ప్రోఫీ ప్రత్యేకత ఏంటంటే

ప్రోఫీ ప్రత్యేకత ఏంటంటే

ప్రొటీన్స్ తెలుసు, కాఫీ తెలుసు. కానీ,  ఈ రెండింటి కాంబినేషన్‌‌తో చేసే ప్రోఫీ గురించి తెలుసా?  ఎనర్జీతో పాటు మంచి పోషకాలను కూడా అందించే ఈ డ్రింక్ ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. అసలీ ప్రోఫీ ప్రత్యేకత ఏంటంటే...

ప్రోఫీ అనేది ఫిట్‌‌నెస్ ప్రియుల కోసం తయారుచేసిన కొత్త రకం డ్రింక్. ఇది బరువు తగ్గడానికి, ఫోకస్ పెరగడానికి అలాగే ఇన్‌‌స్టంట్ ఎనర్జీ ఇవ్వడానికి పనికొస్తుంది. సాధారణంగా జిమ్‌‌లో వర్కవుట్స్ చేసేవాళ్లు పోస్ట్ వర్కవుట్, ప్రి వర్కవుట్స్ టైంలో ప్రొటీన్ షేక్స్, కాఫీ షాట్స్ తీసుకుంటుంటారు. కాఫీ శరీరానికి తక్షణ శక్తినిస్తే.. ప్రొటీన్ కండరాలకు పోషణనిస్తుంది. అందుకే ఈ రెండింటిని కలిపి కొత్త ప్రయోగం చేశారు న్యూట్రిషనిస్టులు. అదే ప్రోఫీ. ఇది తయారుచేయడం చాలా ఈజీ. దీన్ని చాలారకాలుగా ట్రై చేయొచ్చు. ప్రొటీన్ డ్రింక్‌‌లో కోల్డ్ కాఫీ కలపొచ్చు లేదా పాలతో చేసిన కాఫీలో ప్రొటీన్ పౌడర్ కలపొచ్చు. ఇంకా వేరే రకాలుగా కూడా ట్రై చేయొచ్చు. ప్రొటీన్స్, కెఫిన్.. ఈ రెండు ఇంగ్రెడియెంట్స్‌‌తో ఎలా చేసినా ప్రోఫీ రెడీ.

డైలీ వర్కవుట్లు చేసేవాళ్లకు ప్రోఫీ మంచి ఆప్షన్. దీంతో కొవ్వు కరగడమే కాకుండా మజిల్ మాస్ కూడా పెరుగుతుంది. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మెటబాలిజం తగ్గుతుందంటున్నారు న్యూట్రిషనిస్ట్‌‌లు. ఇన్‌‌స్టంట్ ఎనర్జీ లభించినా కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లాంగ్ రన్‌‌లో ఎముకల ఆరోగ్యం పాడవుతుందట. అందుకే  రోజుకు ఒక కప్పు కంటే ఎక్కువ ప్రోఫీ తీసుకోవద్దని సూచిస్తున్నారు.