మిగులు నీటిని లెక్కించొద్దు

మిగులు నీటిని లెక్కించొద్దు

కృష్ణా బోర్డు కు ఏపీ సర్కారు లెటర్‌

ఎక్కువ నీళ్లు మళ్లించుకుంటూ లెక్కలు అడగొద్దనే తీరు

మనకంటే ఏపీ తీసుకునే నీళ్లే ఎక్కువంటున్న రాష్ట్ర ఇంజనీర్లు

హైదరాబాద్‌, వెలుగు: కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ నిండి గేట్ల ద్వారా సముద్రంలోకి నీళ్లు పోతున్న రోజుల్లో రెండు రాష్ట్రాలు తీసుకునే నీటిని లెక్కించొద్దని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ఏపీ విజ్ఞప్తిపై తెలంగాణ అభిప్రాయమేంటో చెప్పాలంటూ బోర్డు మెంబర్‌ ఎల్ మౌన్‌తంగ్‌ సోమవారం రాష్ట్ర ఇరిగేషన్‌ ఈఎన్సీకి లేఖ రాశారు. ప్రాజెక్టుల నుంచి నీటిని సముద్రంలోకి వదులుతున్న రోజుల్లో రెండు రాష్ట్రాలు కామన్‌ రిజర్వాయర్లు శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నుంచి తీసుకునే నీటిని ఆయా రాష్ట్రాల కేటాయింపుల్లో లెక్కించవద్దన్న ఏపీ సూచనపై స్పందన తెలియజేయాలని అందులో కోరారు.

ఏపీ తీసుకునే నీళ్లే ఎక్కువ

రిజర్వాయర్లు సర్‌‌ప్లస్‌ అయ్యే రోజుల్లో ఏపీ తీసుకునే నీళ్లే 80 శాతం వరకు ఉంటున్నాయి. తెలంగాణ సాగర్‌ ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ ద్వారా మాత్రమే నీటిని తీసుకుంటుంది. కల్వకుర్తి లిఫ్ట్‌ కరోనా కారణంగా ఆపరేషన్ లో లేకపోవడంతో రోజుకు 2 వేల క్యూసెక్కుల నీటిని తీసుకోలేకపోతున్నారు. ఏపీ ఒక్క పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారానే 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుంటుంది. సాగర్‌ కుడి కాలువ, కేడీఎస్‌, ముచ్చుమర్రి, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా కూడా ఏపీ నీటిని తీసుకుంటుంది. తెలంగాణ రోజుకు ఒకటిన్నర టీఎంసీల నీళ్లను మాత్రమే తరలించే అవకాశముండగా ఏపీ 8 టీఎంసీలకు వరకు నీటిని తీసుకుంటుంది. అలా తీసుకునే నీటిని మినహాయింపు కోరి ఫ్లడ్‌ ఇయర్‌ చివరి వరకు నీటిని తరలించుకోవడానికి ఏపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని తెలంగాణ ఇంజనీర్లు చెప్తున్నారు. గత ఫ్లడ్‌ ఇయర్ లో సర్‌‌ప్లస్‌ డేస్‌లో తీసుకున్న నీటికి మినహాయింపు కోరగా టెక్నికల్‌ కమిటీ ఇంత వరకు దానిపై ఏమీ తేల్చలేదు. ఇప్పుడు మళ్లీ ఏపీ గతంలో చేసిన విజ్ఞప్తినే ముందు పెట్టి అదనంగా నీటిని తీసుకోవాలని ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఇంజనీర్లు పేర్కొంటున్నారు.

పలు ప్రాంతాలకు ముప్పు

జూరాల నుంచి పులిచింతల వరకు అన్ని రిజర్వాయర్ల గేట్లు ఎత్తి లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారని, ఆ వరద నీటితో విజయవాడ సహా తమ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందని ఏపీ ఈఎన్సీ తన లేఖలో తెలిపారు. పులిచింతల, ప్రకాశం బ్యారేజీతో పాటు దిగువ ప్రాంతాలు వరద ఉధృతితో దెబ్బతింటాయని, భవిష్యత్ లో ఐదు లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశముందన్నారు. వరద ఉధృతితో తమ రాష్ట్రంలోని ఆస్తులు దెబ్బతినకుండా ఎగువన ఔట్ లెట్ల ద్వారా ఎక్కువ నీటిని తరలించుకుంటామని తెలిపారు. ప్రాజెక్టులన్నీ సర్ ప్లస్‌ అయ్యే రోజుల్లో ఏపీ, తెలంగాణ తీసుకునే నీటిని ఆయా రాష్ట్రాల ఎకౌంట్లో లెక్కించవద్దని సూచించారు.