
ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం వేళ ప్రధాని నరేంద్ర మోడీకి తమిళ పురోహితులు రాజదండాన్నిబహుకరించిన సమయంలో ఓ వ్యక్తి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయనే ఎతి రాజులు. ఆయన వయసు 95 ఏళ్లు. ఆయన ప్రధానికి రాజదండం బహుకరించే వేళ కళ్లల్లో ఆనందభాష్పాలు కనిపించటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయనకు ఈ రాజదండానికి విడదీయని అనుబంధం అలాంటిది.
ఆయనే తయారు చేశారు
1947లో రాజగోపాలాచారి సూచన మేరకు రాజదండాన్ని తయారుచేసే పనిని చెన్నైలోని ‘ ఉమ్మడి బంగారుచెట్టి జూవెలర్స్’ కు అప్పగించారు.. అప్పుడు ఆ సంస్థను నడుపుతున్న ఉమ్మిడి ఎత్తిరాజులు, ఉమ్మిడి సుధాకర్ అనే అన్నదమ్ములు తివావదుత్తరై ఆధీనం పీఠాధిపతులను సంప్రదించి చోళరాజుల సాంప్రదాయం ప్రకారం నియమనిష్టలతో చారిత్రక రాజదండాన్ని తయారు చేశారు. ఆ తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చాక మౌంట్ బాటన్ సమక్షంలో అప్పుడు 1947లో నెహ్రూకు రాజదండాన్ని బహుకరించే సమయంలో ఎతిరాజులే తాము తయారు చేసిన ఆ రాజదండాన్ని ఢిల్లీకి తీసుకొచ్చారు.
ఇన్నేళ్ల తర్వాత మళ్లీ..
ఇప్పుడు మళ్ళీ అదే రాజదండం తన కళ్ళముందు ప్రధాని మోదీకి బహుకరిస్తున్న సన్నివేశం చూసి ఆయన భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. తమిళనాడు నుంచి వచ్చిన పురోహితులతో పాటు ఎతి రాజులును కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గరుండి ఢిల్లీ తీసుకొచ్చారు. ఈ చారిత్రక ఘట్టానికి రెండు సార్లు సాక్షిగా నిలవటం చరిత్రలో నిలిచిపోతుందని ఎతిరాజులు తన సన్నిహితులతో ఉద్వేగంగా అన్నారు. ఆయనే ఉమ్మడి ఎత్తిరాజులు. మరి ఆయనది ఎంతటి ధన్యమైన జీవితమో..