నాణ్యమైన విద్య పొందే హక్కు కోల్పోతరు

నాణ్యమైన విద్య పొందే హక్కు కోల్పోతరు
  • తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్

హైదరాబాద్ : నేషనల్ ఎడ్యుకేషన్​ పాలసీ -2020 కి చట్టబద్ధత కల్పించవద్దని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. పార్లమెంట్​లో ఎన్ఈపీ బిల్లును ప్రవేశపెట్టవద్దని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు కమిటీ సభ్యులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిల్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట రమణకు వినతి పత్రం అందజేశారు. రాజ్యాంగానికి, ఫెడరల్ సూత్రాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని ప్రజలందరూ తిరస్కరించాలని విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ హరగోపాల్ కోరారు.

విద్యను అందరికి అందించాలనే ఆకాంక్షతోనే దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఎన్ఈపీతో 90% విద్యార్థులు నాణ్యమైన విద్య పొందే హక్కు కోల్పోతారని అన్నారు. ప్రీప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్​ను కేంద్రం ప్రాథమిక హక్కుగా గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఈపీ.. వృత్తి విద్యా పేరుతో కుల వ్యవస్థను బలోపేతం చేసేలా ఉందని ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ విమర్శించారు.