విజయదశమి రోజున జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారో తెలుసా....

విజయదశమి రోజున జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారో తెలుసా....

దసరా చివరిరోజు విజయదశమి.. ఈ రోజుకు ఎంతో విష్టత ఉంది. ఆరోజు శమీ వృక్షం అంటే జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు చాలా మంది. ఇలా ఎందుకు చేస్తారు..? అసలు విజయదశమికి శమీ వృక్షానికి ఉన్న సంబంధం ఏంటి..?

శమీవృక్షం పాపాన్ని పరిహరిస్తుంది. శత్రువులను నాశనం చేస్తుంది. ఇది  అర్జునుని ధనువును కాపాడిందని పండితులు చెబుతుంటారు. శ్రీరాముడికి ప్రియాన్ని కలిగించింది. జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. విజయదశమి రోజున పూజలు అందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, ధన స్థానంలో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ధి జరుగుతుందని నమ్మకం.

 పరమ శివునికి, జగన్మాత దుర్గాదేవికి, సిద్ధి ప్రదాత వినాయకుడికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. అంతేకాదు, జమ్మి చెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే పూర్వం యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారట. ఇప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాల్లో శమీ వృక్షంలో అగ్ని దాగి ఉంటుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. అందుకే దేవాలయాల ప్రతిష్టల సమయంలో జమ్మి చెట్టు బెరడల నుంచి అగ్నితో హోమం ప్రారంభిస్తారు. 

 విజయదశమి రోజే రోజే రాముడు రావణునిపై విజయం సాధించాడట. విజయదశమి రోజునే ఉత్తర గోగ్రహణానికి వెళ్లిన అర్జునుడు విజయంతో తిరిగొచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు.

పాండవులు అజ్ఞాతవాసం చేయాలని సంకల్పించినపుడు తమ ఆయుధాలను ఈ జమ్మి చెట్టుమీద దాచి విరాటరాజు కొలువుకు చేరారని ఆధ్యాత్మిక వేత్తలు పలు వేదికలపై చెప్పారు.  అజ్ఞాతవాసం ముగిసే సమయాన ఉత్తరుని సహాయముతో అర్జునుడు శమీ వృక్షాన్ని చేరి పూజించి, తాము దాచి ఉంచిన ధనస్సు, బాణాలనూ ధరించి శత్రువులతో యుద్ధం చేసి... విజయం సాధించాడని యుద్ద కాండలో ఉందని పండితులు చెబుతున్నారు. ఈ కారణంగానే శమీ వృక్షపూజ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. అందుకే ఏదైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకొనేవారు విజయదశమి రోజున ప్రారంభిస్తే మంచిదని పెద్దలు చెబుతారు.