హార్ట్ పేషెంట్‌కు ట్రీట్‌మెంట్‌ చేస్తుండగా డాక్టర్ గుండె ఆగింది

హార్ట్ పేషెంట్‌కు ట్రీట్‌మెంట్‌ చేస్తుండగా డాక్టర్ గుండె ఆగింది
  • ఇద్దరూ మృతి.. కామారెడ్డి జిల్లాలో ఘటన

కామారెడ్డి, వెలుగు: హార్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ కు ట్రీట్ మెంట్ చేస్తుండగా, డాక్టర్ కు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. డాక్టర్, పేషెంట్ ఇద్దరూ చనిపోయారు. ఈ ఘటన ఆదివారం కామారెడ్డి జిల్లాలో జరిగింది. గాంధారి మండలం గుజ్జుల్ తండాకు చెందిన కాట్రోతు జక్యానాయక్ (58) శనివారం గొల్లాడి తండాలోని చుట్టాల ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం ఆయనకు హార్ట్​స్ర్టోక్ రావడంతో కొడుకు రవికి బంధువులు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన రవి.. తండ్రిని ట్రీట్ మెంట్ కోసం గాంధారిలోని ఎస్వీ నర్సింగ్ హోమ్ కు తీసుకెళ్లాడు. డాక్టర్ లక్ష్మణ్ పేషెంట్ జక్యా నాయక్ కు ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశాడు. ఇంతలో డాక్టర్ కు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. లక్ష్మణ్​ అక్కడికక్కడే కింద పడిపోయాడు. ఆందోళన చెందిన రవి... తన తండ్రి జక్యా నాయక్ ను ట్రీట్ మెంట్ కోసం కామారెడ్డి హాస్పిటల్ కు తరలించాడు. అయితే అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. మరోవైపు హార్ట్ స్ట్రోక్ వచ్చిన డాక్టర్ లక్ష్మణ్ తన ఆస్పత్రిలోనే చనిపోయారు. హైదరాబాద్​కు చెందిన డాక్టర్ ​లక్ష్మణ్ నిజామాబాద్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్​ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం గాంధారిలో నర్సింగ్ హోమ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయన అయ్యప్ప మాలలో ఉన్నారు.