
- తినే తిండిలో 67% అన్నమే..
- మొత్తం ఆహారంలో 70% కార్బోహైడ్రేట్లే
- కూరలు, పండ్లు తక్కువగా తింటున్నరు
- ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్లు అందక రోగాలు
- కార్పోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలతో ప్రాణాలకు ముప్పు
- ఐసీఎంఆర్ స్టడీలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యం బాగుండాలంటే మనం తినే తిండి బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలని డాక్టర్లు చెప్తుంటారు. అన్నంతో పాటు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్తగిన మోతాదులో తీసుకోవాలని సూచిస్తుంటారు. కానీ, మన తెలంగాణలో మాత్రం బ్యాలెన్స్‌డ్ డైట్‌ను నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) స్టడీలో తేలింది.
తాకత్ ఇచ్చే తిండిని వదిలిపెట్టి, పిండి పదార్థాలు తప్ప మరేమీ లేని ఉత్త అన్నాన్ని తెలంగాణ వాళ్లు ఎక్కువ తినేస్తున్నారని
వెల్లడైంది. తెలంగాణ ప్రజలు తినే తిండిలో 67 శాతం అన్నమే ఉంటున్నదని ఈ అధ్యయనం తేల్చింది. ఈ స్టడీ కోసం ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా 1.24 లక్షల మంది నుంచి వివరాలను సేకరించింది. నేషనల్ గైడ్‌లైన్స్ ప్రకారం రోజూ 2వేల క్యాలరీల ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో కేవలం 50 శాతం లోపు మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉండాలి. కానీ, మన రాష్ట్రంలో మాత్రం మొత్తం ఫుడ్‌లో 70 శాతం మేర కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయని తమ స్టడీలో తేలినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
ప్రోటీన్లు, విటమిన్లు తక్కువే..
రాష్ట్రంలో కొవ్వు కూడా ఎక్కువే తింటున్నట్టు స్టడీలో తేలింది. నేషనల్ గైడ్‌లైన్స్ ప్రకారం 10 శాతం కన్నా తక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవాల్సి ఉన్నా.. అంతకుమించి 25 శాతం కొవ్వు పదార్థాలు తింటున్నారని అధ్యయనం స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రొటీన్లు, విటమిన్లు మాత్రం చాలా తక్కువగా తీసుకుంటున్నారని ఐసీఎంఆర్ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రోటీన్, విటమిన్ల ఫుడ్ కేవలం 10 శాతం వరకే ఉంటున్నదని తేల్చి చెప్పింది. పండ్లు చాలా తక్కువగా తింటున్నారని పేర్కొంది. జొన్న రొట్టె, గోధుమ రొట్టె వంటివి తింటున్నా.. ఆశించిన స్థాయిలో లేదని వెల్లడించింది. ప్రోటీన్ కోసం
ఎక్కువగా చికెన్‌పైనే ఆధారపడుతున్నారని, పప్పు తక్కువగా తింటున్నారని పేర్కొంది. ఇటీవల పాలు, పెరుగు వాడకం మాత్రం పెరిగిందని వెల్లడించింది.
ఈశాన్య రాష్ట్రాల్లోనే అన్నం ఎక్కువ..
దేశంలో అన్నం ఎక్కువ తింటున్న రాష్ట్రాల జాబితాలో ఈశాన్య రాష్ట్రాలే టాప్‌లో ఉన్నాయని స్టడీ తేల్చింది. ఆయా రాష్ట్రాల్లో 99 శాతం అన్నమే తింటున్నారని, ఈ డైట్ బ్యాలెన్స్ మరీ దారుణంగా ఉందని పేర్కొంది. అదే సమయంలో మహారాష్ట్ర, బిహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గోధుమలు, సజ్జలు, జొన్న పిండితో చేసిన రొట్టెలను ఎక్కువగా తింటున్నారని, వాళ్ల డైట్‌లో అదే 80 శాతం వరకు ఉంటున్నదని స్టడీ తేల్చింది.
చర్యలు తీసుకోవాల్సిందే..
కేంద్రం సహా రాష్ట్రాల ప్రభుత్వాలుఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ సూచిం చింది. బ్యాలెన్స్‌డ్ డైట్ ఉండేలా ప్రణాళి కలను ప్రభుత్వాలు రచించాల్సిన అవస రం ఉందని స్పష్టం చేసింది. న్యూట్రిషన్ ప్లాన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సి న అవసరం ఉందని తేల్చి చెప్పింది.
షుగర్, గుండె జబ్బులు పెరుగుతున్నయ్
ఫుడ్‌లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల దేశంలో షుగర్, గుండె జబ్బులు పెరుగుతున్నాయని ఐసీఎంఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశ జనాభాలో ఇప్పటికే 12 శాతం మంది షుగర్ బారిన పడ్డారని, మరో 15.4 శాతం మంది ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఉన్నారని పేర్కొంది. 28.6 శాతం మంది ఊబకాయంతో ఉన్నారని, 40 శాతం మంది కుండ పొట్టతో లావెక్కారని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 68 శాతం (63 లక్షలు) గుండె, షుగర్ సంబంధిత జబ్బుల వల్లేనని పేర్కొంది. ఈ జబ్బుల భారం దేశ జీడీపీలో 2.5 శాతం అని పేర్కొంది.
2060 నాటికి దాదాపు వీటి మీదే రూ.75 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని అంచనా వేసింది. మరోవైపు దేశంలో 15 శాతం మంది సిగరెట్, బీడీ వంటివి తాగుతుంటే.. ఇది ఊర్లలోనే ఎక్కువగా ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. ఊర్లలో 16 శాతం మంది ధూమపానం చేస్తుంటే, సిటీల్లో 14 శాతం మంది చేస్తున్నట్టు తెలిపింది. ఇక దేశంలో 15 శాతం మంది మందు తాగుతున్నట్టు తెలిపింది.