
యూరియా పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీలు. మంగళవారం (ఆగస్టు 19) పార్లమెంటు ఆవరణలో యూరియా కొరతపై మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు యూరియా పంపుతూ.. తెలంగాణపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు ఎంపీలు మల్లురవి, గడ్డం వంశీకృష్ణ. తెలంగాణపై కేంద్ర వైఖరికి నిరసనగా పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు ఎంపీలు.
తెలంగాణకు మొత్తం 9 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా 3 నుంచి 4 లక్షల టన్నుల యూరియా మాత్రమే ఇచ్చినట్లు ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఫెర్టిలైజర్స్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ క్రితీ ఆజాద్ ను సోమవారం ఎంపీలు అంతా కలిసి ఈ అంశంపై వివరించినట్లు చెప్పారు. మంగళవారం జీరో అవర్ లో దీనిపై ప్రశ్నించనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు యూరియా పంపుతూ.. విపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపిస్తున్నట్లు ఆరోపించారు.
►ALSO READ | గచ్చిబౌలిలో ‘ఇంటిగ్రేటెడ్’ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ..భవన నిర్మాణానికి ఆగస్టు 20న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇంకా మూడు లక్షల టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉందని ఎంపీ మల్లు రవి అన్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలకు యూరియా కొరత లేకుండా పంపుతున్నారని అన్నారు. కానీ తెలంగాణను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందనే ఇలా చేస్తున్నారని అన్నారు. ఈ అంశంపై జేపీ నడ్డా కార్యాలయం ముందు ధర్మాకు దిగుతామని హెచ్చరించారు.