. ‘‘మళ్లీ కరోనా తీవ్రత పెరిగింది. ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని సౌలతులు కల్పించాలి. డాక్టర్లు, బెడ్స్, మెడిసిన్స్, మాస్కులు, ఆక్సిజన్ తదితర అందుబాటులో ఉండేలా చూడాలి. కేవలం హైదరాబాద్‌‌లోనే కాకుండా జిల్లా ఆస్పత్రులు, పీహెచ్‌‌సీల్లోనూ ట్రీట్ మెంట్ అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలి. ప్రజలు మాస్కులు పెట్టుకునేలా, ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా, గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలి” అని హైకోర్టు ఆదేశించింది. 
 

కేంద్ర గైడ్ లైన్స్ అమలు చేయండి... 

సర్కార్ పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో పలువురు లాయర్లు, కోర్టు స్టాఫ్ కరోనా బారిన పడ్డారని.. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లాయర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసుల సంఖ్యను బట్టి కంటైన్‌‌మెంట్, మైక్రో కంటైన్‌‌మెంట్‌‌ జోన్ల ఏర్పాటుకు ఉత్తర్వులివ్వాలన్నారు. ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ వాదిస్తూ.. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు టెస్టులు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలను ఈ నెల 30 వరకు బంజేశామన్నారు. ఆస్పత్రుల్లో మందులు, బెడ్స్, ఆక్సిజన్‌‌ సిద్ధంగా ఉన్నాయన్నారు. వాదనలు విన్న కోర్టు.. తమ ఆదేశాల అమలు, కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌‌ టెస్టులపై వేర్వేరుగా రిపోర్టులు ఇవ్వాలంది. కేంద్ర గైడ్​లైన్స్​ను తప్పకుండా అమలు చేయాలని చెప్తూ విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.