Hyderabad: గణేష్ ఉత్సవాల్లో డీజేలు పెట్టొద్దు.. డ్రోన్లు ఎగరేయొద్దు..రాచకొండ సీపీ సుధీర్ బాబు

Hyderabad:  గణేష్ ఉత్సవాల్లో డీజేలు పెట్టొద్దు.. డ్రోన్లు ఎగరేయొద్దు..రాచకొండ సీపీ సుధీర్ బాబు
  • గణపతి ఉత్సవాలను ప్రశాంతంగా చేసుకుందాం
  • మండపాల నిర్వాహకులకు రాచకొండ సీపీ సుధీర్ బాబు సూచనలు

ఎల్బీనగర్, వెలుగు: ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరిగే గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని రాచకొండ సీపీ సుధీర్​బాబు సూచించారు. నేరేడుమెట్​లోని కమిషనర్ ఆఫీస్​లో రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి జిల్లాల అధికారులు, భాగ్యనగర గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మండపాల నిర్వాహకులకు సీపీ పలు సూచనలు చేశారు. మండపాలను తాత్కాలికంగా మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని,  విద్యుత్, అగ్ని ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. 

మండపాల వద్ద ఇసుక సంచులు, నీటి డ్రమ్ములు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పీవోపీ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను పెట్టి పర్యావరణానికి పరిరక్షణకు కృషి చేయాలన్నారు. నిమజ్జన చివరి రోజున రద్దీని తగ్గించేందుకు మూడు లేదా 5, 7రోజున నిమజ్జనం చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలన్నారు. ఫిట్ నెస్ ఉన్న వాహనాలను మాత్రమే నిమజ్జనానికి ఉపయోగించాలన్నారు. ముందస్తు అనుమతులతో మాత్రమే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని, డీజేలకు అనుమతి లేదన్నారు. 

మతపరమైన ప్రదేశాల వద్ద జెండాలు, పోస్టర్లు, బ్యానర్లు ఉంచకూడదని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్ లు నిషేధమని స్పష్టం చేశారు. విరాళాలు స్వచ్ఛందంగా మాత్రమే తీసుకోవాలన్నారు. అలాగే మండలాల వద్ద మద్యం సేవించడం, జూదం వంటి ఇతర చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.10వ రోజు నిమజ్జనంతో పాటు మిలాద్​-ఉన్ -నబీ ఉండడంతో  శాంతిభద్రతలపై పోలీసు సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.  గతేడాది 13,472 విగ్రహాలు ప్రతిష్ఠించగా, నిమజ్జన సమయంలో 36 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు, డీసీపీ సునీతా రెడ్డి, మున్సిపల్, విద్యుత్, వాటర్ వర్క్స్ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.