బస్తీల్లో వైన్ షాపులు వద్దు

బస్తీల్లో వైన్ షాపులు వద్దు
  • కాలనీలు, బస్తీల్లో స్థానికుల ఆందోళనలు
  • నివాస ప్రాంతాల నుంచి తరలించాలని వందల్లో కంప్లయింట్లు
  • సాయంత్రం బయటకు రావాలంటేనే మహిళల్లో నెలకొన్న భయం
  • కాలనీ సంఘాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోని సర్కార్​

‘బంజారాహిల్స్ టు ఖైరతాబాద్ మెయిన్​రోడ్లను కలిపే రోడ్డు అది. సాయంత్రం ఆరు దాటిందంటే ఆ రోడ్డుపై నడవడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. వెహికల్స్​తో రోడ్డు బ్లాక్ అవడమే కాకుండా మూడు రోడ్ల చౌరస్తాలో   ఉండే వైన్ షాప్ వద్దకు వచ్చే మందుబాబులతో కిక్కిరిసి ఉంటుంవది. కూరగాయల మార్కెట్, చికెన్ సెంటర్లు, కిరాణా, బట్టల షాపులకు వచ్చిపోయే వారితో నడవడమే కష్టంగా మారింది. తాగిన మత్తులో జనాలపైకి వచ్చే మందుబాబులను తప్పుకుని వెళ్లేందుకు కూడా భయపడుతుంటారు.’

‘ రైల్వే ప్యాసింజర్లు, గాంధీ ఆస్పత్రికి వచ్చిపోయేవారితో రోజూ రద్దీగా ఉండే ఏరియా అది. ఆ పక్కనే 800 కుటుంబాలు నివసించే పెద్ద అపార్టుమెంట్ ఉంటుంది. ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రి పరిసరాల్లో కొత్తగా వైన్​ షాపుకు ప్రభుత్వం పర్మిషన్​ఇచ్చింది. దీంతో అపార్టుమెంట్ వాసులు రోడ్డెక్కి వైన్ షాపు వద్దొంటూ వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు.  రెండు వేల మంది ఉండే అపార్టుమెంట్ వాసులకు వైన్​షాపుతో ఇబ్బందులు వస్తాయని  మొత్తుకుంటున్నా పట్టించుకునేటోళ్లు లేరు’.

హైదరాబాద్, వెలుగు: కొత్త మద్యం షాపుల ఏర్పాటుపై ఆందోళనలు, ధర్నాలతో స్థానికులు రోడ్డెక్కుతున్నారు. రెసిడెన్షియల్ ఏరియాల్లో సర్కార్​ పర్మిషన్​ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెండర్​ దక్కించుకున్న నిర్వాహకులు షాపులు ఏర్పాటు చేస్తుండగా వాటి ముందు కూర్చొని నిరసనలు తెలుపుతున్నారు. గతంతోనే  ఇబ్బందులపై అధికారులకు కంప్లయింట్​చేసినా పట్టించుకోవలేదని గ్రేటర్ లోని పలు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మహిళలు, యువతులు బయటకు వెళ్లాలంటేనే భయ పడాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. రెండేళ్ల కిందట కంటే దాదాపు 60 షాపులకు అధికంగా   కొత్తగా ప్రభుత్వం పర్మిషన్​ ఇవ్వడంతో మళ్లీ గ్రేటర్ లో ఆందోళనలు మొదలయ్యాయి. పలు కాలనీల్లో ఇండ్లు, అపార్ట్​మెంట్ల  మధ్య, రద్దీ ప్రాంతాలు, స్కూళ్లు కాలేజీలకు దగ్గరలో పర్మిషన్​ ఇవ్వడంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. షాపులకు రెండేండ్ల పాటు పర్మిషన్​ఉండగా మందు బాబుల ఆగడాలను భరించలేమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాలేజీలు, స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్లే మెయిన్​రూట్లలో ఏర్పాటైన వైన్ షాపులతోనే ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మొత్తం 615 మద్యం షాపులకు ప్రభుత్వం పర్మిషన్​ ఇచ్చింది.  రెసిడెన్షియల్ ఏరియాలు, బడి, ప్రార్థనా మందిరాల లాంటి ప్రాంతాలకు వంద మీటర్ల దూరంలో వైన్ షాపు ఏర్పాటు చేయాలని నిబంధన లేవి పట్టించుకోలేదు.  దాదాపు 70 షాపులకు రెసిడెన్షియల్ ఏరియాల్లోనే పర్మిషన్ ఇవ్వగా, వద్దంటూ స్థానికుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తవుతున్నాయి.   

వైన్ షాపు వద్దంటూ ‘హక్కు క్యాంపెయిన్​’
మద్యం టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో నిర్వాహకులు షాపులు తెరిచేందుకు రెడీ అవగా సిటీవ్యాప్తంగా  ఆందోళనలు జరుగుతున్నాయి.  10 రోజులుగా తమ ప్రాంతంలో వైన్ షాపులు వద్దని వ్యతిరేకిస్తూ 53 కాలనీల్లో జనాలు నిరసనలు తెలుపుతున్నారు. గాంధీ ఆస్పత్రి సమీపంలోని బోయిగూడ చౌరస్తాలో షాపు ఏర్పాటు చేసుకునేందుకు వచ్చిన నిర్వాహకులను జయదుర్గా అపార్టుమెంట్ వాసులు అడ్డుకున్నారు. మల్కాజిగిరిలోని సంతోషినగర్ – ఓల్డ్ సఫిల్ గూడ కాలనీవాసులు 4 రోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు.  కూకట్ పల్లిలోని జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజుల రామారం, జీడిమెట్ల–సుచిత్ర, రహ్మత్ నగర్ డివిజన్ తోపాటు, బౌద్ధ నగర్, సరూర్ నగర్, గడ్డి అన్నారం వంటి ఏరియాల్లో ఆందోళనలు చేస్తున్నారు.  వైన్ షాపులు వద్దనడం తమ హక్కు అని ముషీరాబాద్ కు చెందిన నెటిజన్లు ‘ హక్కు క్యాంపెయిన్ చేపట్టారు. నెటిజన్ల నుంచి సర్కార్​పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్​లేకపోవడంతో తొలగించేవరకు ఉద్యమిస్తామంటూ ఆయా కాలనీల వాసులు స్పష్టం చేస్తున్నారు.

సాయంత్రమైతే ఇదీ పరిస్థితి.. 
సాయంత్రం తర్వాత బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంటోంది. పర్మిట్ రూమ్​లు లేని వైన్ షాపుల ముందే మందుబాబులు తాగి ఊగుతుంటారు. గతంలో మందుబాబుల కారణంగా అర్ధరాత్రి కూడా గొడవలు అయ్యేవని ఖైరతాబాద్​లోని ఆనంద్ నగర్​లో ఉండే సుగుణాకర్ పేర్కొన్నాడు. పొద్దంతా పనులకు పోయి వచ్చే కార్మికులు సాయంత్రం వైన్​షాపులకు వస్తుండగా రద్దీగా ఉంటోందని బౌద్ధనగర్ వాసులు తెలిపారు. షాపుల ముందే మూత్రవిసర్జన చేస్తారని, బయట నుంచి రాత్రి 10 తర్వాత ఇంటికి వెళ్లాలంటేనే ఆటోవాలాలు, మందుబాబులతో ఇబ్బందులు తప్పవంటున్నారు.  వాహనాలకు 
అడ్డుగా వచ్చి ఇబ్బందులు పెడుతుంటారని, గొడవలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయని చిలుకా నగర్ లోని ఓ వైన్ షాప్ పక్కనే ఉండే కాలనీవాసులు పేర్కొన్నారు. 

వైన్ షాపులే దగ్గరగా ఉన్నయ్
గ్రేటర్ లో  రెసిడెన్షియల్ కాలనీ అసోసియేషన్లు వైన్ షాపులపై ఆందోళన చేస్తున్నారు. కొత్తగా టెండర్లు పిలిచిన ప్రతిసారి సమస్య వస్తూనే ఉంది. సర్కారు, అధికారులు పట్టించుకోరు. న్యూసెన్స్ గా మారిందని పోలీసులకు కంప్లయింట్​చేసినా చర్యలు ఉండవు. రెసిడెన్షియల్ ఏరియాలకు దగ్గరగా ఉండాల్సిన రేషన్ షాపుల కంటే వైన్ షాపులే ఉన్నాయి. ఇండ్లకు సమీపంలో ఏర్పాటుకు ప్రభుత్వం పర్మిషన్​ఇవ్వడం సరికాదు.
- శ్రీనివాసన్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్

ఆందోళన చేస్తున్నా​ నో రెస్పాన్స్
ఇండ్ల మధ్యలో వైన్​షాపులు ఏర్పాటు చేస్తే మైనర్లు కూడా మద్యానికి అలవాటు పడిపోతారు. కాలనీల్లోని మహిళలు, యువతులు బయటకు రావాలంటేనే భయపడుతుంటారు. మందుబాబులతో  వేధింపులు కూడా పెరిగే ప్రమాదం ఉంది. గ్రేటర్ లో మద్యం షాపులను ఇండ్ల మధ్యలో ఏర్పాటు చేయొద్దంటూ కాలనీ సంఘాలు ఆందోళన చేస్తున్నా  ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. 
- ఉమేశ్​శ్రీఖండే, సోషల్ వర్కర్