దేవుడి దగ్గర దీపం ఎందుకు వెలిగించాలో తెలుసా..

దేవుడి దగ్గర దీపం ఎందుకు వెలిగించాలో తెలుసా..

 దేవునికి దీపం వెలిగించడంలో విశిష్టత ఏమిటి.? అసలు దేవుడి దగ్గర దీపం ఎందుకు వెలిగించాలి.. దేవుడి దగ్గ ర దీపం కొండెక్కితే ( ఆరిపోతే) ఏం జరుగుతుంది.. అది శుభమా.. అశుభమా.. అలా జరిగితే దేనికి సంకేతం. ఒక వేళ దీపం ఘనమైతే(ఆరిపోతే) ఏం చేయాలి..  ఇంతకీ దీపం ఆగిపోతే ఏమవుతుంది...ఏం చేయాలి? మొదలగు విషయాలు తెలుసుకుందాం. . . .

హిందూ సంస్కృతిలో ప్రతిరోజు చాలా మంది పూజలు చేస్తుంటారు.  పూజ చేసే ముందు దీపం వెలిగిస్తారు.  ఈ సంప్రదాయం త‌ర‌త‌రాలుగా కొన‌సాగుతోంది.  ఇంటి ప్రధాన ద్వారం ముందు, తులసి మొక్క ముందు ప్రతిరోజూ దీపం వెలిగిస్తారు.  ఒక్కో  సమయంలో పూజ చేస్తుండగా దీపం అకస్మాత్తుగా ఆరిపోయినట్లయితే, అది అప‌ శకునంగా, అశుభంగా పరిగణిస్తుంటారు. పూజ చేసేట‌ప్పుడు దీపం ఆరిపోతే అది దేనిని సూచిస్తుంది? అసలు ఆరిపోవడం అనే పదం వినియోగించడమే అపచారం అని కొండెక్కిందని, ఘనమైందని అనాలంటారు.

 దేవునికి దీపం వెలిగించడంలో విశిష్టత 

దేవతారాధన, హవనం, పారాయణ లేదా ఏదైనా శుభ కార్యక్రమంలో దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణిస్తారు. దీపం వెలిగించడం వల్ల జీవితంలోని చీకట్లు తొలగిపోవడమే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి కూడా తొలగిపోతుంది. చీకటిలో దీపం మనకు త్రోవ చూపించి ధైర్యాన్ని ఇస్తుంది, దీపంతో వెలుగు ఏర్పడుతుంది. శాస్త్రాల ప్రకారం, దీపం వెలిగించడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. దీపం అంటే జ్ఞానం. దీపం మన జ్ఞానాన్ని వెలిగించి మనలోని చెడు అనే చీకట్లను పారదోలుతుంది.అందుకే మనలోని అహాన్ని దీపపు వెలుగుల్లో ఆవిరిచేయాలి. అలాగే దీపం వెలిగించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు.

దీపం పరమార్దం ఏంటంటే.....

దీపం ఎప్పుడూ పైకి వెలుగుతూ వుంటుంది. వెలిగే ఆ దీప శిఖస్పూర్తిగా మనంఏ ఒక్కరికీ ఎలాంటి పరిస్థితుల్లోనూ చెడు చేయకుండా వెలుగులు నింపాలి. పవిత్రంగా పైకి ఎగసే ఆ జ్ఞానపు వెలుగులను స్ఫూర్తిగా తీసుకుని మనం కూడాఉన్నత శిఖరాలను అందుకోవాలన్నదే దీప పరమార్థం.

దీపం అకస్మాత్తుగా ఆరిపోతే ...

పూజ సమయంలో దీపం ఆరిపోవ‌డం సాధారణంగా అప‌ శకునంగా పరిగణిస్తారు. పూజ సమయంలో దీపం ఆరిపోతే, అది దేవతలు మనపై అసంతృప్తితో ఉన్నారని సూచిస్తుంది. పూజ పూర్తికాలేదని, పూజ చేసినా పూర్తి ఫలం మీకు లభించదని అర్థం. అంతేకాదు, దేవుని ముందు మీరు కోరిన‌ కోరిక నెరవేరదని అర్థం. మనిషి పవిత్రమైన మనస్సుతో భగవంతుడిని పూజించకపోయినా, దేవుని దీపం కొండెక్కిపోతుందంటారు.  అందుకే  పూజ సమయంలో దీపం ఆరిపోవడానికి గాలి, దీపంలో  తగినంత నెయ్యి లేదా నూనె లేకపోవడం వంటి ఇతర కారణాలు ఉండవచ్చు. అలాంటి పరిస్థితిలో, పూజ సమయంలో మీరు వెలిగించిన‌ దీపం ఆరిపోతే, భ‌గ‌వంతుడికి క్షమాపణ చెప్పి మళ్లీ దీపం వెలిగించండి. దీపంలో తగినంత నెయ్యి లేదా నూనె ఉండేలా చూసుకోవాలి. కానీ...అస్సలు ఇలాంటివి పట్టించుకోరాదు..దేవుడిపై భక్తి ప్రధానం అంటారు మరికొందరు పండితులు.

 అఖండ జ్యోతి వెలిగించేటప్పుడు ...

ఒక వ్యక్తి తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి అఖండ జ్యోతిని వెలిగిస్తే దానిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అఖండ జ్యోతి కొండెక్కితే కోరిక తీరదు. అలా జరగకుండా ఉండాలంటే   జ్యోతి నిరంత‌రంగా వెలిగేలా, దాని చుట్టూ ఒక గాజు పాత్ర ఉంచండి, దానిలో పుష్కలంగా నూనె లేదా నెయ్యి పోయండి. అలాగే అఖండ జ్యోతి పక్కన చిన్న దీపం వెలిగించండి. అఖండ జ్యోతి పెద్ద దీపం కొండెక్కిపోతే ఈ చిన్న దీపంతో మళ్లీ అఖండ జ్యోతిని వెలిగించవచ్చు.

దీపాన్ని వెలిగించేటప్పుడు చదవాల్సిన మంత్రం

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే... సర్వం సంధ్యాదీపం నమోస్తుతే.. ఇలా దీపం వెలిగించి మన లోని చెడుని అహాన్ని ఆవిరి చేయాలి. అప్పుడే దీపాన్ని వెలిగించిన ఫలితం దక్కుతుంది.


మనం చేసే పూజలు భగవంతుడికి ఆమోదయోగ్యం కానప్పుడు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, మనం ప్రార్థించిన కోరికలు తీరనప్పుడు, దేవుని వ‌ద్ద వెలిగించిన‌ దీపం ఆరిపోతుందని చాలామంది విశ్వాసం. అయితే దీపం కొండెక్కడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు...ఆ సమయంలో భగవంతుడికి నమస్కరించి తిరిగి వెలిగించండి కానీ ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదంటారు పండితులు.