
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదల కాకుండా తనతో పాటు కొంతమంది సినీ నిర్మాతలు కుట్ర పన్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలన్న ప్రతిపాదన సినీ పరిశ్రమ, థియేటర్ యజమానులు,ఎగ్జిబిటర్లకు సంబంధించిన అంతర్గత వ్యవహారమని ద్వారంపూడి పేర్కొన్నారు.
ఆ అంశంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. పూర్తిగా సినీ పరిశ్రమకు సంబంధించిన ఈ వ్యవహారంలో నిర్మాతల మండలి ప్రతినిధి నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలను ఏమాత్రం ధృవీకరించుకోకుండా కొన్ని మీడియా సంస్థలు అనవసరంగా తన పేరును వాడి వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ వివాదంలో తన పాత్ర పై ఏమైనా ఆధారాలు ఉంటే చూపించి విమర్శలు చేయాలని ఆయన హితవు పలికారు.
ALSO READ | ఆ నలుగురిలో నేను లేను.. ఆ నలుగురితో నాకు సంబంధం లేదు: అల్లు అరవింద్
నిజ నిర్ధారణ చేసుకోకుండా సినీ పరిశ్రమ వివాదంలోకి తనను లాగడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమకు చెందిన ఏ ఒక్కరిని తాను కలవలేదని ఆయన స్పష్టం చేశారు. చేసిన ఆరోపణలు రుజువు చేయగలరా? అని ద్వారంపూడి నిలదీశారు. రాజకీయాల్లో ఉన్నననే అక్కస్సుతో ఏదో ఒక వివాదంలోకి లాగి తప్పుడు విమర్శలు చేయడం, అబద్ధాన్ని నిజం చేసేలా పదేపదే ప్రసారం చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.
జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్కు సంబంధించిన అంశంతో సహా ఏ ఒక్క సినీ పరిశ్రమ వివాదంలో తన పాత్ర లేదని ద్వారంపూడి మరోసారి స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ద్వారంపూడి హెచ్చరించారు.