దోపిడీ సొమ్ముతో జాతీయ నాయకుడవుతారా?

దోపిడీ సొమ్ముతో జాతీయ నాయకుడవుతారా?

మోడీ వ్యతిరేక ఫ్రంట్​కు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్​రావును చైర్మన్​గా చేస్తే ప్రతిపక్షాల 2024 ఎన్నికల ఖర్చు మొత్తం తానే భరిస్తాను అని తన కొలీగ్స్​తో చెప్పినట్లు, ప్రముఖ జర్నలిస్టు రాజ్​దీప్​ సర్​దేశాయ్​ తన ‘ వీక్లీ బ్యాట్​బ్లాగ్ ’ లో ​చెప్పడం తెలంగాణ,  దేశ రాజకీయాల్లోనూ ఒక సంచలనంగా మారింది.  అది ఏ ప్రజాస్వామిక విలువలకు సూచి అనేది భారత సమాజం ఆలోచించాల్సి ఉంది. ప్రజలకు డబ్బు ఆశను చూపి ఓటు వేయించుకునే పరిస్థితి నుంచి ఏకంగా పార్టీలనే కొనుక్కుంటే పోదా అనే స్థితికి వచ్చింది. నేడు భారతదేశంలో ఓటును కొనడం నుంచి ఏకంగా పార్టీలకు ఎలక్షన్ల ఖర్చు నేనే భరిస్తాను, తనను నాయకుణ్ని చేయాలని  అడిగే దాకా వచ్చేసింది మన ధనస్వామ్యం!

పురాణాల్లో.. చరిత్రలో రాజుకు పుట్టినవాడు యువరాజుగా మారి రాజయినట్లు, ఇపుడు డబ్బుకు పుట్టినవాడు నాయకుడయ్యే పరిస్థితికి కారణం కేవలం స్వార్థపూరిత ఆలోచనలే తప్ప మరొకటికాదు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్​గా మారిన టీఆర్​ఎస్​ అధ్యక్షుడు తెలం గాణ ఉద్యమం పేరుతో తెరమీదకు వచ్చారు. 1200 విద్యార్థులు, యువకుల ఆత్మబలిదానంతో తెచ్చు కున్న తెలంగాణను వ్యాపార కేంద్రంగా మార్చి లక్షల కోట్లు కొల్లగొట్టి ఆ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టే రాజకీయాలకు తెరలేపుతున్నాడు. 

అంత సంపద ఎక్కడిది? 

స్వాతంత్ర్యం సిద్ధించిన నాటినుంచి ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అభివృద్ధి చెందాయి. ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, పోయాయి. ఎన్నో రాజకీయ కుటుంబాలు పాలించి కనుమరుగయ్యాయి. కానీ ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రాంతీయ పార్టీ కూడా జాతీయనేత కావాలని  కొనుగోళ్లు చేయలేదు. 9 ఏండ్లలో ఎంత డబ్బు సంపాదిస్తే ఇలాంటి సాహసం చేస్తారో  ఎవరికి వారే ఊహించండి!  తెలంగాణ కంటె పెద్ద రాష్ట్రాలు, ఎక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాల నాయకులు కూడా ప్రాంతానికే పరిమితమైనారు తప్ప జాతీయనేత కావాలని కొనుగోళ్ల ఆలోచన ఎవరూ చేయలేదు.  సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న పార్టీలు ఆర్థికంగా ఎంత బలమైన నాయకులుగా ప్రచారంలో ఉన్న వారు కూడా చేయలేని సాహసం తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్నాడు అంటే అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది?    కేసీఆర్​ పరివారం ఆర్థికంగా  ఏమైనా శ్రీమంతులా? అంటే కాదు. అది తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నది. ఇది తెలంగాణ సబ్బండ వర్ణాలు తెలుసుకోవాలి.  తెలంగాణలో సామాన్యుడు రాజకీయాలు చేసే స్థితిని చెదరగొట్టాడు. ఇపుడు అదే పరిస్థితిని దేశం మొత్తం తేవడానికే ఈ వ్యూహం.  ‘ధనంతో జనాన్ని కొనొచ్చు’ అనే నినాదంతో దేశ రాజకీయాల్లో అవాంఛనీయ పరిణామాలు తీసుకురావాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. 

‘చంద్రముఖి’ గా మారుతాడనుకోలె

రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్​కిషోర్​తో కాంగ్రెస్​ పార్టీ వద్దకు వస్తే తిరస్కరించిన వైనం జనసామాన్యానికి తెలుసు. ఈ దేశ ప్రజాస్వామ్యానికి మూలమైన కాంగ్రెస్ ​పార్టీ అలాంటి ప్రతిపాదన తిరస్కరించగానే యూపీఏ అలయెన్స్​ పార్టీలతో కాంగ్రెస్​ పార్టీపై ఒత్తిడి పెంచాలని చూసాడు. అదీ కుదరక కొంత మంది జాతీయ ముఖ్యనేతలతో కాంగ్రెస్​ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేసి భంగ పడ్డాడు.  ఇపుడు బహిరంగ ప్రతిపాదనతో రాజకీయ పార్టీలకు కేసీఆర్ ​ఓపెన్​ ఆఫర్​ ఇచ్చాడు. మా సహచర ఉద్యమకారుడిగా కేసీఆర్​లో పాపులిస్టిక్​ టాక్టిక్స్​ చూశామే కానీ ఇలాంటి స్వార్థపూరిత ఎత్తుగడలు గమనించలేదు. భారత రాజ్యాంగాన్ని మార్చాలన్నపుడు అనుమానం వచ్చినా.. ఇంతలా పూర్తి ‘చంద్రముఖి’గా మారుతాడని ఊహించలేదు.  దొడ్డిదారిన రాజ్యాంగంలో తన రాజకీయ జీవితాన్ని చూడాలనుకోవడం ఆయన చేస్తున్న తప్పు. రాజు, రాజరికానికి వ్యతిరేకంగా భారతదేశంలో పార్లమెంటరీ డెమాక్రసీని తెచ్చుకుంది దీనికోసమా? ఎంతో మంది ఆనాడు ప్రెసిడెన్సియల్​ ఫామ్​ ఆఫ్​ డెమాక్రసీని కోరుకున్నా.. అంబేద్కర్​ ససేమిరా అన్నది ఇలాంటి వాళ్లు వస్తారనే భయంతోనే. 

కేసీఆర్ అవినీతి పాలనపై చర్యలేవి?

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మరో రూపంలో వ్యక్తి కేంద్రక, ధనకేంద్రక రాజకీయాలు చేయాలని కేసీఆర్​ చూస్తున్నాడు.  కులం, మతం, ప్రాంతం రాజ్యాంగానికి అవరోధాలు కలిగిస్తాయని అంబేద్కర్​ భావించాడు కానీ ధనం కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని  ఊహించలేదేమో? అంబేద్కర్​ ఐకానిక్​ పాలిటిక్స్​ను వ్యతిరేకించాడు కానీ ధనమే రాజ్యాన్ని ఏలే రోజులు వస్తాయని ఊహించి ఉండరు! ఇలాంటి ప్రమాదకర రాజకీయ నాయకత్వం దేశంలో పుట్టుకొస్తుందని ఊహకందని విషయమే! ఇవన్నీ బీజేపీ నాయకత్వానికి తెలియదా? మూడవ ప్రత్యామ్నాయం ఈదేశంలో  పుట్టాలని వారు కోరుకుంటున్నారా?   తన మిత్ర పక్షాన్ని ప్రతిపక్షంగా మార్చుకొని శాశ్వతంగా కాంగ్రెస్​ ముక్త్​ భారత్​కు సుగమం చేసే పనిలో బీఆర్ఎస్​ను ప్రోత్సహిస్తున్నారా? బీజేపీయే జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, కేసీఆర్​ ప్రభుత్వ అవినీతిని చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారు. కాబట్టే కేసీఆర్​ ఇలాంటి విశృంఖల నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఎందుకు అనుకోకూడదో ఆ పార్టీయే ప్రజలకు జవాబు చెప్పాల్సిఉంది. లిక్కర్​ స్కాంపై చూపిన  శ్రద్ధ.. కాళేశ్వరం, భగీరథ, కాకతీయ, ధరణి అక్రమాలపై చూపిస్తే.. కేసీఆర్​ ఇంత ధనవంతుడైన రాజకీయ నాయకుడుగా మారేవాడా? కేసీఆర్​ను ఎవరు పెంచిపోషిస్తున్నారో చెప్పాల్సిన జవాబుదారి ఎన్​డీఏ ప్రభుత్వానిదే! 

ఇప్పటి వరకు మనం క్రోనీ క్యాపిటలిస్టులనే చూశాం. ఇక నుంచి ‘క్రోనీ పాలిటిక్స్​’ నూ చూడాల్సి వస్తున్నదేమో?  ఏది ఏమైనా భారత ప్రజలపై నమ్మకం ఉంది. ‘భారత ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం’గా మారకుండా చూసే చైతన్యశీలురు మన ప్రజలే.  భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే రాజకీయ చైతన్యం వైపు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. సేవ్​ డెమాక్రసీ, సేవ్​ కానిస్టిట్యూషన్ కోసం ఉద్యమించాలి.  దోపిడీ చేసిన డబ్బుతో భారత రాజకీయాలను కొనుగోలు చేయాలనుకునే శక్తులను ఓడించడానికి సమాజం సిద్ధంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది.

దోపిడీ సొమ్ముతో జాతీయ నాయకుడవుతారా?

గొర్లు, చేపలు, దళితబంధు, కల్యాణలక్ష్మి, రైతుబంధు లాంటి ఆచరణలో విఫలమైన పథకాలను చూపి.. భూములు, కాంట్రాక్టులు, వ్యాపారాలను తన వాళ్లకు కట్టబెట్టడం ద్వారా కూడబెట్టిన లక్షల కోట్ల ఆస్తుల నుంచి వస్తున్న  దమ్ము, ధైర్యమే.. దేశ రాజకీయాల కొనుగోలు వరకు తీసుకెళుతున్నది. దోపిడీ వర్గాలకు తొత్తుగా మారడం ద్వారా వస్తున్న ధైర్యం అది. పెట్టుబడిదారులకు ఆశ్రితపక్షపాతం చూపించడం ద్వారా వస్తున్న ధనంతో చేస్తున్న కొనుగోలు ప్రకటనలవి. ఇదేనా కేసీఆర్​ నుంచి  తెలంగాణ సమాజం కోరుకున్నది? తెలంగాణలో చేసిన దోపిడీ  సంపదను తన రాజకీయ ఎదుగుదలకు దేశం మొత్తం పంచడానికేనా ప్రజలు అతనికి పట్టం గట్టింది? 125 అడుగుల అంబేద్కర్​ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదే అంబేద్కర్​ ఆలోచనా విధానమైన ‘భారత రాజ్యాంగ’ ద్రోహ రాజకీయాలు చేస్తున్నాడు. ‘వన్​ మ్యాన్​ వన్​ ఓట్​ వన్​ ఓటర్​ వన్​ వ్యాల్యూ’ అన్న అంబేద్కర్​ సామాన్యుడికి ఓటు హక్కు కల్పిస్తే దాన్ని అవినీతిమయం చేసాడు.  ఇపుడు అదే రాజ్యాంగస్ఫూర్తికి తూట్లు పొడిచే విధంగా దేశ రాజకీయ వ్యవస్థకు మూల స్థంభాలైన రాజకీయ పార్టీలను హోల్​సేల్​గా కొనాలని చూస్తున్నాడు. రాజ్​దీప్​ సర్దేశాయ్​ లాంటి సీనియర్​ జర్నలిస్టు ట్వీట్​ ద్వారా ఈ అంశం తెరమీదకు వచ్చినా.. తెర వెనుక ఎప్పటి నుంచో ఈ తతంగం నడుస్తున్న తీరు కాంగ్రెస్​పార్టీకి తెలుసు.

 - డా. అద్దంకి దయాకర్​, ప్రధాన కార్యదర్శి,  టీపీసీసీ